మోదీకి ఇవే చివరి ఎన్నికలు

Mamata and Kejriwal and Chandrababu Comments in Visakhapatnam election - Sakshi

ఆయన మళ్లీ వస్తే ఎన్నికలు రాకుండా చట్టాలు చేస్తారు

ఈ దేశానికి ఆయన అవసరంలేదు

ఎన్డీఏకు ఈసారి 125 సీట్లకు మించి రావు

నోట్ల రద్దుతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందిపడ్డారు

మోదీ–కేసీఆర్‌వి కుట్ర రాజకీయాలు

విశాఖ ఎన్నికల సభలో మమత, కేజ్రీవాల్, చంద్రబాబు

సాక్షి, విశాఖపట్నం/తుని: ప్రధాని నరేంద్ర మోదీ–అమిత్‌షాలకు 2019 ఎన్నికలే చివరి ఎన్నికలని.. ఆ తర్వాత వాళ్లిద్దరూ గుజరాత్‌ పారిపోక తప్పదని పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, ఏపీ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, కేజ్రీవాల్, చంద్రబాబునాయుడు జోస్యం చెప్పారు. గతంతో పోలిస్తే ఈసారి దేశంలో ప్రాంతీయ పార్టీలన్నీ చాలా బలంగా ఉన్నాయని, ఎన్డీఎకు ఈసారి 125 సీట్లకు మించి వచ్చే అవకాశం ఎంతమాత్రం లేదన్నారు. విశాఖ ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్‌ స్టేడియంలో ఆదివారం సాయంత్రం టీడీపీ ఎన్నికల ప్రచార సభలో వారు మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ ఈ దేశానికి అవసరంలేదన్నారు. 

బీజేపీ షాపింగ్‌ మాల్‌ పార్టీ : మమత
దేశంలో మోదీ–అమిత్‌షా నేతృత్వంలోని బీజేపీ.. షాపింగ్‌ మాల్‌ పార్టీగా మారిపోయందని మమతా బెనర్టీ ఎద్దేవా చేశారు. మోదీ తాను టీవాలను అని చెప్పడంతో ప్రజలు విశ్వసించారని.. ఆ తరువాత కాపలాదారుడిగా ఉంటాననడంతో ప్రజలు పట్టాం కట్టారన్నారు. కానీ, ఇప్పుడు సామాన్య ప్రజలను దోచుకుని కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెడుతున్నారని విమర్శించారు. అడ్డువచ్చిన వారిని ఈడీ, ఐటీ, సీబీఐలతో భయపెడుతున్నారని ఆరోపించారు. ఇది ధృతరాష్టుడి పాలన అని దీదీ ఆరోపించారు. రఫెల్‌ కుంభకోణంపై కనీసం స్పందించలేదన్నారు. యుద్ధం చేసే ముందు అన్ని పార్టీలను సమావేశపర్చాలని.. కానీ ఎవరికీ సమాచారం ఇవ్వలేదన్నారు. దేశాన్ని బతికించాలంటే మోదీని గద్దె దింపాలని మమత కోరారు. కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. దేశంలో పెద్ద అవినీతి అంశం నోట్ల రద్దని విమర్శించారు. ఈ కారణంగా సామాన్య మధ్య తరగతి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. దేశ భవిష్యత్‌కు ఏపీ భవిష్యత్‌కు ఈ ఎన్నికలు ఎంతో కీలకమన్నారు. మోదీ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు. 

అందుకే కాంగ్రెస్‌తో దోస్తీ : చంద్రబాబు
కాగా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. ఇదే వేదికపై ఐదేళ్ల క్రితం మోదీ విభజన హామీలు అమలుచేస్తానని హామీ ఇచ్చారని.. ఇప్పుడు తానేం చేశానో చెప్పే ధైర్యం ఆయనకు ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ తాను చేసిన పొరపాటును గుర్తించి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించడంవల్లే ఆ పార్టీతో పనిచేసేందుకు సిద్ధపడ్డామన్నారు. కేంద్రం సహాయం చేయకపోయినా ఏపీని 10.82 వృద్ధి రేటుతో అభివృద్ధి ప£ýథంలో తీసుకెళ్తున్నామన్నారు. వ్యవసాయ రంగంలో దేశం 2.7శాతం వృద్ధి రేటుతో ఉంటే ఏపీ ఏకంగా 11 శాతం వృద్ధి రేటు సాధించిందని చంద్రబాబు చెప్పారు.

అంతకుముందు తుని రాజా కళాశాల మైదానంలో జరిగిన సభలోనూ చంద్రబాబు మాట్లాడారు. ఐదేళ్లలో దేశానికి మోదీ ఏం చేశారో.. తాను రాష్ట్రానికి ఏం చేశానో అన్న అంశంపై చర్చకు సిద్ధమా అని సవాల్‌ చేశారు. మోదీ, కేసీఆర్‌లు కుట్ర రాజకీయాలు చేస్తున్నారన్నారని మండిపడ్డారు. చివరకు రాష్ట్ర అధికారులపై వేటు వేసేందుకు ఎన్నికల కమిషన్‌ను వాడుకుంటున్నారని విమర్శించారు. తెలుగు వారి ఆత్మగౌరవం నిలబడాలంటే టీడీపీని గెలిపించాలని చంద్రబాబు కోరారు. రాష్ట ప్రగతి విషయంలో తాను నంబర్‌ వన్‌ డ్రైవర్‌గా పనిచేశానన్నారు. టీడీపీ విజయాన్ని ఎవరూ అపలేరని, అడ్డుకోవాలని చూస్తే సుడిగాలిలో కొట్టుకుపోతారన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top