ముగ్గురు సీఎంల సభ వెలవెల

Chandrababu Naidu Public Meeting Flop In Visakhapatnam - Sakshi

నగరవాసుల నుంచి కానరాని స్పందన

హిందీలో మాట్లాడిన కేజ్రీవాల్‌

హిందీ, బెంగాలీ, తెలుగు కలగలిపిన దీదీ

ఊకదంపుడు ఉపన్యాసంతో బాబు

అర్థం కాక తలలు పట్టుకున్న తెలుగు తమ్ముళ్లు

సాక్షి, విశాఖపట్నం/జగదాంబ:ముగ్గురు ముఖ్యమంత్రులు వచ్చారు. మా బాబు ప్రసంగం ఎలాగూ ఆకట్టుకోదు. కనీసం ఆ వచ్చే ఇద్దరి ముఖ్యమంత్రుల ప్రసంగాలకైనా జనం ఉత్తేజం పొందుతారు.. ఇక మాకు ఢోకా లేదనుకున్నారు టీడీపీ అభ్యర్థులు. కానీ సీన్‌ సివర్స్‌ అయ్యింది. ముఖ్యమంత్రుల ప్రసంగం ప్రారంభం కాక ముందే వచ్చిన ఆ కాస్త జనంలో సగం జారుకున్నారు. పొరుగు ముఖ్యమంత్రుల ప్రసంగాలు ముగిసేసరికి మిగిలిన జనం కూడా వెళ్లిపోయారు. బాబు ప్రసంగించేసరికి మొదటి రెండు గ్యాలరీల్లో తప్ప మిగతా స్టేడియం మొత్తం వెలవెలబోయింది. ఏదో జరుగుతుందని ఆశిస్తే మరేదో జరగడంతో తలలు పట్టుకోవడం అభ్యర్థుల వంతైంది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం విశాఖ ఇందిరా ప్రియదర్సిని మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన టీడీపీ ఎన్నికల ప్రచార సభ అట్టర్‌ ప్లాప్‌ అయ్యింది. సాయంత్రం ఐదు గంటలకే ముఖ్యమంత్రులు ముగ్గురు విశాఖకు చేరుకున్నారు. ఐదున్నర గంటలకే సభ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఏడు గంటల వరకు జనం లేక స్టేడియం వెలవెలబోయింది. స్టేడియంలో జనం వచ్చే వరకు ముఖ్యమంత్రులు ముగ్గురు హోటల్‌కే పరిమితమయ్యారు.

మరో వైపు వచ్చిన జనం కూడా సభ ఆలస్యం కావడంతో గుంపులు గుంపులుగా వెళ్లిపోవడం మొదలు పెట్టారు. దీంతో సభాస్థలికి వచ్చేయాలని లేదంటే ఉన్న కాసింత జనం కూడా వెళ్లిపోతారని నేతలు పార్టీ అధినేతకు సూచించడంతో ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, మమతా బెనర్జీలను వెంటపెట్టుకుని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాత్రి 7.20 గంటలకు సభాస్థలికి చేరుకున్నారు. జ్యోతి ప్రజ్వలనకు ఎంతగా యత్నించినా ఆ సమయంలో గాలులు వేస్తుండడంతో ఫలితం లేకపోయింది. చివరకు ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించి సభను ప్రారంభించారు. తొలుత కేజ్రీవాల్, ఆ తర్వాత మమతా బెనర్జీలు ప్రసంగించారు. కేజ్రీవాల్‌ హిందీలో ప్రసంగించగా, మమతా బెనర్జీ తెలుగులో మొదలు పెట్టి బెంగాలీ, హిందీ కలగలిపి మాట్లాడారు. ఇరువురు కూడా ఆవేశంగా మాట్లాడినప్పటికీ ఒక్క ముక్క కూడా అర్థం కాక జనం తలలు పట్టుకున్నారు. తర్జుమా చేసే నాయకుడు లేకపోవడంతో వేదికపై ఉన్న నేతలు కూడా వారి హావాభావాలకు తగ్గట్టుగా చçప్పట్లుకొట్టడం తప్ప ఏమీ చేయలేకపోయారు. ఈ ఇరువురు ప్రసంగం పూర్తయ్యే సరికి స్టేడియం దాదాపు మూడోవంతు ఖాళీ అయిపోయింది. ఇక సీఎం చంద్రబాబు ప్రసంగం మొదలుకాగానే ఆ మిగిలిన కాస్త జనం కూడా వెళ్లిపోవడం కన్పించింది. సీఎ దాదాపు 40 నిమిషాల పాటు ప్రసంగించడంతో తొలి రెండు గ్యాలరీలు తప్ప ఎక్కడా జనం లేక స్టేడియం వెలవెలబోయింది. కేజ్రీ, దీదీలు కేంద్రంలో మోదీ, అమిత్‌ షాలను లక్ష్యంగా చేసుకుని ప్రసంగించగా, చంద్రబాబు మాత్రం కేజ్రీ, దీదీలను పొగుడుతూ మోదీ, జగన్‌పై విమర్శలు గుప్పించారు. అయితే వీరి ప్రసంగాలకు జనాల నుంచి ఏమాత్రం స్పందన కన్పించలేదు. 

ఇంటెలిజెన్స్‌ అధికారితో హర్షవర్థన్‌
హర్షవర్థన్‌చౌదరి హల్‌చల్‌
ప్రతిపక్ష నేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావుకు ఆశ్రయం కల్పించిన ఫ్యూజియన్‌ ఫుడ్‌ అధినేత హర్షవర్థన్‌ చౌదరి టీడీపీ ఎన్నికల ప్రచార సభా వేదికపై హల్‌చల్‌ చేశారు. ఇంటెలిజెన్స్‌ విభాగ అధికారులకు సైతం సూచనలు, సలహాలు ఇస్తూ కనిపించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top