కరిగి పోతున్న పదవీకాలం! | Sakshi
Sakshi News home page

కరిగి పోతున్న పదవీకాలం!

Published Wed, Apr 15 2020 1:44 PM

Local MLC Elections Postponed Due to Lockdown Nizamabad - Sakshi

సాక్షి, కామారెడ్డి: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌.. ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికనూ కమ్మేసింది. మే 3 వరకూ లాక్‌డౌన్‌ పొడిగించిన తరుణంలో.. ఆ తర్వాత ఉత్పన్నమ య్యే పరిస్థితులపై ఎన్నికల నిర్వహణ ఆధారపడి ఉంది. అయితే, ఇప్పుడదే అంశం రాజకీయ వర్గా ల్లో చర్చనీయాంశమైంది. ఎమ్మెల్సీ పదవీకాలంపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. ఉభయ జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పని చేసిన భూపతిరెడ్డిని పార్టీ ఫిరాయింపు కింద తొలగించిన సంగతి తెలిసిందే. దీంతో ఖాళీ అయిన ఆ స్థానంలో ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 7న ఎన్నిక నిర్వహించి, 9న ఓట్ల లెక్కింపు చేపట్టి, 13 కల్లా ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉండింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సీఎం కూతురు, మాజీ ఎంపీ కవిత బరిలో దిగడంతో అందరి దృష్టి ఈ ఎన్నికలపైనే నెలకొంది. అయితే, ఇదే సమయంలో కరోనా ఎఫెక్ట్‌తో ఎన్నికను వాయిదా వేశారు.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవీ కాలం సాధారణంగా ఆరేళ్లు (2016 జనవరి 5 నుంచి 2022 జనవరి 4 వరకు) ఉంటుంది. గత జనవరి 16న భూపతిరెడ్డిని తొలగించడంతో ఆ స్థానం 16న ఖాళీ అయ్యింది. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించడానికి ఎన్నికల కమిషన్‌ గత నెల 12న నోటిఫికేషన్‌ జారీ చేసింది. పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, చివరకు ముగ్గురు మాత్రమే బరిలో ఉన్నారు. అయితే అదే సమయంలో కరోనా వైరస్‌ అంశం ముందుకు రావడంతో ఎన్నికను వాయిదా వేశారు. లేదంటే ఈ నెల 7న ఎన్నిక నిర్వహించి, 9న ఓట్ల లెక్కింపు చేపట్టే వారు. 13వ తేదీతో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేది. గెలుపొందిన అభ్యర్థి ఎమ్మెల్సీగా ప్రమాణం చేసే వారు. తొలుత ప్రకటించిన లాక్‌డౌన్‌ ఈ నెల 14 వరకే ఉండడం, ఆ గడువు ముగియగానే ఎన్నికల ప్రక్రియ తిరిగి మొదలవుతుందని అంతా అనుకున్నారు. కానీ లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని మోదీ మంగళవారం ప్రకటించారు.

తగ్గుతున్న పదవీ కాలం..
ఎమ్మెల్సీ పదవీ కాలం 2022 జనవరి 4తో ముగియనుంది. ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగితే గెలుపొందిన అభ్యర్థి కనీసం 21 నెలల పాటు పదవిలో కొనసాగే వారు. ఒకవేళ కరోనా కేసులు మే నెలలో అదుపు లోకి వస్తే ఎన్నికల అంశం తెరపైకి రావొచ్చు. అప్పుడు జూన్‌లో ఎన్నిక నిర్వహించే అవకాశాలు ఉంటాయి. ఒక వేళ జూన్‌లో ఎన్నిక జరిగితే పదవీ కాలం 18 నెలల నుంచి 19 నెలల వరకు ఉంటుంది. అంటే ఏడాదిన్నర కాలం మాత్రమే గెలుపొందిన వారు పదవిలో కొనసాగే అవకాశాలుంటాయి.

Advertisement
Advertisement