‘పోతారు సార్‌’... లగడపాటి ఎక్కడికి పోయారు?

Lagadapati Rajagopal Survey Becomes Utter Flop - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేసీఆర్‌తో ఆట అంటే ఆషామాషి కాదు. అలాంటి కేసీఆరే ఓటమి పాలవ్వబోతున్నారని ఆంధ్ర అక్టోపస్‌గా చెప్పుకునే లగడపాటి రాజగోపాల్‌ హింట్‌ ఇచ్చారు. సర్వేల పేరిట పోలింగ్‌కు ముందు రోజు ప్రజలను గందరగోళ పరిచేందుకు ప్రయత్నించిన రాజగోపాల్‌.. తన సర్వేలో భాగంగా గజ్వేల్‌ను సందర్శించానని.. అక్కడ టీ కోసం ఆగితే కొందరు కానిస్టేబుళ్లు వచ్చి.. తనను పలకరించారని, ఇక్కడ పరిస్థితి ఎలా ఉందని అడిగితే.. ‘పోతారు సార్‌’ అని ఆ కానిస్టేబుళ్లు బదులిచ్చారని కొంచెం నిగూఢంగా, కొంచెం వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ‘పోతారు సర్‌’  అన్న ఆయన వ్యాఖ్యల వెనక ఉద్దేశమేమిటో​ అందరికీ తెలిసిందే. గజ్వేల్‌లో కేసీఆర్‌ కూడా ఓడిపోబోతున్నారని పరోక్షంగా రాజగోపాల్‌ చెప్పినట్టు అప్పుడు భావించారు. అంతేకాదు.. పోలింగ్‌కు రెండురోజుల ముందు ప్రెస్‌మీట్‌ పెట్టిన ఆయన.. ప్రజానాడి మహాకూటమికి అందిందని, పోలింగ్‌శాతం పెరిగితే.. కూటమి అధికారంలోకి వస్తుందని సర్వేల పేరిట తనదైన చిలుక జోస్యాలు చెప్పారు.

పోలింగ్‌ ముగిసిన తర్వాత యథాలాపంగా మీడియా ముందుకు వచ్చిన లగడపాటి.. కూటమి 55 నుంచి 75 స్థానాలు, టీఆర్‌ఎస్‌ 25 నుంచి 45 స్థానాలు గెలుపొందుతారని జోస్యం చెప్పారు. స్వతంత్ర అభ్యర్థులు ఏడుగురు గెలుస్తారని చెప్పుకొచ్చారు. ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలన్ని టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా.. కొంచెం హోరాహోరీగా ఉంటాయని అంచనాలు వేస్తే.. లగడపాటి మాత్రం కూటమికే మొగ్గు చూపారు. ఆయన వెలువరించిన సర్వే అంచనాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. చంద్రబాబు డైరెక్షన్‌లోనే తెలంగాణ ఓటర్లను గందరగోళ పరచడానికి లగడపాటి ఈ విధంగా సర్వేల పేరిట గోల్‌మాల్‌ చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ నేతలు విమర్శించారు. తెలంగాణ ఉద్యమకాలంలో దీక్షల పేరిట లగడపాటి డ్రామాలు ఆడిన విషయాన్ని వారు గుర్తుచేశారు. దీక్ష పేరిట లగడపాటి మారువేషంలో హైదరాబాద్‌కు రావడం.. పరిగెత్తుకుంటూ వచ్చి నిమ్స్‌ ఆస్పత్రిలోని చేరడం వంటి నాటకాలను వారు ఉదహరించారు. అప్పుడు లగడపాటి ఆడిన ఆసుపత్రి డ్రామాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

ఏదిఏమైనా.. లగడపాటి సర్వే అట్టర్‌ ప్లాప్‌ అని మంగళవారం వెలువడిన అసెంబ్లీ ఫలితాలు చాటుతున్నాయి. కూటమికి అనుకూలంగా ఆయన చెప్పిన జోస్యంలో ఇసుమంతైనా నిజం కాకపోవడాన్ని ఇప్పుడు నిపుణులు ప్రస్తావిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో తెలంగాణ రాదని, తెలంగాణ వస్తే.. రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న లగడపాటి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకావడంతో గత ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఈసారి ఆయన మనస్సులో ఏముందో కానీ.. తెలంగాణ ఎన్నికల సర్వే పేరిట తెరపైకి వచ్చి హంగామా చేశారు. ఇప్పటివరకు లగడపాటి సర్వే చేస్తే.. అది చాలావరకు నిజమవుతుందనే అంచనా ప్రజలకు ఉండేది. తాజాగా వెలువరించిన సర్వేతో ఆయన తనకున్న విశ్వసనీయతను కోల్పోయారు. తెలంగాణ రావడంతో రాజకీయ సన్యాసం చేసిన లగడపాటి.. తాజాగా వెలువరించిన తప్పుడు సర్వేతో.. సర్వే సన్యాసం కూడా తీసుకుంటారా? అని నెటిజన్లు ఇప్పుడు సూటిగా ప్రశ్నిస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top