ఒక్క పైసా అదనంగా ఇవ్వలేదు : కేటీఆర్‌

KTR Speech In Telangana Bhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రానికి కేంద్రం అదనంగా ఒక్క పైసా కూడా అదనంగా ఇవ్వలేదని తెలిపారు. బీజేపీ నేతలకు దమ్ముంటే ఢిల్లీ నుంచి నిధులు తీసుకురావాలని సవాలు విసిరారు. మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీలు అడ్రస్‌ లేకుండా పోయాయని ఎద్దేవా చేశారు. శంషాబాద్‌కు చెందిన టీడీపీ కౌన్సిలర్‌ గణేష్‌ గుప్తాతో పాటు పలు పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి కేటీఆర్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. మున్సిపల్‌ ఎన్నికల్లో ఘన విజయం సాధించామన్నారు. తొలిస్థానంలో టీఆర్‌ఎస్‌ ఉంటే.. రెండో స్థానంలో టీఆర్‌ఎస్‌ ఇండిపెండెంట్లు ఉన్నారని తెలిపారు. 1200 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లకు బీఫార్మ్‌ ఇస్తామన్న పోటీ చేసే అభ్యర్థులే లేరని అన్నారు. మొత్తం 120 మున్సిపాలిటీలు, పురపాలికల్లో విజయం సాధిస్తే అందులో ఎక్కువ శాతం బడుగు, బలహీనవర్గాలకే కేటాయించామని గుర్తుచేశారు. చైర్మన్‌, వైఎస్‌ చైర్మన్‌లలో మహిళలకు పెద్దపీట వేశామని చెప్పారు. 

కాంగ్రెస్‌, బీజేపీ పొత్తుపై వీహెచ్‌ అసహనం వ్యక్తం చేశారని.. సిద్ధాంతాలకు విరుద్ధంగా ఆ రెండు పార్టీలు పొత్తుపెట్టుకున్నాయని కేటీఆర్‌ అన్నారు. గల్లీ ఎన్నికైనా.. ఢిల్లీ ఎన్నికైనా ప్రజలు టీఆర్‌ఎస్‌కే పట్టం కడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్‌పై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు బీజేపీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిందని అన్నారు. అడ్డిమారిగుడ్డిదెబ్బలా పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ స్థానాల్లో గెలిచిందని వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ అన్యాయం జరిగిందని.. దమ్ముంటే బీజేపీ నేతలు ఢిల్లీ నుంచి నిధులు తీసుకురావాలని సవాలు విసిరారు. నీతిఆయోగ్‌ సిఫార్సు చేసిన కేంద్రం నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు. తెలంగాణ కొత్త పథకాలతో అభివృద్ధిలో ముందకు వెళ్తుందన్నారు. శంషాబాద్‌ వరకు మెట్రో రైలు పోడిగిస్తామని తెలిపారు. శంషాబాద్‌కు మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top