ఒంటరిగానే పోటీ..

Kishan Reddy comments on Telangana elections - Sakshi

3,4,5 తేదీల్లో అభ్యర్థులపై కసరత్తు: కిషన్‌ రెడ్డి

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: బీజేపీ ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉందని ఆ పార్టీ శాసనసభ పక్ష మాజీ నేత కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణలోని ఏ రాజకీయ పార్టీతోనూ తమ పార్టీ పొత్తు పెట్టుకోవడం లేదని స్పష్టం చేశారు. సోమవారం విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడారు. ఈ నెల 3, 4, 5 తేదీలలో హైదరాబాద్‌లో నియోజకవర్గాల వారీగా ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహించి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేస్తామన్నారు. మేనిఫెస్టో కమిటీ సహా అన్ని కమిటీలు ఏర్పాటు చేసుకున్నామని, ఈ ఎన్నికల సందర్భంగా తెలంగాణలోని అన్ని ముఖ్య కేంద్రాల్లో జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా పర్యటిస్తారని చెప్పారు. తెలంగాణ కొన్ని ప్రాంతాల్లో మోదీతో సహా కేంద్ర మంత్రులు కూడా పర్యటిస్తారని కిషన్‌తెలిపారు. ఈ నెల 10న కరీంనగర్‌లో ఎన్నికల సభ నిర్వహిస్తామని తెలిపారు.   

ప్రగతిభవన్‌ నుంచి పాలనా?
కారణం లేకుండా ముందస్తు ఎన్నికలకు పోతున్న సీఎం కేసీఆర్‌ ఓట్లేసిన రాష్ట్ర ప్రజలను వంచించారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌ ఓ నియంతని, నియంతృత్వ పాలనకు చరమగీతం పాడతామని అన్నారు. సచివాలయం కాదని ప్రగతిభవన్‌ నుంచి పరిపాలన చేసే సీఎం దేశంలో ఒక్క కేసీఆరేనని విమర్శించారు. ఇటీవల తెలంగాణలో పర్యటించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అభివృద్ధి గురించి మాట్లాడితే.. ‘డబ్బులు మీ ఇంట్లో నుంచి ఇచ్చారా’ అంటూ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను కిషన్‌రెడ్డి ఖండించారు.

రాష్ట్ర అభివృద్ధికి కేటీఆర్‌ అమెరికాలో సంపాదించిన డబ్బులు తెచ్చి ఖర్చు పెడుతున్నారా? లేదంటే నిజాం నవాబులు ఇచ్చిపోయిన నిధులు ఖర్చు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. ‘కేటీఆర్‌ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు.. మీ నిరంకుశ పాలనను ప్రజలు అంగీకరిస్తలేరు.. రాను న్న రోజుల్లో ప్రజలు టీర్‌ఎస్‌కి బుద్ధి చెబుతారు’ అని అన్నారు. మహాకూటమితో అధికారంలోకి వస్తానని పగటి కలలు కంటున్న కాంగ్రెస్, టీడీపీ నాయకుల్లారా మీ ఎమ్మెల్యేలను కాపాడుకోలేని మీరు రాష్ట్రా న్ని ఏమి బాగు చేస్తారు? అని కిషన్‌రెడ్డి నిలదీశారు. తెలంగాణలో అవసరం లేని పార్టీ టీడీపీ అని అన్నారు. సమావేశంలో తాజా మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి, మంత్రి శ్రీనివాస్, అధికార ప్రతినిధి రఘునందన్‌రావు, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, బండి సంజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top