ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తప్పక గెలవాలి : కేసీఆర్‌

KCR Says Need Trs Must Win In This Elections In Sathupalli Public Meeting - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ తప్పక గెలవాల్సిన అవసరం ఉందని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. సోమవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగిన ప్రజాశీర్వాద సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశంలోనే అభివృద్ధిలో తెలంగాణ దూసుకపోతుందన్నారు. విద్యుత్‌ వినియోగంలో ప్రథమ స్థానంలో ఉందని, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్‌ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు పథకం తీసుకొచ్చామని, ఈ పథకాన్ని ఐక్యరాజ్య సమితి సైతం ప్రశంసించందన్నారు. రానున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో పింఛన్లను రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు.  రాజకీయ చైతన్యం కలిగిన సత్తుపల్లి ప్రజలు అన్ని విషయాలు ఆలోచించి ఓటేయ్యాలని కోరారు.

సీతారమ ప్రాజెక్ట్‌తో ఖమ్మంకు నీరు అందుతుందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా పనిచేసిన పిడమర్తి రవిని, అన్ని అపోహలు వీడి.. సత్తుపల్లి ఎమ్మెల్యే గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సింగరేణి భూ నిర్వాసితులకు మార్కెట్‌ ధర ఇప్పించే ప్రయత్నం చేస్తామన్నారు. పోడు రైతలు సమస్యలు పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. 58 ఏళ్లు పని చేసిన పార్టీలన్ని ఒక వైపు.. తెలంగాణ రాష్ట్రం సాధించటం కోసం పని చేసిన పార్టీ మరో వైపు ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం లో 600 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశామని, తెలుగుదేశం పార్టీ ఇక్కడ అధికారం లోకి రావాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రానికి ఏ ప్రాజెక్ట్ కావాలన్నా.. చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నారని, ఇది ప్రజలు గమనించి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.

ఢిల్లీ వెళ్లి చీల్చి చెండాడుతా..
మధిర సభలో మాట్లాడుతూ..  తాను ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఘనంగా ఆశీర్వదిస్తున్నారని, 12 సర్వేల్లో టీఆర్‌ఎస్సే గెలుస్తున్నట్లు తేలిందని స్పష్టం చేశారు. కట్టలేరు మీద చెక్‌ డ్యాం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మధిర అభ్యర్థి లింగాల కమలరాజ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ ఎన్నికల అనంతరం ఢిల్లీ వెళ్లి బాగా చీల్చి చెండాడుతానన్నారు. 25 ఏళ్ల కింద చైనా వాళ్లు భారత్‌ కంటే చాలా వెనుకబడి ఉండేదని, కానీ ఇప్పుడు మనకంటే ఎన్నో రెట్లు మెరుగైందన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top