పింఛన్లు పెంచుతాం

KCR Promises About Pensions At Nizamabad Sabha - Sakshi

పెంచే మొత్తాన్ని మేనిఫెస్టో కమిటీ నిర్ణయిస్తుంది

తాలుకా కేంద్రాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు

కంటి వెలుగు తరహాలో ఈఎన్‌టీ పరీక్షలు

నిజామాబాద్‌ బహిరంగ సభలో కేసీఆర్‌ హామీలు

ఇప్పటివరకు 472 అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడి

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో దేశంలో ముందున్నామని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. రూ. 40 వేల కోట్లతో 472 పథకాలు, కార్యక్రమాలను అమలు చేశామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రస్తుతం లబ్ధిదారులకు ఇచ్చే వివిధ రకాల పింఛను మొత్తాన్ని పెంచుతామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఎంత మొత్తంలో పెంచాలనే దానిపై తమ పార్టీ మేనిఫెస్టో కమిటీ నిర్ణయిస్తుందని ప్రకటించారు. బుధవారం నిజామాబాద్‌లోని గిరిరాజ్‌ కళాశాల మైదానంలో జరిగిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో కేసీఆర్‌ ప్రజలపై వరాలు జల్లు కురిపించారు.

వృద్ధాప్య పింఛను తీసుకుంటున్న పెద్దల దీవెనలు వృథా పోవన్నారు. పింఛన్ల విషయంలో కాంగ్రెస్‌ పార్టీ అర్రాస్‌ (వేలం) పాట పాడినట్లు హామీలిస్తోందని ఎద్దేవా చేశారు. తెలంగాణ వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చామన్న కేసీఆర్‌... భవిష్యత్తులో మరింత మంచి పెంపుదల ఉంటుందని ప్రకటించారు. చాలీచాలని వేతనాలతో జీవనం గడుపుతున్న అంగన్‌వాడీలు, ఆశవర్కర్లు, హోంగార్డులు, సెకండ్‌ ఏఎన్‌ఎంల వేతనాలను ఇప్పటికే పెంచామని, రానున్న రోజుల్లో మరింత పెంచే పని చేస్తామన్నారు. ప్రతి తాలూకా కేంద్రాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తామని కేసీఆర్‌ చెప్పారు. తద్వారా రైతుల ఉత్పత్తులకు మంచి ధర లభిస్తుందన్నారు. రైతు సమన్వయ సమితి పాలక వర్గాలకు పారితోషికం అందిస్తామన్నారు. 

ప్రజలందరి హెల్త్‌ ఫ్రొఫైల్‌.. 
కంటి వెలుగు కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఉన్న 3.5 కోట్ల మంది ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని కేసీఆర్‌ వివరించారు. ఇదే తరహాలో రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికీ చెవి, ముక్కు, గొంతు పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈఎన్‌టీ వైద్య బృందాలు గ్రామాల్లో పరీక్షలు నిర్వహిస్తాయన్నారు. అలాగే రాష్ట్ర ప్రజలందరి హెల్త్‌ ఫ్రొఫైళ్లను కంప్యూటరీకరించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. 

మైనారిటీలు ఆశీర్వదించాలి... 
మైనారిటీల సంక్షేమం కోసం రూ. 2 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించిన రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదని కేసీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 204 మైనారిటీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు. మైనారిటీల ఆశీస్సులుంటే మరిన్ని మంచి ఫలితాలు సాధిస్తామన్నారు. భగవంతుడి కృప ఉంటే ఎవరూ ఏమీ చేయలేరని కేసీఆర్‌ ఉర్దూలో కవిత్వాలు చెప్పి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

మిషన్‌ భగీరథ  పరుగులు.. 
రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి పనులను కేసీఆర్‌ వివరించారు. ఇంటింటికీ నల్లా నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగబోమని గతంలో ప్రకటించిన మేరకు రాష్ట్రంలో మిషన్‌ భగీరథ పనులు పరుగులు పెడుతున్నాయని కేసీఆర్‌ చెప్పారు. 1.50 లక్షల కిలోమీటర్ల పైప్‌లైన్‌ నిర్మాణం పనులు కొనసాగుతున్నాయని, 1,690 గ్రామాలకు ఇప్పటికే నీళ్లు చేరాయని చెప్పారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ ఇస్తున్నామని, నిర్వీర్యమైన వ్యవసాయశాఖలో 2,630 మంది ఏఈఓ పోస్టులను భర్తీ చేశామన్నారు. నిజాం కాలం నాటి భూ రికార్డులను సరిచేసి రైతుల ఇళ్లకే పాసుపుస్తకాలు పంపామని గుర్తుచేశారు. 

కరువు కాటకాల నుంచి..  ఆర్థిక శక్తిగా ఎదిగాం..
తెలంగాణకు ముందు కరువు కటకాలు, కరెంట్‌ సంక్షోభాల నుంచి రాష్ట్రం బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగిందని కేసీఆర్‌ పేర్కొన్నారు. 19.19 శాతం వృద్ధి సాధించి అభివృద్ధిలో దేశంలోనే అగ్రభాగాన నిలిచామన్నారు. నిరుపేదలకు ఇచ్చే పింఛను విషయంలో కాంగ్రెస్‌ పార్టీ అర్రాస్‌ (వేలం) పాట పాడినట్లు మేం రూ. వెయ్యి ఇస్తామంటే వారు రూ. 2 వేలు ఇస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. పింఛను పెంచాలని కాంగ్రెస్‌ నేతలకు కనువిప్పు కలిగినందుకు సంతోషిస్తున్నామన్నారు. కేసీఆర్‌ కిట్లు, కల్యాణ లక్ష్మి, విద్యార్థులకు సన్నబియ్యం, బీడీ కార్మికులకు పింఛను వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు. సబ్సిడీపై ట్రాక్టర్లు, డ్రిప్, పాలీహౌస్, విత్తనాలు సరఫరా చేసి అన్నదాతలను ఆదుకుంటున్నామని చెప్పారు. వ్యవసాయానికి వినియోగించే ట్రాక్టర్లపై పన్నులు లేని రాష్ట్రం తెలంగాణనేనన్నారు. మార్కెట్‌ కమిటీల్లో అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నామన్నారు. గొల్లకుర్మలు, మత్స్యకారులు, గీత కార్మికులు, పాల ఉత్పత్తిదారులకు చేయూతనందించేందుకు వివిధ పథకాలను అమలు చేస్తున్నామని ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో 5 వేల కిలోమీటర్ల రహదారులను జాతీయ రహదారులుగా మార్చామన్నారు. 
       

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top