ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే

Human chain in Vijayawada for special category status - Sakshi

     కదం తొక్కిన యువత 

     పలు ప్రాంతాల్లో ఆందోళనలు 

     విజయవాడలో మానవహారం 

     పొన్నూరులో ఎస్‌ఎఫ్‌ఐ నేతలపై పోలీసుల జులుం 

లబ్బీపేట (విజయవాడ తూర్పు)/సాక్షి ప్రతినిధి, విజయనగరం/ కాశీబుగ్గ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం యవత కదం తొక్కింది. రాష్ట్రంలో విద్యార్థి, యువజన సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు పలు చోట్ల పెద్ద ఎత్తున మానవహారాలు చేపట్టారు. బుధవారం విజయవాడ మహాత్మా గాంధీ రోడ్డులో వందలాది మంది విద్యార్థులు మానవహారంగా ఏర్పడి, ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేత మల్లాది విష్ణు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, ఆమ్‌ ఆద్మీ, అనుబంధ విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. విభజన హామీలన్నీ అమలు చేస్తున్నామని బీజేపీ పార్లమెంటులో చెప్పడం సిగ్గుచేటన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ.. విద్యార్థులు తలచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయని హెచ్చరించారు. సీపీఐ నేత రామకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన సమయంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్‌సింగ్‌ ఇచ్చిన హామీలను అమలు చేసి తీరాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో విభజన హామీల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు, పీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్‌ గంగాధర్‌తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ బస్‌స్టాండ్‌ వద్ద వందలాది మంది బుధవారం మానవహారం చేపట్టారు. అలాగే విజయనగరం జిల్లాలో, పార్వతీపురంలో విద్యార్థులు ఆందోళన చేశారు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్, రాష్ట్రంలో జాతీయ విద్యా సంస్థలను, జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ నాయకుడు, పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి మద్దిల వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.  

ఎస్‌ఎఫ్‌ఐ నేతల అరెస్టు 
సాక్షి, గుంటూరు: ప్రత్యేక హోదాను కాంక్షిస్తూ గుంటూరు జిల్లా పొన్నూరు ఐలాండ్‌ సెంటర్‌లో మానవహారం నిర్వహించిన ఎస్‌ఎఫ్‌ఐ నేతలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. వారిని అరెస్టు చేసి చెంపలపై కొట్టడం వివాదానికి దారితీసింది. వివరాల్లోకెళ్తే.. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పలు పాఠశాలల విద్యార్థులు పొన్నూరులో మానవహారం నిర్వహించారు. పోలీసులు వచ్చి మానవహారాన్ని విరమించాలని కోరడంతో ఎస్‌ఎఫ్‌ఐ నేతలు ఎస్‌.కె.జాఫర్‌ఖాన్, ఎం.కిరణ్, తిరుమలరెడ్డి విద్యార్థులను పంపివేశారు. ఇదే తరుణంలో అక్కడకు వచ్చిన పొన్నూరు పోలీసులు ముగ్గురిని బలవంతంగా తమ వాహనంలో ఎక్కించుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సీఐ వీరిని అసభ్యపదజాలంతో దూషిస్తూ చెంపలపై తీవ్రంగా కొట్టడమే కాకుండా ఒంటిపై ఉన్న బట్టలన్నీ తీయించి లాకప్‌లో పడేశారు. ఎస్‌ఎఫ్‌ఐ నేతలపై పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు భగవాన్‌దాస్‌తోపాటు మరికొందరు గుంటూరు రూరల్‌ జిల్లా ఏఎస్పీ వరదరాజులును కలిసి ఫిర్యాదు చేశారు. పోలీసులు కొట్టడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య, సీపీఎం తూర్పు జిల్లా కార్యదర్శి పాశం రామారావు తదితరులు ఖండించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top