విశాఖ తీరాన జన సునామీ

Huge public to YS Jagan Meeting At Vishaka Kancharapalem - Sakshi

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ సభకు పోటెత్తిన జనం 

కిక్కిరిసిన రహదారులు.. ముందుకు అడుగేయలేని వైనం

వేదిక వద్దకు వెళ్లలేక ఎల్‌ఈడీలకు అతుక్కుపోయిన ప్రజలు

ప్రజాసంకల్పయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బహిరంగ సభకు జన ప్రవాహం పోటెత్తింది. విశాఖలోని కంచరపాలేనికి నలుదిక్కులూ జనంతో కిక్కిరిశాయి. తాటిచెట్ల పాలెం రోడ్డుపై రెండు కిలోమీటర్ల మేర రాకపోకలు స్తంభించాయి. జ్ఞానాపురం దారిలో అడుగేయడమే కష్టమైంది. ఎన్‌ఏడీ మర్రిపాలెం రోడ్డయితే పూర్తిగా జనంతో మూసుకుపోయింది. కంచరపాలెం వంతెన రోడ్డు జనంతో నిండిపోయింది. వైఎస్‌ జగన్‌ బహిరంగ సభ జరిగిన కూడలికి వెళ్లే ఈ నాలుగు రోడ్లలో కనుచూపుమేర ఇసుకేస్తే రాలనంతగా జనం పోగయ్యారు. తోసుకుంటూ వెళ్లే వాళ్లు, పరుగులు పెట్టే వాళ్లు, సభా వేదిక వద్దకు వెళ్లే మార్గాన్ని మూసేసిన పోలీసులతో గొడవకు దిగేవాళ్లు.. తమ వాహనాలు ఎటుపోతేనేం.. ఎక్కడో ఓ చోట పెట్టేసి.. వేదిక వైపు పరుగెత్తిన వాళ్లు.. అడుగడుగునా ఇలా ఆసక్తికర సన్నివేశాలెన్నో చోటుచేసుకున్నాయి. ‘మేం కొన్నేళ్ల క్రితం విశాఖలో సునామీ చూశాం. మళ్లీ ఇప్పుడు జగన్‌ సభకు వచ్చిన జనాన్ని చూస్తే అలాగే అనిపిస్తోంది’ అని మర్రిపాలెం నుంచి వచ్చిన విశ్రాంత ఉద్యోగి కృష్ణమోహన్‌ అన్నారు. 

కొండ కోనల్లోంచి.. 
కప్పరాళ్ల, సంజీవయ్య కాలని, బర్మ క్యాంపు.. ఎక్కడో కొండ ప్రాంతాల్లో ఉన్నాయి. సాధారణంగా అక్కడి జనం ఏదో ఒక పని నిమిత్తమే వస్తారు. కానీ జగన్‌ బహిరంగ సభ కోసం ఆ ప్రాంతాల నుంచి ఆదివారం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ‘మేమెన్ని బాధలు పడుతున్నామో మాకు తెలుసు.. ఆయనొస్తాడని తెలిసి వచ్చాం సారూ.. గెలిస్తే మా కష్టాలన్నీ పోతాయి’ అంటూ కప్పరాళ్ల నుంచి వచ్చిన సుభద్ర, పార్వతి, శంకుతల చెప్పారు. గిరిజన నృత్యాలతో ఆకట్టుకున్నారు. ‘నాలుగేళ్లుగా గిరిజన ప్రాంతాలు కష్టాల్లో నలిగిపోతూ ఘోషిస్తున్నాయి. అన్నొస్తేనే ఈ ఘోష తీరుతుంది’ అంటూ అరకుకు చెందిన మహేశ్, వెన్నెల చెప్పారు. విశాఖ బీచ్‌లన్నీ రోజూ సందర్శకులతో కళకళలాడతాయి.. ఈ రోజు మాత్రం జనం లేక బోసిబోయాయి.. అని స్థానికుడు వెంకటేశ్‌ విశ్లేషించాడు. ఇక్కడ ప్రతి ఇంటి నుంచి కనీసం ఒక్కరు వచ్చారు.. ఓ నాయకుడి కోసం ఇంతగా తరలిరావడం మేం మొదటి సారే చూస్తున్నామని గాజువాక ప్రాంతానికి చెందిన మాణ్యిక ప్రసాద్‌ తెలిపారు.  

విసిగిన మనసులు.. ఎగిసిన గుండెలు 
‘చంద్రబాబు పాలనతో విసిగిపోయామయ్యా.. మా గుండె మంటేంటో చెప్పాలనుకున్నాం.. అందుకే ఇంత మంది జనమొచ్చారు.’ అని బీమిలి నుంచి వచ్చిన పుల్లారావు, మాడుగులకు చెందిన ఈశ్వరరావు సభా ప్రాంగణం వద్ద చెప్పారు. విశాఖ తీరంలో టీడీపీ పాలనలో కన్నీళ్లు పెట్టని ఇల్లులేదు.. కష్టపడని మనసు లేదు. ఇప్పుడు ఆశలన్నీ జగన్‌ మీదే. ఆ మనోభావాలే లావాలా పొంగుతున్నాయి.. అదే ఈ జనం.. అంటూ గాజువాకకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి శంకర్‌ తెలిపారు. ఒక ప్రాంతం నుంచి కాదు.. అనేక ప్రాంతాల నుంచి ఇంత పెద్ద ఎత్తున ప్రజలు రావడం జగన్‌ పట్ల జనానికి ఉన్న నమ్మకానికి సంకేతమంటూ వ్యాఖ్యానించాడు.  

జనం గుండె తాకిన ప్రసంగం 
జగన్‌ ప్రసంగం ఆద్యంతం విశాఖ వాసుల వాస్తవిక జీవితాన్ని ఆవిష్కరించిందని అనేక మంది అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా యువతకు చంద్రబాబు వేసిన ఎర.. కల్పించిన భ్రమలు ఇక్కడి వాళ్లకు తెలుసు. వైఎస్‌ హయాంలో ఐటీ ఏ విధంగా ఉండేది.. ఇప్పుడెలా ఉందంటూ జగన్‌ లేవనెత్తిన చర్చ ప్రతీ యువకుడిని ఆలోచింపజేస్తోందని స్థానిక ఐటీ నిపుణుడు సృజన్‌ అన్నాడు. భూముల కుంభకోణం దగ్గర్నుంచి.. పేదల భూముల స్వాహ పర్వం వరకూ అధికార పార్టీ అవినీతిని జగన్‌ కడిగిపారేశారని  గృహిణులు పల్లవీ చంద్రమోహన్, వల్లీశ్వరిలు అన్నారు. ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలతో ఓట్ల సమయంలో మాట్లాడే వాళ్లను చూశాం.. కానీ జగన్‌ ప్రసంగం వాస్తవాలకు దగ్గరగా ఉందని విశాఖ స్టీల్స్‌లో పనిచేస్తున్న రామ్మోహన్‌ వేదిక వద్ద విశ్లేషించారు. విశాఖ యావత్తు జననేతకు బ్రహ్మరథం పట్టడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

మిద్దెలు, మేడల నిండా జనమే 
కంచరపాలెం చౌరస్తాలోని నలుదిక్కులా మిద్దెలపై జనమే జనం. మూడు, నాలుగు అంతస్తుల్లోనూ కిక్కిరిసిపోయి జగన్‌ బహిరంగ సభను తిలకించారు. కొంత మంది గోడలెక్కారు. ఇంకొందరు అందుబాటులో ఉన్న వాహనాలపైకెక్కారు. ‘మా అబ్బాయి జగనన్నను చూడాల్సిందేనని మొండి పట్టుపడ్డాడు.. వీడి కోసం ఈ గోడెక్కాం’ అని వసంతరావు అనే వ్యక్తి చెప్పాడు. జగన్‌ ప్రసంగం సాగుతున్నంతసేపు ప్రజలు వాళ్లను వాళ్లు మరిచిపోయారు. వాడి.. వేడిగా ఆయన ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నప్పుడు హర్షధ్వానాలు చేశారు. విశాఖ కోసం.. యువత కోసం.. వృద్ధుల కోసం.. మహిళల కోసం.. ఇలా ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యమిస్తూ ప్రసంగిస్తున్నప్పుడు ఆయా వర్గాల వారిలో అమితానందం కనిపించింది. మేడపై నుంచి సభా ప్రాంగణాన్ని పరిశీలిస్తే.. అభిమాన జనం చేతుల్లోని అసంఖ్యాక సెల్‌ఫోన్‌లు జగన్‌ ప్రసంగాన్ని చిత్రీకరిస్తూ కనిపించాయి.

ఎల్‌ఈడీ స్క్రీన్‌లకు అతుక్కుపోయిన జనం
కంచరపాలెం (విశాఖ ఉత్తర): ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భారీ బహిరంగ సభను నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన ఎల్‌ఈడీ స్క్రీన్‌లపై నగర ప్రజలు వీక్షించారు. కంచరపాలెం మెట్టు వద్ద ఆదివారం నిర్వహించిన బహిరంగ సభకు లక్షలాది మంది తరలిరావడంతో రహదారులు కిక్కిరిసిపోయాయి. ఈ నేపథ్యంలో వైఎంసీఏ, సీఎంఆర్‌ సెంట్రల్, కంచరపాలెం బీఆర్‌టీఎస్‌ బస్టాప్, దుర్గానగర్, వివేకనందనగర్, పరమేశ్వరి థియేటర్‌ సెంటర్, ఊర్వశికూడలిలో ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు.

జగన్‌ బాటలో నడుస్తాం 
ఇంటింటికీ తిరిగి చేపలు అమ్ముకుంటున్నాను. రాజశేఖరరెడ్డి బాబు దేముడు. పేదవాళ్లకి ఎంతో మేలు చేశాడు. మాకు ఇల్లు, పింఛనీ ఇచ్చాడు. డబ్బులు కట్టకుండా వైద్యం చేయించాడు. మళ్లీ జగన్‌ వస్తే మాకందరికీ మేలు జరుగుతుంది. అందుకే ఆ బాబును చూద్దామని వచ్చాను. ఆయన బాటలో నడుస్తాం.  
– తెడ్డు పాప, పెదజాలారిపేట, విశాఖపట్నం

జగనన్నను గెలిపిస్తాం 
చంద్రబాబు ఇంటికో ఉద్యోగం అన్నారు. కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నారు. డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌ చదివిన వాళ్లు ఉద్యోగాలు లేక, హైదరాబాద్, చెన్నైకి తరలిపోతున్నారు. రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు లేవు. జగన్‌ గారు గెలవాలి. తప్పక గెలుస్తారు. రాష్ట్ర విభజన తర్వాత విద్య, ఉపాధిలో బాగా వెనుకబడ్డాం. జగనన్న లాంటి యువనేత, దమ్మున్న నాయకుడే రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించగలరని మా విశ్వాసం. అందుకే ఆయన్ని దగ్గరుండి గెలిపిస్తాం.  
– ఎం.కృష్ణతేజ, డిగ్రీ ఫైనలియర్, పైనాపిల్‌ కాలనీ 

జగనన్న గెలవాలి  
వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రావాలి. తండ్రిలాగే పేదల సమస్యలు పరిష్కరించాలి. రాష్ట్రంలో విద్య వ్యాపారంగా మారిపోయింది. ఎల్‌కేజీకి కూడా వేలల్లో ఫీజులు గుంజుతున్నారు. హైస్కూల్, కళాశాల విద్య ఫీజులైతే చెప్పనక్కరలేదు. చైతన్య, నారాయణ స్కూళ్లు, కళాశాలల్లో వేలల్లో ఫీజులు కట్టించుకుంటున్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలు నిర్వీర్యం చేశారు. వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఎంతో మంది పేద పిల్లలు కార్పొరేట్‌ కళాశాలల్లో చదివి డాక్టర్లు, ఇంజినీర్లు అయ్యారు. జగనన్న ఎల్‌కేజీ నుంచి పీజీ దాకా ఉచితంగా చదివిస్తానంటున్నారు. ఇది చాలా మంది పేద పిల్లలను ఉన్నత స్థాయికి చేర్చుతుందని ఆశిస్తున్నాను.  
– బోరవిల్లి మహాలక్ష్మి, డిగ్రీ ఫైనలియర్, కోట వీధి

మంచి జరుగుతుంది.. 
నేను రజకుడిని. నాకు ఆరుగురు కొడుకులు. వైఎస్‌ నా నలుగురు కొడుకులకు నాలుగు ఇళ్లు ఇచ్చారు. ఆయన మేలు మరచిపోలేను. మిగిలిన ఇద్దరు కొడుకులకు ఇళ్ల కోసం రెండుసార్లు ధరఖాస్తు పెట్టాను. రాలేదు. టీడీపీ పార్టీ వాళ్లకే ఇస్తున్నారు. ఊరిలో ఉన్న భూమి పోలవరం ప్రాజెక్టుకు పోయింది. కూలి పని కూడా దొరక్క నా పిల్లలు వైజాగ్‌ వచ్చి వాచ్‌మ్యాన్‌లుగా పని చేస్తున్నారు. జగన్‌ బాబు రావాలి. మా లాంటి వాళ్లకి మంచి చేస్తారని నమ్ముతున్నాం. 
– మెలిపాక ఫకీర్, వెంకటాపురం, యలమంచిలి మండలం

బాబు అవకాశవాది 
కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా ఎన్‌టీఆర్‌ స్థాపించిన పార్టీ టీడీపీ. ఆ పార్టీ సిద్ధాంతాలను తుంగలో తొక్కి రాష్ట్రాన్ని అడ్డగోలుగా  విభజించిన కాంగ్రెస్‌ పార్టీతో జత కట్టడానికి చంద్రబాబు సిద్ధం అవుతున్నాడు. అధికారం కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కే చంద్రబాబును తెలుగు ప్రజలు క్షమించరు. రాజకీయ కాంక్ష కోసం పార్టీ సిద్ధాంతాలను కూడా ఫణంగా పెట్టే నాయకుడు చంద్రబాబు. ఇలాంటి నాయకుడు ప్రజలకు అవసరం లేదు.  
– డి.వై.రెడ్డి. ఏయూ ఉద్యోగి, పెదవాల్తేర్‌

వైఎస్‌ తర్వాత మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు 
ఆంధ్రా యూనివర్సిటీలో 1982 నుంచి డైలీవేజ్‌పై పనిచేస్తున్న 300 మంది ఉద్యోగులను వైఎస్సార్‌ గారు ఎన్‌ఎంఆర్‌లుగా మార్చి జీతం పెంచారు. రూ.12,500 చెల్లిస్తున్నారు. ఆ తర్వాత మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. మా ఉద్యోగాలు రెగ్యులర్‌ చేయాలని మంత్రుల చుట్టూ తిరిగాం. లాభం లేదు. జగనన్న సీఎం అయితేనే మా ఉద్యోగాలు రెగ్యులర్‌ అవుతాయని నమ్ముతున్నాం. మాలాంటి ఉద్యోగులంతా జగనన్న వెంటే ఉంటాం. గెలిపించి తీరుతాం.  
– బర్ర మంగరాజు, ఏయూ ఉద్యోగి, వాల్తేర్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top