ఎన్నికలపై జోక్యం చేసుకోలేం

High Court Denial Petitions Against Dissolution Of Telangana Assembly - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హడావుడిగా తెలంగాణ అసెం బ్లీకి ఎన్నికలు వద్దని.. పార్లమెంటుతో పాటే శాసనసభకు ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘా న్ని ఆదేశించాలంటూ దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లడంలో జరిగిన చట్ట ఉల్లంఘనలు ఏమిటో చెప్పకుండా ఎన్నికలను నిర్వహించరాదంటే ఎలా అంటూ పిటిషనర్‌ను ధర్మాసనం నిలదీసింది. ఇతర రాష్ట్రాలతో కలిపి ఎన్నికలు నిర్వహించాలో లేక జమిలి ఎన్నికలు నిర్వహించాలో అన్నది కోర్టులు నిర్ణయించలేవని తేల్చి చెప్పింది.

కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైనదని, దాని విధుల్లో తాము జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది. చట్ట ఉల్లంఘన జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు చూపకుండా దాఖలు చేసే వ్యాజ్యాలను తాము అనుమతించలేమంటూ పిటిషన్‌ను కొట్టేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌వీ భట్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సందేహాల నివృత్తికి కోర్టును వేదికగా చేసుకుని ఈ వ్యాజ్యం దాఖలు చేసినట్లు అనిపిస్తోందని.. దీని వెనుక రాజకీయ ఎజెండా ఏమైనా ఉందా అంటూ ధర్మాసనం సందేహం వ్యక్తం చేసింది.

శాసనసభ రద్దయిన నేపథ్యంలో హడావుడిగా అసెంబ్లీకి ఎన్నికలు వద్దని, పార్లమెంటుతో పాటే అసెంబ్లీ ఎన్నికలు (జమిలి) కలిపి నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది రాపోలు భాస్కర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం విచారణ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది శ్రీనివాసరెడ్డి వాదనలు వినిపించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. శాసనసభ రద్దు, ముందస్తు ఎన్నికలకు వెళ్లడంలో జరిగిన చట్ట ఉల్లం ఘనలు ఏమిటని ప్రశ్నించింది. ప్రభుత్వ ముం దస్తు ఎన్నికల నిర్ణయం, గవర్నర్‌ అసెంబ్లీ రద్దు ఉత్తర్వులు గానీ, ఈసీ పనితీరులో గానీ ఎక్కడైనా చట్ట ఉల్లంఘనలు జరిగినట్లు ఆధారాలుంటే చూపాలని కోరింది.  

కీలక అంశం కాబట్టే ఈసీకి నోటీసులిచ్చాం..
ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల్ని ఏపీలో విలీనం చేసిన తర్వాత లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల పునర్‌వ్యస్థీకరణ చేయలేదని మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంలో కీలక అంశం ముడిపడి ఉందని, అందుకే తాము స్పందించి కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేశామని హైకోర్టు గుర్తు చేసింది. చట్ట ఉల్లంఘనలకు సంబంధించి ఆధారాలుంటే తప్ప ఈసీ విధుల్లో జోక్యం చేసుకోరాదని సుప్రీంకోర్టు పలు తీర్పులిచ్చిందని తెలిపింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top