ఉద్యమాల పుట్టినిల్లు...గుంతకల్లు

Guntakallu Constituency Review - Sakshi

రాష్ట్ర రాజకీయాల్లోనే ప్రత్యేక స్థానం 

అభ్యర్థుల మార్పుతోనే అభివృద్ధి సాధ్యమంటున్న ఓటర్లు 

దశాబ్దాల ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం 

ఉద్యమాల పుట్టినిల్లుగా గుంతకల్లుకు ప్రత్యేక ఖ్యాతి ఉంది. 1942లో మహాత్ముడి పిలుపునందుకుని బ్రిటీష్‌ వారిని భారతదేశం వదలి పొమ్మంటూ చేపట్టిన క్విట్‌ ఇండియా ఉద్యమంలో విజయమో.. వీరస్వర్గమో అంటూ ఈ నియోజకవర్గంలోని గుత్తి, పామిడి, గుంతకల్లు వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.  ఆ సమయంలో మిత్రులతో కలసి గుంతకల్లు రైల్వేస్టేషన్‌ను ధ్వంసం చేసిన ఘటనలో కసాపురానికి చెందిన మహమ్మద్‌ రసూల్‌ ఆరుమాసాల జైలు శిక్షను అనుభవించారు. నాటి స్వాతంత్య్రోద్యమం మొదలు నేటి ప్రత్యేక హోదా సాధన పోరు వరకూ గుంతకల్లు నియోజకవర్గ ప్రజలు చూపిన ఉద్యమ స్ఫూర్తి అనితర సాధ్యం. చైతన్యవంతులైన ఈ నియోజకవర్గ ప్రజలు అధికార మార్పు కోరుతూ ఓటు హక్కును వినియోగించుకుంటూ వస్తున్నారు. ఒకసారి గెలిచిన అభ్యర్థిని మళ్లీ ఎన్నికల్లో దూరం పెట్టేస్తూ నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షిస్తూ వచ్చారు. అయితే నియోజకవర్గ ప్రజలను దగా చేస్తూ పారిశ్రామిక ప్రగతిని టీడీపీ సర్కార్‌ పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దీంతో పరిశ్రమలకు కేంద్రంగా భాసిల్లుతున్న గుంతకల్లు నియోజకవర్గంలో కార్మికుల ఆకలి కేకలు వినిపిస్తున్నాయి.  

గుంతకల్లు.. 1957 నుంచి 2009 వరకూ గుత్తి నియోజకవర్గంలో ఉండేది. నియోజకవర్గం ఆవిర్భావం నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికలు ఈ నియోజకవర్గ ప్రజల చైతన్యానికి ప్రతీకగా నిలిచాయి. 13 సార్లు జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులు నాలుగేసి సార్లు గెలుపొందగా, ఒకసారి సీపీఐ, మరో మూడుసార్లు స్వతంత్ర అభ్యర్థులకు పట్టం కట్టారు. కరుడుకట్టిన కమ్యూనిస్ట్‌ యోధుడు వీకే ఆదినారాయణరెడ్డి 1962లో గుత్తి నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పట్లో గుత్తి నియోజకవర్గంలో తాడిపత్రి నియోజకవర్గం పెద్దవడుగూరు మండలంలోని సగం పల్లెలు ఉండేవి. అలాగే గుంతకల్లులోని పలు గ్రామాలు ఉరవకొండ నియోజకవర్గంలో ఉండేవి. ఈ గందరగోళానికి తెరవేస్తూ మొత్తం పెద్దవడుగూరు మండలాన్ని తాడిపత్రిలోకి, తాడిపత్రి, ఉరవకొండ నియోజవర్గాల పరిధిలోని పామిడి మండలాన్ని సంపూర్ణంగాను, గుంతకల్లు మండలంలోని పూర్తి పల్లెలను కలుపుతూ 2009లో గుంతకల్లు నియోజకవర్గంగా చేశారు.  

పరిశ్రమలు కనుమరుగు 
గుంతకల్లులోని ఏసీఎస్‌ మిల్లు ఒకప్పుడు ఆసియాలోనే అతిపెద్దదిగా ఖ్యాతి గడించి, రాయలసీమకే తలమానికంగా నిలిచింది. ఇక చలనచిత్రాల  డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలూ గుంతకల్లులో పెద్ద సంఖ్యలో ఉండేవి. చిత్ర పరిశ్రమలో రాయలసీమ సీడెడ్‌ కంపెనీగా గుంతకల్లు అప్పట్లో  విరాజిల్లింది. ఇక స్లీపర్‌ ఫ్యాక్టరీ, లైఫ్‌బాయ్‌ సబ్బులు ఫ్యాక్టరీ, ఇతర చిన్నతరహా పరిశ్రమలెన్నో గత ప్రభుత్వాల హయాంలో ఉండేవి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమలపై ఇస్తున్న రాయితీలకు మంగళం పాడేసింది. దీంతో నిర్వహణ భారమై పరిశ్రమలు ఒకదాని తర్వాత ఒకటి మూతపడుతూ వచ్చాయి.   

సెంటిమెంట్‌ ఫలించేనా? 
గుంతకల్లు నియోజకవర్గానికి ఓ ప్రత్యేక రాజకీయ సెంటిమెంట్‌ ఉంది. ఇక్కడ ఒకసారి గెలిపించిన అభ్యర్థికి మరోసారి ఆ అవకాశమివ్వరు. గత ఎన్నికలు పరిశీలిస్తే ఇవే ఫలితాలు స్పష్టమవుతాయి. గత ఎన్నికల్లో ఓడిన అభ్యర్థి మళ్లీ ఎన్నికల్లో బరిలో నిలిస్తే అతనికే నియోజకవర్గ ప్రజలు ఓటేస్తారు. ఈ తరహా రాజకీయ సెంటిమెంట్‌ బలంగా ఉన్న గుంతకల్లు నియోజకవర్గం అభివృద్ధిలో మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ఒక్క గాదిలింగప్ప తప్ప రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన వారు ఎవరూ లేరు. ఈ రెండు విడతల మధ్యలో ఒక టెర్మ్‌  కాంగ్రెస్‌ అభ్యర్థి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.  

గుత్తి/గుంతకల్లు నియోజకవర్గం నుంచి ఎంపికైన ఎమ్మెల్యేలు వీరే..   

మండలాలు : గుంతకల్లు, గుత్తి, పామిడి  
నియోజకవర్గం : గుంతకల్లు  

మొత్తం ఓటర్లు   పురుషులు   మహిళలు  ఇతరులు 
2,38,0 1,18,7 1,19,2 62

  • గత ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌ ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేకపోయారు.  
  • గుంతకల్లులో పాలిటెక్నిక్‌ కళాశాల, గుంతకల్లు–నాగసముద్రం డబుల్‌ రోడ్డు, కసాపురం రైల్వే బ్రిడ్జి విస్తరణ, గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రిలో బ్లడ్‌ బ్యాంకు ఏర్పాటు, గుత్తిలో ఫైర్‌స్టేషన్‌ ఏర్పాటు, గుత్తి కోటకు పర్యాటక కేంద్రం గుర్తింపు తదితర హామీలిచ్చి ఆచరణలో విఫలమయ్యారు. – నియోజకవర్గంలోని చెరువులకు కృష్ణా జలాల మళ్లింపు సాధనలో ఘోరంగా విఫలమయ్యారు.   

మహిళా ఓటర్లే కీలకం 
గుంతకల్లు నియోజకవర్గంలో పురుషుల కంటే మహిళ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. 2014 ఎన్నికలతో పోల్చుకుంటే 2019 నాటికి 472 మంది మహిళల ఓటర్ల సంఖ్య పెరిగింది. 2019 జనవరి 11 నాటికి ఎన్నికల అధికారులు ప్రకటించిన మేరకు ఈ నియోజకవర్గంలో 2,38,010 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఐదేళ్లలో 15,745 మంది కొత్తగా ఓటు హక్కు పొందిన వారు ఉన్నారు. కేవలం ఈ మూడు నెలల్లో 18 సంవత్సరాలు పైబడిన యువత 8 వేలకు పైగా ఓటు హక్కు నమోదు చేసుకోవడం గమనార్హం.   గత ఎన్నికల్లో 242 పోలింగ్‌ కేంద్రాలుండగా, ప్రస్తుతం వీటి సంఖ్య 288కు చేరుకుంది.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top