
సాక్షి, ముంబై : మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం శివసేన వ్యవస్థాపక అధ్యక్షుడు బాల్ థాకరేను ప్రశంసిస్తూ ట్విటర్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. వీడియోతో పాటు ‘హిందూ హృదయ సామ్రాట్ బాల్ థాకరే ఏడో వర్ధంతి సందర్భంగా ఆయనకు వేలవేల వందనాల’ని ప్రశంసిస్తూ మరాఠీలో ట్వీట్ చేశారు. బాల్ థాకరే 2012 నవంబర్ 17న మరణించారు. కాగా, మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో వచ్చిన విభేదాల వల్ల ఎన్డీఏ నుంచి శివసేన బయటకొచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది.
ఆదివారం ఎన్సీపీ నేత శరద్ పవార్‌తో సోనియా గాంధీ భేటీ జరగాల్సి ఉండగా, సోమవారానికి వాయిదా పడింది. తన పార్టీ నేతలతో శరద్‌పవార్‌కు పుణెలో ఆదివారం సమావేశం ఉన్నందువల్ల భేటీ వాయిదా పడిందని కాంగ్రెస్ నేత ఒకరు వెల్లడించారు. మరోవైపు ప్రభుత్వాన్ని మా పార్టీయే ఏర్పాటు చేస్తుందని బీజేపీ ప్రకటించగా, రాష్ట్రపతి పాలన అమలులో ఉన్న ప్రస్తుత సమయంలో ఏ పార్టీ అయినా ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.