మహిళపై అఘాయిత్యాలు.. ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలపై కేసులు

Five TDP MLAs are accused of crimes against women - Sakshi

అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్‌ రిఫార్మ్స్‌ నివేదిక 

ఆంధ్రప్రదేశ్‌లో ఆడబిడ్డలపై నానాటికీ పెచ్చుమీరుతున్న పచ్చ నేతల కీచక పర్వాన్ని జాతీయ స్థాయిలో నివేదికలు బట్టబయలు చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన శాసనసభ్యులు, అమాత్యులు మహిళలపై అంతులేని దౌర్జన్యాలు, అత్యాచారాలు, బెదిరింపులకు పాల్పడుతున్న వైనాన్ని స్వచ్ఛంద సంస్థలు, నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. ‘మహిళలపై నేరాల కేసుల్లో చట్టసభ్యులు’ అంశంపై అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌), జాతీయ ఎన్నికల పరిశీలన స్వచ్ఛంద సంస్థలు ఓ నివేదికను ఇటీవల (ఈనెల 19న) విడుదల చేశాయి. ఐదుగురు టీడీపీ చట్టసభ్యులు మహిళలపై పాల్పడ్డ నేరాలకుగానూ నమోదైన కేసులను నివేదికలో బహిర్గతం చేశాయి.

సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: దేశవ్యాప్తంగా ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీలు మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులను వారి ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా విశ్లేషించి ఆ సంస్థలు ఈ నివేదిక రూపొందించాయి. 4,077 మంది ఎమ్మెల్యేలు, 768 మంది ఎంపీల అఫిడవిట్లను పరిశీలించగా వీరిలో 33 శాతం (1,580 మంది ఎమ్మెల్యేలు/ఎంపీలు) సభ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదై ఉన్నాయని, 48 మంది సభ్యులు మహిళలపై నేరాలకు పాల్పడిన కేసులను కలిగి ఉన్నట్టు వెల్లడించింది.

వీరిలో ముగ్గురు ఎంపీలు కాగా 45 మంది ఎమ్మెల్యేలు. 45 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురు టీడీపీకి చెందిన వారే కావడం గమనార్హం. మహిళలపై నేరాలకు పాల్పడినట్టు కేసులు ఎదుర్కొంటున్న వారిలో అత్యధికంగా మహారాష్ట్రకు చెందిన వారు 12 మంది ఉండగా, రెండోస్థానంలో పశ్చిమబెంగాల్‌ ఉంది. అక్కడ 11 మంది సభ్యులు ఈ కేసులు ఎదుర్కొంటున్నారు. మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా నిలిచాయి. ఐదేసి మందితో ఒడిషా, ఆంధ్రప్రదేశ్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మొత్తం 48 మందిలో 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కాగా, ఏడుగురు శివసేన, ఆరుగురు తృణమూల్‌ కాంగ్రెస్, ఐదుగురు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు ఉన్నారు.

రాష్ట్రంలో చింతమనేని టాప్‌
అత్యంత వివాదాస్పదుడిగా పేరొందిన పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఆయనపై ఏకంగా 23 కేసులు నమోదైనట్టు ఏడీఆర్‌ నివేదిక పేర్కొంది. వాటిలో తీవ్రమైన ఐపీసీ సెక్షన్లు ఉన్నవి 13 కేసులు ఉన్నాయి. ఆయా కేసుల్లో మొత్తం 75 సెక్షన్ల కింద అభియోగాలున్నాయి. రాష్ట్ర మంత్రి, కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావుపై 13 కేసులు నమోదు కాగా, అందులో ఒకటి తీవ్రమైన కేసు. మొత్తం 42 సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి. మరో మంత్రి, శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడుపై మూడు అభియోగాల కింద ఒక కేసు నమోదైంది. విశాఖపట్నం పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తిపై నాలుగు కేసులున్నాయి. వీటిల్లో ఐపీసీకి సంబంధించి మొత్తం 21 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యానారయణ (వరదాపురం సూరి)పై ఈయనపై మొత్తం 10 కేసులుండగా 8 తీవ్రమైన కేసులు. దేశవ్యాప్తంగా రేప్‌ సంబంధిత కేసులు ఎదుర్కొంటున్న వారు ముగ్గురు సభ్యులు ఉండగా, అందులో ధర్మవరం ఎమ్మెల్యే ఒకరు. వీరిపై మహిళా వేధింపుల కేసులే కాకుండా మరిన్ని పోలీసు కేసులు కూడా ఉన్నాయని ఏడీఆర్‌ నివేదిక స్పష్టం చేసింది. 

కేసులు ఎత్తివేస్తూ జీవోలిచ్చిన సర్కార్‌..
తమ పార్టీ ప్రజాప్రతినిధులపై కేసులు ఎత్తివేస్తూ ఇటీవల తెలుగుదేశం ప్రభుత్వం అనేక జీవోలు జారీ చేసింది. హత్యలు, దోపిడీలు, మహిళలపై వేధింపులు, ప్రభుత్వ అధికారులపై దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులపై నమోదైన అనేక కేసులను ప్రభుత్వం ఇటీవల ఎత్తివేయడం విమర్శలకు దారితీసింది. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే మహిళలపై వేధింపులకు పాల్పడిన కేసులను ఎత్తివేయడం సరికాదని  న్యాయ నిపుణులు తప్పుబడుతున్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top