అధికార మదం.. తప్పతాగి గర్భిణిని తన్నాడు

Drunk CPM Leader Stabbed Pregnant Woman in Kerala - Sakshi

కోజికోడ్‌ : గర్భిణిపై అధికార పార్టీ నేత దాడి చేసిన ఘటన కేరళలో కలకలం రేపుతోంది. కడుపు మీద తన్నటంతో ఆమెకు గర్భస్రావం జరిగింది. దీంతో నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ బాధితురాలి బంధువులు అందోళన చేపట్టారు. రాజకీయంగా పెను దుమారం రేపుతున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే...

కోజికోడ్‌కు చెందిన దంపతులు స్థానికంగా ఓ కాలనీలో నివాసం ఉంటున్నారు. బాధిత మహిళ నాలుగు నెలల గర్భవతి. ఈ మధ్య వారి పొరుగునే ఉండే ఓ వ్యక్తితో  చిన్నపాటి వివాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉంటున్న ఓ సీపీఎం నేత సెటిల్‌మెంట్‌ కోసం అక్కడికి వచ్చాడు.  ఇద్దరినీ పిలిపించుకుని మాట్లాడుతున్న క్రమంలో ఒక్కసారిగా ఆమె భర్తపై దాడికి తెగబడ్డాడు. తన భర్తను వదిలేయాలంటూ బతిమాలుతుండగా ఆమె కడుపుపై ఒక్కసారిగా తన్నాడు. అంతే మహిళ రక్తస్రావంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయింది.

హుటాహుటిన మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి తరలించగా.. ఆమెకు గర్భస్రావం అయినట్లు వైద్యులు తెలిపారు. ఫిబ్రవరి 2న ఈ ఘటన చోటు చేసుకోగా.. ఈ కేసుకు సంబంధించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే సదరు నేత మాత్రం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన సమయంలో ఆ నేత పీకలదాకా తాగి ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. కేసు వాపసు తీసుకోవాలని బెదిరింపులు వచ్చాయని.. కానీ, న్యాయం జరిగేదాకా పోరాటం ఆపబోమని అతను చెబుతున్నారు.  మరోపక్క రాజకీయ పార్టీలు కూడా వారికి అండగా నిలుస్తున్నాయి. అయితే ఈ ఘటనపై స్పందించేందుకు సీపీఎం వర్గాలు విముఖత వ్యక్తం చేస్తున్నాయి. 

Back to Top