ఎట్టకేలకు ముగిసిన అమెరికా షట్‌డౌన్‌!

Donald Trump signs funding bill, ends govt shutdown - Sakshi

వాషింగ్టన్‌ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆర్థిక నిధుల (ఫండింగ్‌) బిల్లుపై సంతకం చేయడంతో మూడురోజులపాటు కొనసాగిన ప్రభుత్వ కార్యకలాపాల స్తంభన (షట్‌డౌన్‌) అధికారికంగా ముగిసిపోయింది. ఫిబ్రవరి 8వ తేదీ వరకు ప్రభుత్వ కార్యకలాపాలకు నిధులు అందించేందుకు, అలాగే ప్రముఖ పిల్లల ఆరోగ్య బీమా పథకానికి 8 ఏళ్లపాటు నిధులు సమకూర్చేందుకు ఈ బిల్లు అనుమతినిస్తుంది. అయితే, ఒబామా హయాంనాటి డీఏసీఏ (డిఫర్డ్‌ యాక్షన్‌ ఫర్‌ చైల్డ్‌వుడ్‌ అరైవల్స్‌) పథకాన్ని మాత్రం ఈ బిల్లులో చేర్చలేదు. అమెరికాకు తల్లిదండ్రులతోపాటు వచ్చిన డ్రీమర్స్‌ హక్కుల కోసం ఉద్దేశించిన ఈ పథకాన్ని బిల్లులో చేర్చాలని ప్రతిపక్ష డెమొక్రాట్లు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే.

ప్రభుత్వానికి తాత్కాలికంగా నిధులు సమకూర్చే బిల్లును మొదట అమెరికా సెనేట్‌ ఆమోదించి.. పెద్దల సభ (హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటివ్‌)కు పంపింది. పెద్దలసభ 266-150 తేడాతో ఈ బిల్లును ఆమోదించగా.. అధ్యక్షుడు ట్రంప్‌ సంతకం చేయడంతో బిల్లు చట్టంగా మారింది. దీంతో సోమవారం ఉదయం నుంచి అమెరికా ప్రభుత్వం మళ్లీ యథాతథంగా కార్యకలాపాలు ప్రారంభించింది.

వలసదారుల విషయంలో ట్రంప్‌ అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ.. ప్రభుత్వానికి నిధులు సమకూర్చే బిల్లును సెనేటర్లు తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీంతో అమెరికా ప్రభుత్వం స్తంభించిపోయి మూడురోజుల పాటు కుప్పకూలిపోయింది. ప్రభుత్వ ఏజెన్సీలు, ఉద్యోగులపై ఈ ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా మూడు వారాలపాటు ప్రభుత్వం నడిచేందుకు వీలుగా అధికార రిపబ్లికన్లతో డెమొక్రాట్లు తాత్కాలిక రాజీ కుదర్చడంతో ఈ బిల్లు ఆమోదం పొందింది. ఈ క్రమంలో కొత్త వలసదారుల బిల్లు వచ్చేనెలలోగా ఆమోదం పొందనుందని ట్రంప్‌ ప్రభుత్వం చెప్తోంది. అయితే, డిపోర్టేషన్‌ (తిరిగి స్వదేశానికి పంపబడే) ముప్పు ఎదుర్కొంటున్న  8 లక్షలమంది వలసదారులను కాపాడే విషయంలో డెమొక్రాట్లు, రిపబ్లికన్లు తాత్కాలికంగా రాజీకి వచ్చినట్టు తెలుస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top