మళ్లీ ఏచూరికే పగ్గాలు!

CPM general secretary Sitaram Yechury - Sakshi

రాజకీయ తీర్మానం పరిష్కారంతో లైన్‌ క్లియర్‌

నేడు సీపీఎం పొలిట్‌ బ్యూరో, కేంద్ర కమిటీ ఎన్నిక

పొలిట్‌బ్యూరోలోకి తమ్మినేనిని తీసుకునే అవకాశం

మధ్యాహ్నం సరూర్‌నగర్‌ స్టేడియంలో భారీ బహిరంగ సభ

ముగియనున్న 22వ జాతీయ మహాసభలు

సాక్షి, హైదరాబాద్‌ : సీపీఎం ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి రెండోసారి ఎన్నిక కానున్నారు. 2015లో విశాఖపట్నంలో జరిగిన పార్టీ మహాసభల్లో ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టిన ఆయన.. మరో మూడేళ్ల పాటు అదే పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు ఆదివారం ఉదయం జాతీయ మహాసభల వేదికగా పార్టీ కొత్త పొలిట్‌ బ్యూరో, కేంద్ర కమిటీని ఎన్నుకోనున్నారు.

పార్టీ రాజకీయ తీర్మానం విషయంలో తలెత్తిన అభిప్రాయభేదాల నేపథ్యంలో ఓటింగ్‌ వరకు వెళ్తే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ఏచూరి తప్పుకుంటారని ప్రచారం జరిగినా.. ఆ అంశం సామరస్యంగానే పరిష్కారం కావడంతో ఏచూరి మరోసారి అదే పదవిలో కొనసాగుతారని పార్టీ వర్గాలంటున్నాయి. కాగా ఈసారి తెలంగాణ నుంచి తమ్మినేని వీరభద్రంను పొలిట్‌బ్యూరోలోకి తీసుకుంటారనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

ప్రస్తుతం 16 మంది..
ప్రస్తుతం పొలిట్‌బ్యూరోలో 16 మంది సభ్యులున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితోపాటు ప్రకాశ్‌ కారత్, రామచంద్రన్‌ పిళ్లై, మాణిక్‌సర్కార్, బిమన్‌ బోస్, బృందాకారత్, పినరయ్‌ విజయన్, కె. బాలకృష్ణన్, సూర్యకాంత్‌ మిశ్రా, ఎ.కె.పద్మనాభన్, హన్నన్‌ముల్లా, ఎం.ఎ.బేబీ, సుభాషిణి అలీ, ఎండీ.సలీం, జి.రామకృష్ణన్, బీవీ రాఘవులు పొలిట్‌బ్యూరో సభ్యులుగా పని చేస్తు న్నారు. వీరిలో రాఘవులు ఒక్కరే తెలుగు రాష్ట్రా లకు చెందిన వారు. ఏచూరిది ఏపీ అయినా ఆయన పార్టీ ప్రధాన కార్యాలయం కోటా నుంచి పదవిలో కొనసాగుతున్నారు.

రామచంద్రన్‌ పిళ్లై, ఏకే రాఘవన్‌ ఈసారి రిటైర్‌ అవుతారనే చర్చ జరుగుతోంది. వయసు పెరిగిపోవడంతో వీరిద్దరికీ విశ్రాంతి కల్పిస్తారని అంటున్నారు. మళ్లీ కొనసాగాలనుకుంటే పొలిట్‌బ్యూరోలో అవకాశమిస్తారు. అయితే ఈసారి తమ్మినేనిని కూడా తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆయన క్రియాశీలంగా మారారు. పార్టీ స్తబ్ధుగా ఉన్న సమయంలో 4 వేల కి.మీ. పాదయాత్ర చేసి రాష్ట్రంలోని అన్ని జిల్లాలను చుట్టి వచ్చారు.

బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ (బీఎల్‌ఎఫ్‌) ఏర్పాటు చేసి ఉద్యమాలను ఉధృతం చేశారు.ఇప్పుడు ఈ బీఎల్‌ఎఫ్‌ దేశవ్యాప్త సామాజిక ఉద్యమాలకు దిక్సూచిగా మారింది. వీటికితోడు తమ్మినేనికి పార్టీ పట్ల ఉన్న విధేయత, చిత్తశుద్ధిని పరిగణనలోకి తీసుకుని పొలిట్‌బ్యూరోలో అవకాశం ఇస్తారని అంటున్నారు. ఆయనతోపాటు వ్యవసాయ కార్మిక సంఘం నేత విజయ రాఘవన్, ఏపీకి చెందిన సీఐటీయూ నాయకురాలు హేమలతకు కూడా అవకాశం కల్పించవచ్చని తెలుస్తోంది.

తెలంగాణ నుంచి పార్టీ కేంద్ర కమిటీ సభ్యులుగా తమ్మినేనితోపాటు ఎస్‌.వీరయ్య, చెరుపల్లి సీతారాములు, ప్రత్యేక ఆహ్వానితురాలిగా మల్లు స్వరాజ్యం, ఏపీ నుంచి ఎస్‌.పుణ్యవతి, పెనుబల్లి మధు, పాటూరి రామయ్య, ఎం.ఎ.గఫూర్‌లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో పాటూరి ఈసారి రిటైర్‌ అయ్యే అవకాశాలున్నాయి.

‘29 దేశాల సౌహార్ద సందేశాలు’
సీపీఎం జాతీయ మహాసభల సందర్భంగా ప్రపంచంలోని 29 దేశాలకు చెందిన కమ్యూనిస్టు పార్టీలు తమ సౌహార్ద సందేశాలను పంపాయి. చైనా, వియత్నాం, క్యూబా, కొరియాలతో పాటు పలు దేశాల కమ్యూనిస్టు పార్టీలు పంపిన సౌహార్ద సందేశాలను శనివారం ఆ పార్టీ ప్రతినిధులు మీడియాకు విడుదల చేశారు.

నేడు బహిరంగ సభ
పార్టీ పొలిట్‌ బ్యూరో, కేంద్ర కమిటీ ఎన్నిక అనంతరం జాతీయ మహాసభల ముగింపు సూచికగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సరూర్‌నగర్‌ ఇండోర్‌స్టేడియం వేదికగా జరుగనున్న ఈ సభకు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలు హాజరు కానున్నారు.

సభను వీక్షించేందుకు సభా ప్రాంగణంలో, ఎల్బీనగర్‌ చౌరస్తాలో 12 ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం మూడు గంటలకు మలక్‌పేట టీవీ టవర్‌ నుంచి రెడ్‌షర్ట్‌ వలంటీర్ల కవాతు ప్రారంభం కానుంది. ఈ కవాతులో 20 వేల మంది ఎర్ర సైన్యం పాల్గొననుంది. సాయంత్రం ఐదు గంటలకు బహిరంగ సభ ప్రారంభం కానుంది. దాదాపు మూడు లక్షల మంది ఈ మహాసభకు హాజరయ్యే అవకాశం ఉందని తమ్మినేని పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top