‘పెద్దోళ్లంతా’ లోక్‌సభకే! | Sakshi
Sakshi News home page

‘పెద్దోళ్లంతా’ లోక్‌సభకే!

Published Fri, Feb 16 2018 3:20 AM

Congress seniour leaders to be contest loksabha - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలను ఈసారి లోక్‌సభకు పోటీ చేయించాలని ఆ పార్టీ అధిష్టానం యోచిస్తోంది. ముఖ్యంగా వారసులను బరిలోకి దింపాలని ప్రయత్నిస్తున్న నేతలను పార్లమెంటుకు పంపాలని, వారసులకు రాష్ట్రంలో అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని భావిస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్‌లో చాలా మంది నేతలు సీఎం రేసులో ఉండటం, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల కసరత్తు పకడ్బందీగా జరగకపోతే నష్టం తప్పదన్న అంచనాలు, పార్టీలోని నేతల మధ్య పోటీకి చెక్‌ పెట్టడం లక్ష్యంగా పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు గాంధీభవన్‌ వర్గాల్లో చర్చ సాగుతోంది. దీంతోపాటు సీనియర్లు పోటీచేసే లోక్‌సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులకు అన్నివిధాలా భరోసా కల్పించినట్లు అవుతుందని అంటున్నారు.

కుటుంబ సభ్యులకు సీట్లు..! 
రాష్ట్ర కాంగ్రెస్‌ సీనియర్లు చాలామంది వచ్చే ఎన్నికల్లో తమ కుటుంబ సభ్యులకు కూడా అవకాశం కల్పించాలని పార్టీకి ప్రతిపాదిస్తున్నారు. అయితే సీట్ల సర్దుబాటు, ప్రాంతాలు, సామాజిక సమీకరణాల దృష్ట్యా కుటుంబ సభ్యులకు సీట్లు కోరుకునే నేతలందరినీ సంతృప్తిపరిచే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులకు సీటు కావాలంటే.. లోక్‌సభకు వెళ్లాలని సీనియర్లకు మెలిక పెట్టే అవకాశాలున్నాయని అంటున్నారు. సీనియర్‌ నేతలు కోమటిరెడ్డి, పొన్నాల, జానా, సబిత, డీకే అరుణ, సర్వే సత్యనారాయణ, గీతారెడ్డి, రాజనర్సింహ తదితరులు ఈ జాబితాలో ఉన్నట్లు చెబుతున్నారు.

– సీనియర్‌ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను నల్లగొండ లోక్‌సభకు పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ అసెంబ్లీ నుంచి సోదరుడు, ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డికి లైన్‌క్లియర్‌ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 
– జానారెడ్డి కుమారుడు రఘువీర్‌ గత ఎన్నికల సమయంలోనే మిర్యాలగూడ అసెంబ్లీ స్థానాన్ని ఆశించారు. కానీ వీలుకాలేదు. ఈసారి ఎమ్మెల్యే బరిలో దిగాల్సిందేనన్న పట్టుదలతో ఉన్నారు. ఆయనకు అవకాశమిస్తే.. జానాను నల్లగొండ లేదా మల్కాజ్‌గిరి నుంచి లోక్‌సభకు పోటీ చేయించే అవకాశాలున్నట్లు సమాచారం. 
– సబితా ఇంద్రారెడ్డి తన కుమారుడు కార్తీక్‌ కోసం గత ఎన్నికల్లోనే అసెంబ్లీ స్థానాన్ని వదులుకున్నారు. ఆ ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీగా పోటీచేసిన కార్తీక్‌.. ఈసారి రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే బరిలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో సబితను చేవెళ్ల ఎంపీ స్థానంలో పోటీకి దింపే అవకాశాలున్నాయి. 
– పొన్నాల లక్ష్మయ్య కూడా కోడలు వైశాలిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రతిపాదిస్తున్నారు. ఆమె జనగామ నుంచి పోటీ చేయాలనుకుంటే పొన్నాలను భువనగిరి ఎంపీ స్థానంలో పోటీ చేయాలని కోరవచ్చని అంటున్నారు. 
– డీకే అరుణ తన కుమార్తె స్నిగ్ధారెడ్డిని ఎమ్మెల్యే చేయాలనే ఆలోచనతో ఉన్నారు. అదే జరిగితే అరుణను లోక్‌సభకు పంపవచ్చని.. మహబూబ్‌నగర్‌ నుంచిగానీ, మరో చోట గానీ పోటీలోకి దింపవచ్చని తెలుస్తోంది. 
– సీనియర్‌ నేత జైపాల్‌రెడ్డిని ఈసారి కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ)లోకి తీసుకుంటారని, వచ్చే ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నుంచి బరిలో ఉంటారనే చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే జైపాల్‌రెడ్డి సీఎం రేసులో ఉంటారు. కానీ తనకు సీఎం కావాలన్న ఆలోచన లేదని, ఈసారికి ఎంపీ బరిలోనే ఉంటానని జైపాల్‌రెడ్డి సన్నిహితుల వద్ద చెబుతున్నారు. 
– ఇక పీసీసీ చీఫ్‌ ఉత్తమ్, ఆయన సతీమణి పద్మావతీరెడ్డి ఇద్దరూ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కుటుంబంలో ఒకరికే అసెంబ్లీ అవకాశమనే నిర్ణయం నేపథ్యంలో.. ఉత్తమ్‌ హుజూర్‌నగర్‌ అసెంబ్లీకే పోటీచేస్తారని, పద్మావతి ప్రాతినిధ్యం వహిస్తున్న కోదాడలో మరొకరికి అవకాశమిస్తారని చెబుతున్నారు. దీంతో ఇతర నేతల నుంచి అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉండదనే చర్చ జరుగుతోంది. 

ఆ ఎంపీ స్థానాల కోసం.. 
రాష్ట్రంలో ఎస్సీ రిజర్వుడు లోక్‌సభ స్థానాలైన వరంగల్, పెద్దపల్లి విషయంలో కాంగ్రెస్‌ అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితిలో ఉంది. గత ఎన్నికల్లో వరంగల్‌ నుంచి పోటీ చేసిన రాజయ్య కుటుంబ సమస్యల దృష్ట్యా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పెద్దపల్లి నుంచి పోటీ చేసిన వివేక్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే కాంగ్రెస్‌ వరంగల్‌ లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికల్లో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణను నిలబెట్టింది. ఈసారీ ఆయననే బరిలోకి దింపవచ్చని అంటున్నారు. లేదా గీతారెడ్డి, దామోదర రాజనర్సింహ పేర్లను కూడా పరిశీలించే అవకాశాలున్నట్లు చర్చ జరుగుతోంది. గీతారెడ్డి కుమార్తె మేఘనారెడ్డి, రాజనర్సింహ సతీమణి పద్మినీరెడ్డిల పేర్లు కూడా ఈసారి ఎన్నికల బరిలో వినిపిస్తున్నాయి.  

Advertisement

తప్పక చదవండి

Advertisement