కశ్మీర్‌ అంశంపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే హర్షం | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌ అంశంపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే హర్షం

Published Tue, Aug 6 2019 9:18 AM

Congress Raebareli MLA Backs Centre Decision - Sakshi

లక్నో: జమ్మూకశ్మీర్‌ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370, 35–ఏ అధికరణాలను రద్దు చేస్తూ.. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను కూడా తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై యావత్‌ దేశం హర్షం వ్యక్తం చేస్తోంది. దీనికి భిన్నంగా విపక్ష కాంగ్రెస్‌ ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమంటూ ఆ పార్టీ పార్లమెంట్‌లో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అయితే కశ్మీర్‌పై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. రాయ్‌బరేలీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అధితి సింగ్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా స్పందించిన ఆమె ‘దేశ సమైఖ్యతకు తామంతా కట్టుబడి ఉంటాం. జైహింద్‌’ అంటూ ట్వీట్‌ చేశారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా అధితి పోస్ట్‌ చేయడం కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది. అధితి సింగ్‌ పోస్ట్‌పై కాంగ్రెస్‌ అధిష్టానం ఇప్పటి వరకు స్పందించలేదు. కాగా రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి యూపీయే చైర్‌పర్సన్‌ ఎంపీగా గెలుపొందిన విషయం గమన్హారం. 

ఆమెతో పాటు యూపీ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జనార్థన్‌ ద్వివేది కూడా కేంద్ర నిర్ణయాన్ని స్వాగతించారు. వీరితో పాటు మరికొంత మంది హస్తం నేతలు కూడా ఆర్టికల్‌ 370 రద్దును సమర్థిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దుపై తమ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యసభలో కాంగ్రెస్‌ విప్‌ భువనేశ్వర్ కలిత రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. కాంగ్రెస్‌ పార్టీకి కూడా ఆయన రాజీనామా చేశారు. ఆర్టికల్‌ 370పై కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం ఆత్మహత్యాసదృశ్యంగా ఉందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. దేశమంతా కశ్మీర్‌ అంశంపై చర్చిస్తుంటే కాంగ్రెస్‌ అధిష్టానం పెద్దలు రాహుల్‌ గాంధీ, సోనియా, ప్రియాంక గాంధీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. 

Advertisement
Advertisement