గుజరాత్‌ చేజారినా.. | Congress loses Gujarat but may gain back its mojo in coming polls  | Sakshi
Sakshi News home page

గుజరాత్‌ చేజారినా..

Dec 18 2017 3:16 PM | Updated on Mar 18 2019 9:02 PM

Congress loses Gujarat but may gain back its mojo in coming polls  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఉత్కంఠ పోరులో గుజరాత్‌లో కాంగ్రెస్‌ ఓటమి పాలైనా బీజేపీకి గట్టి పోటీ ఇవ్వడం, ఓట్ల శాతాన్ని గణనీయంగా మెరుగుపరుచుకోవడం‍తో 2019 సార్వత్రిక ఎన్నికల సంగ్రామానికి ఇది సానుకూల సంకేతమని ఆ పార్టీ భావిస్తోంది. కాంగ్రెస్‌ చీఫ్‌గా పాలనా పగ్గాలు అందుకున్న రాహుల్‌కు ఈ ఫలితాలు మరింత పరిణితిని, మున్ముందు ఎన్నికల వ్యూహాల్లో రాటుదేలే అవకాశాలనూ అందిస్తాయన్న అంచనాలూ వెల్లడవుతున్నాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జవసత్వాలను కూడదీసుకుని పోరాడే స్ఫూర్తిని అందిస్తాయని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

దశాబ్ధాలుగా మోదీకి, బీజేపీకి పెట్టనికోటగా ఉన్న గుజరాత్‌లో పాగా వేసేందుకు కాంగ్రెస్‌ చేయని ప్రయత్నం లేదు. ప్రచారపర్వంలో రాహుల్‌ చెమటోడ్చుతూ సుడిగాలి పర్యటనలతో హోరెత్తించారు. జీఎస్‌టీ, నోట్ల రద్దు నుంచీ దళితులు, రైతుల సమస్యలూ ఏ ఒక్కటినీ విడిచిపెట్టకుండా పాలక సర్కార్లను టార్గెట్‌ చేస్తూ ఎండగట్టారు. ఫలితంగా బీజేపీ కోటకు బీటలు వారనప్పటికీ 2012లో కాంగ్రెస్‌ సాధించిన 38 శాతం ఓట్లు ఈ సారి ఏడు శాతం పెరిగి 45 శాతం ఓట్లను రాబట్టింది.

యువ ఓటర్లు ఈ ఎన్నికల్లో అధికంగా కాంగ్రెస్‌ పార్టీకి చేరువయ్యారు. రైతుల అసంతృప్తి, నిరుద్యోగం, జీఎస్‌టీ ఇబ్బందులను రాహుల్‌ పదేపదే ప్రచారం చేస్తూ ప్రజల్లోకి దూసుకెళ్లడం ఫలితాలనిచ్చింది. గ్రామీణ రైతాంగం ప్రాబల్యం అధికంగా ఉండే సౌరాష్ట్ర కచ్‌ ప్రాంతంలో కాంగ్రెస్‌ విస్పష్ట ఆధిక్యం బీజేపీని కలవరపాటుకు గురిచేస్తోంది. అయితే గుజరాత్‌లో ప్రజలను ఆకట్టుకునే బలమైన నేత కొరవడటం కాంగ్రెస్‌కు నష్టం చేకూర్చింది. ప్రచారం నుంచీ అన్నింటికీ ఆ పార్టీ రాహుల్‌పైనే ఆధారపడాల్సిన పరిస్థితి. ఆ పార్టీ సీనియర్‌ నేతలు అర్జున్‌ మొద్వాడియా, శక్తిసింహ్‌ గొహిల్‌ కూడా ఓటమి పాలయ్యారు. ప్రాంతీయ నేతలు బలంగా ఉన్న పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో గతంలో కాంగ్రెస్‌ సత్తా చాటడం గమనార్హం.

వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం సీఎం సిద్ధరామయ్యకు కాంగ్రెస్‌ పూర్తి స్వేచ్ఛ ఇస్తోంది. ఇక రాజస్ధాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్న క్రమంలో అక్కడ కాంగ్రెస్‌ పార్టీ చెమటోడిస్తే మెరుగైన ఫలితాలు సాధించడం అసాధ్యమేమీ కాదు. పార్టీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన రాహుల్‌ ఇక ఎలాంటి వ్యూహాలకు పదును పెడతారనే దానిపై ఆ పార్టీ భవిష్యత్‌ ఆధారపడివుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement