నామ్‌దార్‌కు ఇద్దరు బ్యాట్స్‌మెన్‌

Cong has fielded two batsmen to take blame for poll defeat - Sakshi

23న ఏం జరగబోతోందో వారికి బాగా తెలుసు

పిట్రోడా, మణిశంకర్‌లకు ఆ బాధ్యత అప్పగించింది

జార్ఖండ్‌ ఎన్నికల ప్రచారంలో మోదీ

దేవ్‌గఢ్‌ (జార్ఖండ్‌) / పాలిగంజ్‌ (బిహార్‌)/తాకి (పశ్చిమబెంగాల్‌):  లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోనున్న నేపథ్యంలో నామ్‌దార్‌కు బాసటగా నిలిచేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఇద్దరు బ్యాట్స్‌మన్‌లను బరిలోకి దింపిందని  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఎన్నికల్లో పేలవమైన ప్రదర్శనకు బాధ్యత వహించే పనిని ఆ పార్టీ మణిశంకర్‌ అయ్యర్, శామ్‌ పిట్రోడాలకు అప్పగించిందని విమర్శించారు. బుధవారం జార్ఖండ్‌లోని దేవ్‌గఢ్, బిహార్‌లోని పాటలీపుత్ర, పశ్చిమబెంగాల్‌లోని తాకి ఎన్నికల సభల్లో ఆయన మాట్లాడారు.

‘1984లో సిక్కుల ఊచకోతపై ‘అయ్యిందేదో అయిపోయింది’ అని ఒకరంటారు. ఇంకొకరు గుజరాత్‌ ఎన్నికల్లో నన్ను దూషించిన తర్వాత ఇన్నాళ్లూ తెరవెనుక ఉండి.. ఇప్పుడు మళ్లీ నాపై దాడికి (నీచ్‌ ఆద్మీ అంటూ) దిగుతున్నారు’ అని పిట్రోడా, అయ్యర్‌లను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. మే 23న ఏం జరగబోతోందనడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ అని సభకు భారీ సంఖ్యలో హాజరైన ప్రజలనుద్దేశించి ప్రధాని అన్నారు. కాంగ్రెస్‌కు ఈ విషయం బాగా తెలుసని, అందుకే ఫలితాలను ఎదుర్కొనేందుకు సంసిద్ధమవుతోందని చెప్పారు.

ఓటమిని ఎవరి తలపై రుద్దాలా అనే ఆలోచనలో పడిందన్నారు. నామ్‌దార్‌ కారణంగా ఓటమి పాలయ్యామని కాంగ్రెస్‌ ఎప్పుడూ చెప్పుకోదని, అది రాజవంశ సూత్రాలకు విరుద్ధమని విమర్శించారు. కేవలం ఐదో విడత ఎన్నికల తర్వాత మాత్రమే ఆ కుటుంబానికి చెందిన సమీప సభ్యులిద్దరూ సొంతగా బ్యాటింగ్‌ చేయడం మొదలుపెట్టారని ఎద్దేవాచేశారు. బరిలోకి దిగకుండానే మ్యాచ్‌ ఆడే సాహసం కెప్టెన్‌ను అడక్కుండా వారు చేయరన్నారు. నిందను మోసేందుకు కాంగ్రెస్‌ నేతలు క్యూ కడుతున్నారన్నారు. ఉగ్రవాదులు, నక్సలైట్లు, వారి మద్దతుతారులను ప్రోత్సహించేలా రాజద్రోహ చట్టాన్ని నీరు గార్చాలని కాంగ్రెస్‌ ప్రయత్నించిందన్నారు.

కానీ బీజేపీ అందుకు అనుమతించదని, తమ ప్రభుత్వం ఉగ్రవాదుల స్థావరాల్లోకి వెళ్లి మరీ దాడి చేసిందని చెప్పారు. భూతాలను తరిమినట్టు వారిని తరిమి కొట్టాలన్నారు. సైన్యానికి ఈ మేరకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చామన్నారు. దేశ భద్రత ఒక అంశమే కాదని మహా కల్తీ కూటమి నేతలంటున్నారని మోదీ ఆరోపించారు. లెక్కలేనన్ని ఉగ్రదాడుల్లో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నప్పుడు అది ఒక అంశంగా కాకుండా ఎలా ఉంటుందని ప్రశ్నించారు.  ఢిల్లీలో కూర్చున్నవారికి గిరిజనుల బాధలు పట్టవన్నారు.  ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉండబోతున్నాయంటూ.. ఈసారి బిహార్‌కు తాజా అభివృద్ధి గంగ (వికాస్‌ కీ గంగ)ను తీసుకువస్తానని ప్రధాని అన్నారు. అయితే మరింత గొప్ప విజయం లభించేలా చివరి విడత పోలింగ్‌ ఉండాలని పిలుపునిచ్చారు.

ప్రజాస్వామ్యం గూండాస్వామ్యంగా మారింది
పశ్చిమ బెంగాల్‌లో ప్రజాస్వామ్యం గూండాస్వామ్యంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అన్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బెంగాల్‌ రాష్ట్రంలో ఆత్యయిక స్థితిని సృష్టించారనీ, ప్రతీ దాన్ని నాశనం చేయడానికి ఆమె ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మోదీ ధ్వజమెత్తారు. ప్రజల ధైర్యం, నిశ్చయాలే ఆమె ‘తీవ్ర బాధాకరమైన పాలన’ నుంచి విముక్తి కల్పిస్తాయని మోదీ అన్నారు. ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు జిల్లాల్లో మోదీ బుధవారం ప్రచారం నిర్వహించారు. బెంగాల్‌లోని 42 సీట్లలో తమ పార్టీయే అధిక సీట్లు గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top