కేసీఆర్‌ ఏమైనా భూత వైద్యుడా..?: భట్టి | CM KCR About Corona Virus On Bhatti Comments In Telangana Assembly | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ ఏమైనా భూత వైద్యుడా..?: భట్టి

Mar 14 2020 4:27 PM | Updated on Mar 14 2020 4:57 PM

CM KCR About Corona Virus On Bhatti Comments In Telangana Assembly - Sakshi

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వైరస్ స్థితిగతులపై శనివారం అసెంబ్లీలో చర్చ జరిగిన సంగతి తెలిసిందే. కరోనాకు అభివృద్ధి చెందిన దేశాలే భయపడుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ప్రజలు ఇబ్బందిపడతారన్నారు. అధికారులకు సరైన చర్యలు తీసుకోవాలని చెప్పకుండా.. సీఎం కేసీఆర్‌ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని మండిపడ్డారు. ఆయన భూత వైద్యుడిలా మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్‌ను చూసి కరోనా గజగజ వణకదన్నారు. ఒకవేళ కేసీఆర్‌ను చూసి కరోనా వణికితే డబ్ల్యూహెచ్‌వోకు చెప్పి ప్రపంచదేశాలు తిప్పుతామని చెప్పారు.

కాగా.. కరోనాకు పారాసిట్‌మాల్‌ ట్యాబ్‌లెట్ వేసుకుంటే సరిపోతుందని కేసీఆర్‌ అన్నారంటూ భట్టి ఎద్దేవా చేశారు. అంతేకాక.. 27డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే కరోనా దరి చేరదని, అంత ఎండలో ఆ వైరస్ చనిపోతుందని సీఎం అసెంబ్లీలోనే చెప్పారని గుర్తు చేశారు. అలాంటప్పుడు కర్ణాటక వాసి హుస్సేన్ సిద్ధిఖీ హైదరాబాద్‌లో అన్ని ఆస్పత్రుల్లో చికిత్స పొందిన తర్వాత కూడా ఎలా చనిపోయాడని భట్టి ప్రశ్నించారు. అసెంబ్లీ సెషన్‌లో కాంగ్రెస్‌పై కేసీఆర్‌ వ్యాఖ్యలను కూడా ఖండిస్తున్నాం, ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చదవండి: ఏదైనా మంచి ఉంటే గదా.. చెప్పడానికి?

దీనిపై కేసీఆర్‌ స్పందిస్తూ.. కరోనాపై రాజకీయాలు చేయొద్దని, దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అలెర్ట్‌గా ఉన్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల తీరుపై కేసీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కెనడాలో ప్రధాని భార్యకు కూడా కరోనా వచ్చిందన్న కేసీఆర్.. ప్రజలు కంగారు పడతారని నాలుగైదు రోజుల తర్వాత వెల్లడించారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తుంటే కొందరు దీనిపై రాజకీయ లబ్ధికోసం అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి సమయంలో బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ కేసీఆర్ మండిపడ్డారు. ప్రతిపక్షాలు చేసే అర్థంలేని విమర్శలను పట్టించుకోవాల్సిన పనిలేదంటూ సీఎం కొట్టిపారేసారు. చదవండి: కరోనా మృతదేహాలను ఏం చేస్తున్నారంటే..! 

135 కోట్ల మంది ఉన్న దేశంలో ఇప్పటి వరకు వైరస్‌ సోకింది కేవలం 65 మందికేనని.. కేంద్రం మాత్రమేకాక కాంగ్రెస్‌ ప్రభుత్వ రాష్ట్రాల్లో కూడా అప్రమత్తంగా ఉన్నారన్నారు. అన్ని ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా పనిచేస్తున్నాయని చెప్పారు. ప్రజలకు ధైర్యం చెప్పేందుకే తగిన ఉష్ణోగ్రత దగ్గర వైరస్‌ బతకదని చెప్పానని.. పారాసిట్‌మాల్‌ వేసుకుంటే జ్వరం తగ్గుతుందని ఒక సైంటిస్ట్‌ తనతో చెప్పారన్నారు. కరోనా విషయంలో కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ రాష్ట్రంలో నిపుణులతో నిరంతరం సమీక్షలు చేస్తూ అప్రమత్తంగా ఉన్నామని ప్రజలు ఏమాత్రం భయపడాల్సిన పనిలేదని సీఎం భరోసానిచ్చారు. కరోనా విషయంలో పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని కేబినెట్‌లో కూడా దీనిపై చర్చించి మరింతగా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. కరోనాను కట్టడి చేసిన ప్రజల్లో భయాందోళనలకు పోగొడతామని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తంచేశారు.  చదవండి: కరోనాపై సీఎం కేసీఆర్ ప్రకటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement