పీవీ, ప్రణబ్‌పై చిన్నారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు 

Chinna Reddy Controversial Comments On Former PM PV Narasimha Rao - Sakshi

మాజీ ప్రధాని పీవీ తిన్నింటివాసాలు లెక్కపెట్టారని విమర్శ 

ఆరెస్సెస్‌ సభకెళ్లి భారతరత్న తెచ్చుకున్నారని ప్రణబ్‌పై మండిపాటు 

సాక్షి, హైదరాబాద్‌: మాజీ ప్రధాని, దివంగత కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పీవీ నరసింహారావు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీలపై ఏఐసీసీ కార్యదర్శి జి.చిన్నారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన వ్యక్తి పీవీ అని తీవ్రంగా విమర్శించారు. రాజకీయాలు మానుకొని హైదరాబాద్‌లో కూర్చున్న పీవీని సోనియాగాంధీ పిలిచి ప్రధానిని చేశారన్న చిన్నారెడ్డి.. ఇంత గౌరవం ఇచ్చినప్పటికీ పీవీ పార్టీని భ్రష్టు పట్టించారని దుయ్య బట్టారు. బుధవారం గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో చిన్నారెడ్డి మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌ పార్టీ పీవీకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది. కానీ ఆయన మాత్రం గద్దెనెక్కిన తర్వాత సోనియా సహా సీనియర్లను అణగదొక్కే ప్రయత్నం చేశారు. ప్రధాని పదవికి మరోనేత పోటీగా తయారవుతారనే ఆయన అలా వ్యవహరించారు. బాబ్రీ మసీదు కూల్చివేతకు సహకరించి పీవీ మరో ఘోరతప్పిదం చేశారు. దీంతో అప్పటివరకు కాంగ్రెస్‌ను లౌకిక పార్టీగా విశ్వసించిన మైనారిటీలు పార్టీకి దూరమయ్యారు. దీంతో పార్టీకి ఇబ్బందులు తలెత్తడంతోనే గాంధీ కుటుంబం ఆయన్ను పక్కనబెట్టింది. కేవలం బాబ్రీని కూల్చినందుకే బీజేపీ నేతలు పీవీని పొడుగుతున్నారు’అని చిన్నారెడ్డి వ్యాఖ్యానించారు. 

ప్రణబ్‌ను రాష్ట్రపతి చేసిన ఘనత కూడా కాంగ్రెస్‌దే అన్నారు. నాగ్‌పూర్‌లో ఆరెస్సెస్‌ సభకు వెళ్లి, సంఘ్‌ భావజాలాన్ని ప్రశంసించినందుకే ప్రణబ్‌కు బీజేపీ భారతరత్నతో సత్కరించిందన్నారు. అది కూడా ఆరెస్సెస్‌ నేత నానాజీ దేశ్‌ముఖ్‌తో కలిపి ఇచ్చారని చిన్నారెడ్డి గుర్తుచేశారు. ఆరెస్సెస్‌ భావజాలం ఉన్న వాళ్లనే బీజేపీ దగ్గరకి తీస్తోందని, దేశమంతా ఆ భావజాలాన్ని నింపాలనే లక్ష్యంతోనే ఎన్డీయే ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆరెస్సెస్‌కు అనుకూలంగా లేనందుకే బీజేపీ ఆయన్ను పొగడదని చిన్నారెడ్డి అన్నారు. మన్మోహన్‌సింగ్‌కు కాంగ్రెస్‌ పార్టీ ఎంతో గౌరవం ఇస్తోందని, పార్టీ ప్రధాన కార్యక్రమాలన్నింటిలో ఆయనకు తగిన గౌరవం ఇస్తున్నామని పేర్కొన్నారు. 
 
తెలంగాణ అప్పులకుప్ప 
మిగులు బడ్జెట్‌తో ఉన్నామని చెబుతున్నప్పటికీ.. కేసీఆర్‌ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని చిన్నారెడ్డి విమర్శించారు. తెలంగాణకు 1.8లక్షల కోట్ల రూపాయల అప్పున్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా చెప్పిందన్నారు. ఈ నిధులను ఎక్కడ ఖర్చు పెట్టారో కేసీఆర్‌ వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. కాళేశ్వరం ద్వారా నీరందించేందుకు ఎకరాకు రూ.75వేల ఖర్చు అవుతుందని, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ వ్యయం ఇప్పటికే రూ.50 వేల కోట్లు దాటిందని ఆయన తెలిపారు. వీటన్నింటిపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top