ఊరించి.. ఉసూరు..!

Chandrababu Naidu Distributes Only Money Payers In Meeting Visakhapatnam - Sakshi

9వేల మందికి పట్టాలిస్తామన్నారు

అందరినీ రప్పించారు.. ఆర్భాటంగా ఏర్పాట్లు చేశారు

చివరికి డబ్బులు కట్టినవారికేనని చల్లగా చెప్పారు

ఈమాత్రం దానికి తమను ఎందుకు రప్పించారని లబ్ధిదారుల అసంతృప్తి

మూడు విడత పట్టాల పండుగ.. తొమ్మిదివేల మందికి పట్టాలిస్తామని ఊరించారు.. కోట్లు కుమ్మరించి భారీగా ఏర్పాట్లు చేశారు. సీఎం పాల్గొనే కార్యక్రమం అంటూ అందరినీ బలవంతంగా రప్పించారు. చివరికి డబ్బులు కట్టినవారికే పట్టాలు ఇస్తామంటూ లబ్ధిదారులను ఉసూరుమనిపించారు. సుమారు రెండువేల మందికే పట్టాలు ఇచ్చారు. ఏయూ ఇంజినీరింగ్‌ గ్రౌండ్స్‌ సర్కారు ఆర్భాటంగా నిర్వహించిన పట్టాల పంపిణీ కార్యక్రమం తీరిది. వచ్చిన వారంతా సీఎం ప్రసంగిస్తుండగానే కౌంటర్ల వద్దకు చేరడంతో వేదిక ముందు భాగం ఖాళీగా కనిపించింది.

సాక్షి, విశాఖపట్నం: ఆత్మస్తుతి... పరనింద అన్నట్టుగా సాగింది విశాఖ ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల గ్రౌండ్స్‌లో గురువారం జరిగిన మూడో విడత పట్టాల పండుగ కార్యక్రమం. మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ సభ రెండు గంటలు ఆలస్యంగా 5 గంటలకు ప్రారంభమైంది. జీవో నంబర్‌ 388 కింద 8271, జీవో నెం.301 (గాజువాక హౌసింగ్‌ సొసైటీ భూములు)కింద మరో 800 పట్టాలు ఇవ్వాలని తలపోశారు. ఆ మేరకు భారీగా ఏర్పాట్లు చేశారు. 9వేల మందిని కుటుంబ సభ్యులతో రప్పించారు. కానీ చివరికొచ్చేసరికి వేదికపై పట్టుమని పది మందికి మించి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రుల చేతుల మీదుగా పట్టాలివ్వలేదు. కనీసం కౌంటర్లలోనైనా అందరికీ పట్టాలి స్తారనుకుంటే అదీ జరగలేదు.

ఏకంగా 87కౌంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ కేవలం డబ్బులు కట్టిన వారికి మాత్రమే పట్టాలు వచ్చాయని, వారికి మాత్రమే ఇస్తామని అధికారులు తెగేసి చెప్పడంతో డబ్బులు కట్టని వారు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. డబ్బులు చెల్లించిన 2385 మందికి మాత్రమే కౌంటర్లలో పట్టాలు  పంపిణీ చేశారు. ఈ మాత్రం దానికి అందరినీ ఎందుకు రప్పించారంటూ పట్టాదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభా స్థలికి రెండు గంటలు ఆలస్యంగా సీఎం చేరుకున్నా ముందున్న గ్యాలరీల్లో కూడా పూర్తి స్థాయిలో జనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. వచ్చిన వారంతా పట్టాల పంపిణీ కౌంటర్ల వద్దే వేచి ఉన్నారు తప్ప సభలో కూర్చునేందుకు ఆసక్తి చూపలేదు. కూర్చున్న వారిలో సైతం చాలా మంది సీఎం మాట్లాడక ముందే బయటకు వెళ్లిపోయేందుకు సిద్ధమవగా... పోలీసులు బలవంతంగా గ్యాలరీల్లో కూర్చొబెట్టే ప్రయత్నం చేశారు. 

సభ నుంచి వెళ్లిపోతున్న వారిని బలవంతంగా వెళ్లకుండా కూర్చోబెడుతున్న పోలీసులు

ఊకదంపుడు ఉపన్యాసాలు..
సభా స్థలికి మధ్యాహ్నం మూడు గంటలకు రావాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు సాయంత్రం ఐదు గంటలకు చేరుకున్నారు. అంతవరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రసంగాలతో ఉదరగొట్టేశారు. చివరికి ఏకంగా 40 నిమిషాల పాటు ప్రసంగించిన చంద్రబాబు సైతం ప్రజల సహనాన్ని పరీక్షించారు. మధ్యలో మైకులు మొరాయించినా వదలకుండా ప్రసంగాన్ని కొనసాగించారు. ఎప్పటిలాగే గడిచిన నాలుగేళ్లలో అది చేశాం.. ఇది చేశాం అంటూ గొప్పలు చెప్పుకోవడానికే సీఎం ప్రాధాన్యమిచ్చారు. హుద్‌హుద్‌ మొదలు కొని నిన్నమొన్నటి భాగస్వామ్య సదస్సు వరకు ఏకరవు పెట్టారు. లక్షల ఇళ్లు ఇచ్చామని, లక్షలాది మందికి పట్టాలు ఇచ్చామంటూ గొప్పలు చెప్పుకున్నారు. అమరావతి మాదిరిగానే విశాఖలో కూడా 1600 ఎకరాలను ల్యాండ్‌ ఫూలింగ్‌ పద్ధతిలో సమీకరిస్తున్నామని ప్రకటించారు. భూకబ్జాలను ప్రస్తావించిన సీఎం సిట్‌ నివేదిక ఎప్పుడు బయటపెట్టేది తేల్చలేదు. పట్టాలిచ్చిన వారితో కూడా సొంత డబ్బా కొట్టించుకునే ప్రయత్నం చేశారు. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, జిల్లా మంత్రి సీహెచ్‌ అయ్యన్న పాత్రుడులతో సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా మాట్లాడినా గత మూడు రోజులుగా కినుకు వహించిన గంటాతో మాత్రం మాట్లాడించకపోవడంతో ఆయన ఒకింత అసహనం వ్యక్తం చేశారు.

అరకొర ఏర్పాట్లతో అవస్థలు
పెదవాల్తేరు(విశాఖ తూర్పు): జిల్లా యంత్రాంగం అరకొర ఏర్పాట్లు చేయడంతో పట్టాదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. కనీసం సమాచారం ఇచ్చే నాథుడే కనిపించలేదు. మీ సేవ కౌంటర్ల వద్ద రద్దీ నెలకొన్నా... ఏ కౌంటర్‌లో ఎవరికి పట్టాలు ఇస్తున్నారో చెప్పేందుకు అక్కడ అధికారులు అందుబాటులో లేకపోవడం గమనార్హం. వాటర్‌ ప్యాకెట్లు, తినుబండారాలు ఎక్కడున్నాయో ఎవరికీ తెలియని అయోమయ దుస్థితి నెలకొంది.

ప్రజాధనం దుర్వినియోగం
ఎంవీపీ కాలనీ(విశాఖ తూర్పు): మూడో విడత పట్టాల పంపిణీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం  అధికారం, ప్రజాధనం దుర్వినియోగానికి తెరతీసింది. భారీ ప్రాంగణం నిర్మాణంతో పాటు ఎయిర్‌ కూలర్స్, భద్రత కోసం ఎలక్ట్రానిక్‌ యంత్రాలను ఏర్పాటు చేయడంతోపాటు భారీ ఫ్లెక్సీలు, బస్సుల్లో జనం తరలింపు... ఇలా అన్నింటా ప్రజాధానాన్ని దుర్వినియోగం చేసింది. అయితే జనం మాత్రం సీఎం చంద్రబాబు సభా వేదిక వద్దకు రాకుండానే వెనుదిరగడంతో సభా ప్రాంగణం సగానికిపైగా ఖాళీగా దర్శనమిచ్చింది. అయినప్పటికీ ఎయిర్‌ కూలర్స్‌ జనం లేకపోయినా తిరగడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top