పవన్‌.. తమాషాలు చేస్తున్నావా? | Botsa Satyanarayana Fires On Pawan Kalyan | Sakshi
Sakshi News home page

పవన్‌.. తమాషాలు చేస్తున్నావా?

Nov 14 2019 5:49 AM | Updated on Nov 14 2019 5:49 AM

Botsa Satyanarayana Fires On Pawan Kalyan - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురించి జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అహంకారంతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ‘ఏం తమాషాలు చేస్తున్నావా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సచివాలయంలో మంత్రి బొత్స విలేకరులతో మాట్లాడారు. జగన్‌ మట్టిలో కలిసి పోతారంటూ పవన్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ఊరుకున్న కొద్దీ పవన్‌ రోజు రోజుకి దారుణంగా మాట్లాడుతూ రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. తాట తీస్తా, తోలు తీస్తా వంటి అసభ్య పదజాలం దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు పవన్‌కు లేవన్నారు. పవన్‌ మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం నిజం కాదా అని నిలదీశారు.

ఈ అంశంలో సీఎం వ్యాఖ్యలను ఆయన తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. తమ ప్రభుత్వం బాగా పరిపాలిస్తుందని చంద్రబాబుకు, పవన్‌కు కడుపు మంట అని విమర్శించారు. ‘పవన్‌ పిల్లలు ఇంగ్లిష్‌ మీడియంలో చదవాలి.. సామాన్యుల పిల్లలు చదవకూడదా’ అని ప్రశ్నించారు. ఇంగ్లిష్‌పై పట్టులేకపోతే విద్యార్థులకు భవిష్యత్‌ ఎలా ఉంటుందన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మాతృభాష మనుగడను కాపాడుకోవడంతోపాటు ఇంగ్లిష్‌లో నైపుణ్యాలు ఉంటే మంచిదన్న ఉద్దేశంతో తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. మూడుసార్లు మంత్రిగా చేసినా ఇంగ్లిష్‌పై తనకు కూడా పట్టులేదని.. దీంతో మంత్రిగా ఉంటూ తాను కూడా పలు ఇబ్బందులు పడుతున్నానన్నారు. చంద్రబాబు కొంగ జపాలు ప్రజలకు తెలుసని బొత్స ఎద్దేవా చేశారు.

ఐదేళ్లూ ఇసుక మాఫియాను ప్రోత్సహించి ఇప్పుడు దొంగ దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. స్టార్టప్‌ ఏరియా వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలు సింగపూర్‌ సంస్థలు సరిగ్గా చెప్పలేకపోవడంతో పరస్పర అంగీకారంతోనే ఒప్పందం రద్దు చేసుకున్నామన్నారు. ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టు సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ కూడా స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. ఇది జరిగిన 15 రోజుల తర్వాత చంద్రబాబు, లోకేశ్‌ విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పనిగట్టుకొని రాష్ట్రం నుంచి పెట్టుబడులు వెళ్లిపోతున్నాయని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నాలుగు రోజులు ఆగితే రాష్ట్రానికి వివిధ దేశాల నుంచి ఎంత ఎక్కువగా పెట్టుబడులు వస్తాయో చూస్తారన్నారు. చంద్రబాబు హయాంలోనే బీఆర్‌ శెట్టి సంస్థ, మరో సంస్థ వెనక్కి వెళ్లిపోయాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement