‘నోట్ల రద్దు’ పై విమర్శలకు బీజేపీ కౌంటర్‌

BJP to observe anti-blackmoney day on November 8 - Sakshi

నవంబర్‌ 8ని ‘యాంటీ బ్లాక్‌మనీ డే’ గా జరపాలని జైట్లీ పిలుపు

ఇప్పటికే ఆ రోజును ‘బ్లాక్‌ డే’గా ప్రకటించిన విపక్షాలు

సాక్షి, న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దును పలికిమాలిన చర్యగా అభివర్ణిస్తూ, నోట్ల రద్దు నిర్ణయం వెలువడిన నవంబర్‌ 8ని ‘బ్లాక్‌ డే’గా ప్రకటించిన విపక్షాలకు.. అధికార బీజేపీ గట్టి కౌంటర్‌ ఇచ్చింది. నవంబర్‌ 8న ‘యాంటీ బ్లాక్‌మనీడే’గా జరపాలని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

నోట్ల రద్దుతో పేదలకు మంచి : పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో నల్లధనాన్ని, అవినీతిని అంతం చేశామని, తద్వారా దేశంలోని పేదలకు మేలు చేకూరిందని మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ నల్లధనాన్ని ఎందుకు వెలికితీయలేకపోయిందని ప్రశ్నించారు. తాము చేసిన మంచి పనులేవీ కాంగ్రెస్‌కు నచ్చవని ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా జరగనున్న ‘యాంటీ బ్లాక్‌మనీ డే’ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు పాల్గొనాలని జైట్లీ కోరారు.

అదొక చీకటి దినం : పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటన చేసిన నవంబర్‌ 8.. దేశానికి చీకటి దినమని విపక్షాల కూటమి అభిప్రాయపడింది. ఆ రోజును చీకటి దినం(బ్లాక్‌ డే)గా పరిగణిస్తున్నట్లు కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ, టీఎంసీ, ఎస్పీ సహా 18 విపక్ష పార్టీలు ఇదివరకే ప్రకటించాయి. రాజధాని ఢిల్లీతోపాటు అన్ని ప్రాంతాల్లో ఆందోళనలకు సమాయత్తం కావాలని రాజ్యసభలో కాంగ్రెస్‌ పక్ష నేత గులాం నబీ ఆజాద్‌ మంగళవారం పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

పోటాపోటీ : నవంబర్‌ 8న అధికార, విపక్షాలు పరస్పర వ్యతిరేక నినాదాలతో నిరసనలకు పిలుపునియ్యడంతో శాంతిభద్రతల అంశం చర్చనీయాంశమైంది. ఇరు పక్షాలూ ప్రజాస్వామిక స్ఫూర్తితో వ్యవహరిస్తే తప్ప, ఉద్రిక్తతలను నివారించలేని పరిస్థితి. దీనిపై ఢిల్లీ సహా ఆయా రాష్ట్రాల పోలీస్‌ ఉన్నతాధికారులు స్పందించాల్సిఉంది.

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top