బెంగళూరు సౌత్‌ అభ్యర్థిగా తేజస్వి సూర్యని ప్రకటించిన బీజేపీ

BJP Names Tejasvi Surya For Bangalore South - Sakshi

బెంగళూరు : బీజేపీకి కంచుకోటైన దక్షిణ బెంగళూరుకు లోక్ సభ అభ్యర్థిగా ఎవర్ని నిలబెడతారన్న దానిపై నిన్నటి వరకూ సస్పెన్స్ నెలకొన్న సంగతి తెలిసిందే. ఒకానొక దశలో ఆ స్థానంలో ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జోరుగా సాగింది. ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ బెంగళూరు సౌత్‌ టికెట్‌ను యువ నాయకుడు, న్యాయవాది తేజస్వి సూర్యకు కేటాయిస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని తేజస్వి సూర్య ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.(బెంగళూరు సౌత్‌ నుంచి మోదీ!)

‘ఓ మై గాడ్‌ నేను దీన్ని నమ్మలేకపోతున్నాను. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశ ప్రధాని, ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అధ్యక్షుడు ఓ 28 ఏళ్ల యువకుడిని నమ్మి పార్టీ ప్రతిష్టాత్మకంగా భావించే బెంగళూరు సౌత్‌ టికెట్‌ను కేటాయించారు. ఇలాంటి వింతలు కేవలం బీజేపీలోనే జరుగుతాయ’ని ట్వీట్‌ చేశారు. మరో దాంట్లో తనకు దక్కిన ఈ అవకాశాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు తేజస్వి సూర్య తెలిపారు. ఈ అవకాశం  కల్పించినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. చివరి శ్వాస వరకూ దేశం కోసం శ్రమిస్తానంటూ మరో ట్వీట్‌ చేశారు.

లాయరైన తేజస్వి సూర్య... రాష్ట్ర బీజేపీ యువ మోర్చాకు ఉపాధ్యక్షుడు. హిందువులకు అనుకూలంగా వ్యవహరిస్తారనే ప్రచారం ఉంది. చాలా సందర్భాల్లో మోదీని వ్యతిరేకించే వారిని ఆయన తీవ్ర స్థాయిలో ఖండిస్తారు. బీజేపీ మీడియా మేనేజ్‌మెంట్ సెల్‌లో కీలకంగా వ్యవహరించే సూర్య... యడ్యూరప్ప క్యాంప్‌తో కూడా సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు.

ఇదిలా ఉండగా బీజేపీకి కంచుకోటగా మారిన బెంగళూరు సౌత్‌ నుంచి 1996 నుంచి 2014 వరకూ బెంగళూరు సౌత్‌లో గెలుస్తున్నది అనంత కుమారే.  అయితే ఆయన మరణంతో బెంగళూరు సౌత్‌లో బలమైన అభ్యర్థి కోసం పార్టీ అన్వేషణ ప్రారంభించింది. ఒకానొక దశలో ఆయన భార్య తేజస్విని అనంత కుమార్‌ పేరునే రాష్ట్ర బీజేపీ.. ఢిల్లీ హైకమాండ్‌కి ప్రతిపాదించింది.  రాష్ట్ర బీజేపీ చీఫ్ యడ్యూరప్ప సైతం ఆమెకే మద్దతు పలికారు. కానీ బీజేపీ అర్థరాత్రి ప్రకటించిన జాబితాలో... అనూహ్యంగా.. యువకుడైన తేజస్వి సూర్య పేరుంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top