‘కేటీఆర్‌ ఇప్పుడెందుకు స్పందించడం లేదు’

BJP Leader Kolli Madhavi Fires On KTR Over Yadadri Issue - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘అన్నింటికీ స్పందించే మంత్రి కేటీఆర్‌, అన్నింటిని ప్రశ్నించాలనే ఎంపీ కవిత.. యాదాద్రి ఘటనపై ఎందుకు ప్రశ్నించడం లేదు.. కనీసం స్థానిక మహిళా ఎమ్మెల్యే కూడా ఈ విషయంపై స్పందించపోవడం శోచనీయం’ అంటూ  ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి కొల్లి మాధవి.

ఈ సందర్భంగా సోమవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత మూడ్రోజులుగా యాదాద్రిలో జరిగిన దారుణాలు ఒక్కోటిగా బయటకు వస్తున్న సంగతి తెలిసిందే. పసిపిల్లలను దారుణంగా హింసించడమే కాక, వారిని త్వరగా ఎదిగేలా చేయడం కోసం హార్మోన్‌ ఇంజెక్షన్‌లను కూడా వాడారనే భయంకర నిజాలు బయటకొస్తున్నాయి. కానీ ఈ దారుణాల గురించి అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కనీసం స్పందిచకపోవడం విచారకరమన్నారు.

ప్రతి విషయాన్ని ప్రశ్నించాలనే కవిత, అన్నింటికి ట్విటర్‌లో​ స్పందించే  కేటీఆర్‌లు ఇప్పుడెందుకు ప్రశ్నించడం లేదు, స్పందించడం లేదంటూ ప్రశ్నించారు. పోలీసు స్టేషన్‌ పక్కనే ఇన్ని ఘోరాలు జరుగుతుంటే అధికారులకు కనీస సమాచారం కూడా తెలియకపోవడం విచారకరమన్నారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి పోలీస్‌ శాఖను, ఇంటిలిజెన్స్‌ శాఖలను ఇతర పార్టీ నాయకులను కొనడం కోసం వినియోగిస్తున్నారని ఆరోపించారు.

శిశు సంక్షేమ శాఖ నిద్రపోతోందా..
ఇంత జరిగినా కనీసం స్థానిక మహిళా ఎమ్మెల్యే కూడా ఈ విషయం పై స్పందించకపోవడం దారుణమాన్నారు. అసలు రాష్ట్రంలో శిశు సంక్షేమశాఖ అనేది.. చిన్నారుల సంరక్షణ మీ బాధ్యతే కదా.. ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా అంటూ ప్రశ్నించారు.

హైకోర్టు న్యాయమూర్తి అధ్వర్యంలో కమిటీ
ఈ దారుణాలపై తక్షణమే హై కోర్టు న్యాయమూర్తి సమక్షంలో ఒక విచారణ కమిటీ వేసి అన్ని ఇళ్లలో తనిఖీలు నిర్వాహించాలని డిమాండ్‌ చేశారు. అంతేకాక గత నాలుగేళ్లుగా ఇంకా ఎందరు చిన్నారులు తప్పిపోయారనే విషయాలను కూడా విచారించాలని కోరారు. డ్రగ్స్‌ కేస్‌, నయీం కేస్‌, మియాపూర్‌ కేసుల్లాగా ఈ కేసును కూడా మూలకు పడేయోద్దంటూ అభ్యర్ధించారు.

బంగారు తెలంగాణ కాదు బార్ల తెలంగాణ
తాము అధికారంలోకి వచ్చాకే తెలంగాణ.. బంగారు తెలంగాణ అయిందంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ బార్ల తెలంగాణగా మారిందంటూ విమర్శించారు. ఇబ్బడి ముబ్బడిగా వైన్‌ షాపులకు లైసెన్స్‌లివ్వడం, మరో గంట అదనంగా వైన్‌ షాపులు తెరిచి ఉంచేందుకు అనుమతించడమంటే..  ప్రజలను మరింత తాగండంటూ ప్రోత్సాహించడమేనని ఆరోపించారు. మీ ఈ చర్యలతో యువతకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు. 

నిజామాబాద్‌లో రజాకార్ల రాజ్యం : అల్జాపూర్‌ శ్రీనివాస్‌, బీజేపీ అధికార ప్రతినిధి
‘నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే రైతులు ట్యాంకర్‌లతో బతికించుకుంటున్నారు. బాల్కొండ, కొరుట్ల, కాకాతీయ కెనాల్‌లో నీటి కోసం రైతులు సొంత రాష్ట్రంలోనే పోరాటం చేస్తున్నార’ని బీజేపీ అధికార ప్రతినిది శ్రీనివాస్‌ విమర్శించారు . దాదాపు 70 వేల ఎకరాల్లో రైతులు పంట నష్టపోయారని, సర్కార్‌ వారిని కనీసం పంటల బీమా పథకం కింద కూడా ఆదుకోవడం లేదని ఆరోపించారు. తమ సమస్యల గురించి పోరాటం చేస్తోన్న రైతులను, వారకి మద్దతు తెలుపుతున్న బీజేపీ నాయకులను కూడా అరెస్ట్‌ చేస్తున్నారని విమర్శించారు. చూడబోతే నిజామాబాద్‌లో మళ్లీ రజకార్లు రాజ్యమేలుతున్నట్లుందని ఆరోపించారు. వెంటనే రైతులకు క్షమాపణలు తెలపాలని డిమాండ్‌ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top