గవర్నర్‌ ఆ పేర్లన్నీ బయటపెట్టాలి!

BJP Demands Bihar Governor to Reveal Bofors Scandal Names - Sakshi

బోఫోర్స్‌ స్కామ్‌.. బిహార్‌ గవర్నర్‌ వ్యాఖ్యల కలకలం

పట్నా: బోఫోర్స్‌ స్కామ్‌పై బిహార్‌ గవర్నర్‌ సత్య పాల్‌ మాలిక్‌ చేసిన కామెంట్లు ‍సంచలనం సృష్టిస్తున్నాయి. మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ నిజాయితీపరుడని, ఆయన చుట్టూ ఉన్న కొందరు కాంగ్రెస్‌ నేతలే బోఫోర్స్‌ స్కామ్‌కు కారకులంటూ సత్య పాల్‌ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపగా, ఆ పేర్లను గవర్నర్‌ బయటపెట్టాలంటూ బీజేపీ డిమాండ్‌ చేస్తోంది. 

మే 18న పట్నాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్‌ మాలిక్‌.. రాజీవ్‌ గాంధీపై ప్రశంసలు గుప్పించారు. ప్రసంగంలో మధ్యలో బోఫోర్స్‌ ప్రస్తావన తీసుకొచ్చిన ఆయన రాజీవ్‌కు ఈ స్కామ్‌తో సంబంధం లేదని, ఆయన చాలా మంచి వ్యక్తని,  చుట్టూ ఉన్న కొందరు తప్పుడు మనుషుల మూలంగానే ఆయన కళంకం ఎదుర్కోవాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఆ కాంగ్రెస్‌ నేతలు ఎవరో తనకు తెలుసున్న గవర్నర్‌ మాలిక్‌.. పేర్లు వెల్లడించేందుకు మాత్రం​ విముఖత వ్యక్తం చేశారు. దీనిపై బీజేపీ నేత, బోఫోర్స్‌ స్కామ్‌ కేసులో వాదనలు వినిపిస్తున్న న్యాయవాది అజయ్‌ అగర్వాల్‌  స్పందించారు. 

‘ఈ కేసును తిరిగి దర్యాప్తు చేపట్టేందుకు సీబీఐ ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలో గవర్నర్‌ మాలిక్‌, ఆయన దగ్గర ఉన్న సమాచారాన్ని సీబీఐకి ఇస్తే ఎంతో మేలు చేసినట్లు అవుతుంది. దేశాన్ని కుదిపేసిన ఈ స్కామ్‌లో కాంగ్రెస్‌ కీలక నేతల హస్తం ఉందన్న అనుమానాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. మాలిక్‌ వ్యాఖ్యలతో అవి బలపడ్డాయి. ఆయన సహకరిస్తారని ఆశిస్తున్నాం’ అని అజయ్‌ తెలిపారు. కాగా, అజయ్‌ 2014 సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీపై పోటీ చేసి ఓడిపోయారు. ఇక బీజేపీ నేత అయిన సత్య పాల్‌ మాలిక్‌ను గతేడాది ఎన్డీయే ప్రభుత్వం బిహార్‌ గవర్నర్‌గా నియమించింది.

బోఫోర్స్‌ నేపథ్యం... భారత ప్రభుత్వం స్వీడన్‌ ఆయుధ తయారీ సంస్థ ఏబీ బోఫోర్స్‌ మధ్య నాలుగు వందల 155ఎంఎం హోవిట్జర్‌లను కొనుగోలు చేసేందుకు 1986 మార్చి 24న రూ.1,437 కోట్ల ఒప్పందం కుదిరింది. 1987 ఏప్రిల్‌ 16న స్వీడన్‌ రేడియో.. ఆయుధాల కొనుగోలుకు సంబంధించి భారతీయ ప్రముఖ రాజకీయ నాయకులకు, రక్షణశాఖ అధికారులకు బోఫోర్స్‌ ముడుపులు చెల్లించిందని వెల్లడించింది. దీంతో 1990 జనవరి 22న సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఏబీ బోఫోర్స్‌ అధ్యక్షుడు మార్టిన్‌ అర్డ్‌బో, మధ్యవర్తులుగా ఉన్న విన్‌ చద్దా, హిందూజా సోదరులపై నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీతోపాటుగా అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసింది.

దీంతోపాటుగా 1982 నుంచి 1987 మధ్య పలువురు భారతీయ అధికారులు, ప్రైవేటు వ్యక్తులు అవినీతి, మోసానికి పాల్పడటం ద్వారా నేరపూరిత కుట్రలో భాగస్వాములయ్యారని పేర్కొంది. 1999 అక్టోబర్‌ 22న దాఖలు చేసిన తొలి చార్జిషీటులో చద్దా, ఒట్టావియో ఖత్రోచి, అప్పటి రక్షణ కార్యదర్శి ఎస్‌కే భట్నాగర్, బోఫోర్స్‌ కంపెనీ, అర్డ్‌బోల పేర్లను పేర్కొంది. 2000, అక్టోబర్‌ 9 దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీటులో హిందూజా సోదరుల పేర్లనూ పేర్కొంది. మార్చి4, 2011న సీబీఐ ప్రత్యేక కోర్టు ఖత్రోచీకి కేసునుంచి విముక్తి కల్పించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఖత్రోచి, భట్నాగర్, చద్దా, ఆర్డ్‌బో ఇప్పటికే మరణించారు. 2005లో హైకోర్టు తీర్పుకంటే ముందు 2004 ఫిబ్రవరిలో ఢిల్లీ హైకోర్టు మరో జడ్జి.. దివంగత ప్రధాని రాజీవ్‌ గాంధీపై నమోదైన అభియోగాలను తోసిపుచ్చారు.

సీఐఏ పత్రాల్లో...నాటి ప్రధాన మంత్రి రాజీవ్‌ గాంధీకి తలవంపులు వస్తాయనే ఉద్దేశంతోనే అప్పట్లో బోఫోర్స్‌ ఆయుధాల కుంభకోణంపై స్వీడన్‌ దర్యాప్తు ఆపేసిందని అమెరికా దర్యాప్తు ఏజెన్సీ సీఐఏ పత్రాలు వెల్లడించాయి. విచారణ మరింత కొనసాగితే బోఫోర్స్‌ ఆయుధాల ఒప్పందంలో భారత అధికారులకు ముడుపులు ముట్టినట్లు వెల్లడవుతుందని స్వీడన్‌ భావించినట్లు ఆ పత్రాల్లో పేర్కొంది. 1988లో అప్పటి ప్రధాని రాజీవ్‌ స్వీడన్‌ రాజధాని స్టాక్‌హోమ్‌ పర్యటన అనంతరం బోఫోర్స్‌పై ప్రత్యేక పోలీసు దర్యాప్తు ఆగిపోయిందని అదే ఏడాది మార్చి 4న వెలువరించిన సీఐఏ నివేదిక చెబుతోంది. బోఫోర్స్‌ స్కాం ఆరోపణల ఫలితంగానే రాజీవ్‌ గాంధీ 1989లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top