ఎవరికి జిందాబాద్‌?

BJP, Congress and MIM in Aurangabad constituency - Sakshi

ఔరంగాబాద్‌

ఔరంగాబాద్‌ బరిలో బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం

ఐదోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఖైరే

ఔరంగజేబు పేరుతో ఏర్పడిన ఔరంగాబాద్‌ చారిత్రక నగరంలో విజయావకాశాన్ని చేజిక్కించుకునేందుకు చాలా ఏళ్లుగా ఇక్కడ వేళ్లూనుకున్న శివసేనతో కాంగ్రెస్‌ తలపడబోతోంది. పురాతన కట్టడాలైన అజంతా ఎల్లోరా గుహలు ఈ నగరం చుట్టుపక్కల వ్యాపించి ఉంటాయి. దేశ విదేశాల నుంచి సందర్శించడానికి వచ్చే టూరిస్టులతో ఈ ప్రాంతం ఎల్లప్పుడూ కళకళలాడుతుంటుంది. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క సందర్భంలో తప్ప దాదాపు అన్నిసార్లూ ఈ ప్రాంత ప్రజలు శివసేనకే పట్టం కట్టడం గమనార్హం.  

ఔరంగబాద్‌ లోక్‌సభ స్థానాన్ని 30 ఏళ్లుగా.. 1989 నుంచి శివసేన పార్టీ నిలబెట్టుకుంటూ వస్తోంది. 1998లో మాత్రం ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపొందారు. ప్రస్తుతం ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది శివసేన సిట్టింగ్‌ ఎంపీ చంద్రకాంత్‌ బావూరావ్‌ ఖైరే. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి పాటిల్‌ నితిన్‌ సురేష్‌పై లక్షా 62 వేల మెజారిటీతో చంద్రకాంత్‌ బావూరావ్‌ ఖైరే విజయం సాధించారు. ఈసారి సైతం శివసేన నుంచి ఆయనే బరిలో నిలిచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

ఐదోసారీ బరిలో..
శివసేనకు బలమైన పునాదులున్న ఈ నియోజకవర్గంలో ఈసారి కూడా చంద్రకాంత్‌ బావూరావ్‌ ఖైరే గెలుపుని కైవసం చేసుకుంటే వరుసగా ఐదుసార్లు ఆయన విజయపరంపర కొనసాగినట్లవుతుంది. 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా నాలుగుసార్లు విజయఢంకా మోగించిన చంద్రకాంత్‌కు ఈసారి ప్రజలు పట్టం కడతారా అనేది వేచి చూడాల్సి ఉంది. చంద్రకాంత్‌ పశ్చిమ ఔరంగాబాద్‌ నుంచి 1990 లోనూ, 1995లోనూ రెండుసార్లు శాసనసభకు కూడా ఎన్నికయ్యారు. శివసేన ప్రభుత్వంలో మహారాష్ట్రలో 1995 నుంచి 1999 వరకు క్యాబినెట్‌ మంత్రిగా కూడా పనిచేశారు.

కాంగ్రెస్‌ అభ్యర్థిగా సుభాష్‌ జాంబాద్‌
ఈసారి కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఈ పార్లమెంటు స్థానానికి సుభాష్‌ జాంబాద్‌.. శివసేన అభ్యర్థి చంద్రకాంత్‌తో తలపడబోతున్నారు. గత ఎన్నికల్లో చంద్రకాంత్‌ ఖైరేకు 5,20,902 ఓట్లు వచ్చాయి. ఈయన ప్రత్యర్థి నితిన్‌ సురేష్‌ పాటిల్‌కి 3,58,902 వచ్చాయి. మూడో స్థానంలో ఉన్న బీఎస్పీ అభ్యర్థి 37,419 ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈసారి ఈ స్థానం నుంచి కాంగెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న సుభాష్‌ మానిక్‌ చంద్‌ జాంబాద్‌కు మహారాష్ట్ర శాసనమండలి సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉంది. స్థానికంగా పలు సేవాకార్యక్రమాల్లో తరచూ పాల్గొంటూ ప్రజల నోళ్లలో నానుతోన్న సుభాష్‌ జాంబాద్‌ ఈసారి శివసేనకు గట్టిపోటీ ఇచ్చే బలమైన అభ్యర్థిగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఎంఐఎం నుంచి పాత్రికేయుడు
ఈసారి 23 ఏళ్ల పాత్రికేయ అనుభవం ఉన్న జర్నలిస్టు ఇంతియాజ్‌ జలీల్‌ ఔరంగాబాద్‌ పార్లమెంటు స్థానం నుంచి ఏఐఎంఐఎం తరఫున పోటీ చేస్తున్నారు. ఎన్డీ టీవీలో 12 ఏళ్లు, లోక్‌మత్‌లో 11 ఏళ్ల అనుభవం ఉన్న ఇంతియాజ్‌ జలీల్‌ 2014లోనే తొలిసారిగా రాజకీయ రంగప్రవేశం చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లోనే ఔరంగాబాద్‌ సెంట్రల్‌ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. నిజానికి మహారాష్ట్రలోని ప్రకాశ్‌ అంబేడ్కర్‌ సారథ్యంలోని వంచిత్‌ బహుజన్‌ అఘాదీ పార్టీతో పొత్తుపెట్టుకొని ఔరంగాబాద్‌ లోక్‌సభ స్థానంలో పోటీ చేయాలని ఎంఐఎం తొలుత భావించింది. అయితే ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ ఔరంగాబాద్‌ అభ్యర్థిగా ఇంతియాజ్‌ జలీల్‌ను ఎంపిక చేశారు. దళితుల్లోనూ, ముస్లిం మైనారిటీల్లోనూ మంచి వ్యక్తిగా ఔరంగాబాద్‌లో ఇంతియాజ్‌కు గుర్తింపు ఉంది.

తస్లీమాను అడ్డుకుని..
ప్రపంచ ప్రఖ్యాత అజంతా ఎల్లోరా గుహలను సందర్శించేందుకు 2017లో మహారాష్ట్ర వచ్చిన ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్‌ను ఎయిర్‌ పోర్టులోనే అడ్డుకోవడంలో ఎంఐఎం నాయకుడు ఇంతియాజ్‌ జలీల్‌ది కీలక పాత్ర. ఎయిర్‌పోర్టు బయట తస్లీమా నస్రీన్‌కి వ్యతిరేకంగా ఎంఐఎం నిరసనకు దిగడంతో పోలీసులే ఆమెను మహారాష్ట్ర నుంచి తిప్పి పంపించి వేశారు. మొత్తంగా ఓ పక్క హిందుత్వ శివసేన, మరోవైపు ఇస్లాం నేపథ్య ఎంఐఎం, ఇంకోపక్క పోటాపోటీగా దూసుకొస్తోన్న కాంగ్రెస్‌ మధ్య ఈసారి ఔరంగాబాద్‌ లోక్‌సభ స్థానంలో పోటీ రసవత్తరంగా మారే అవకాశం ఉంది.


ఇంతియాజ్‌, చంద్రకాంత్‌, సుభాష్‌ జాంబాద్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top