
కన్నా లక్ష్మీనారాయణ
ఢిల్లీ: తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తెలిపినట్లు బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఢిల్లీలో కన్నా లక్ష్మీ నారాయణ ప్రధాని మోదీతో మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీకి సంబంధించిన 12 అంశాలను త్వరగా నెరవేర్చాలని వినతిపత్రం సమర్పించారు. విశాఖ రైల్వే జోన్, కడప స్టీల్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, రామాయపట్నం పోర్టు, గ్రీన్‌ఫీల్డ్ ఆయిల్ రిఫైనరీ, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో మెట్రో రైలు, విద్యాసంస్థలకు నిధులు, వెనకబడిన జిల్లాలకు రూ.150 కోట్ల చొప్పున కేటాయించాలని అందులో పేర్కొన్నారు.
ఏడు జిల్లాలకు జీఎస్టీ పన్ను మినహాయింపు ఇవ్వాలని, రాయలసీమలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. గిరిజనులు-మత్స్యకారుల అభివృద్ధికి నిధులు, స్టార్టప్‌లకు పన్ను ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరారు. ప్రధాని మోదీతో భేటీ ముగిసిన తర్వాత కన్నా లక్ష్మీనారాయణ విలేకరులతో మాట్లాడారు. 2019 ఎన్నికలలో ఏపీలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తానని మోదీకి తెలిపినట్లు చెప్పారు. రేపు ఉదయం 11 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో ఏపీ బీజేపీ నేతల సమావేశం ఉంటుందని తెలిపారు.
‘చంద్రబాబు మోసం చేసినా రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మోదీ, ఏపీ ప్రజలకు చెప్పాలని సూచించారు. విభజన చట్టంలో ఉన్న 85 శాతం అంశాలు పూర్తి చేశాం. ఏపీ ప్రజల వెంట తాను ఉంటానని మోదీ తెలిపారు. చంద్రబాబు రాష్ట్రానికి చేస్తున్న మోసాన్ని ప్రజలకు వివరించాలని చెప్పారు. జూన్ 20 నుంచి ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం చేపడుతున్నాం. కరపత్రాల ద్వారా రాష్ట్రానికి కేంద్రం చేసిన సహాయాన్ని ప్రజలకు వివరిస్తాం. ఏపీకి వివిధ పథకాలకు నిధులు, గ్రాంటులు ఏవిధంగా కేంద్రం ఇచ్చిందో ప్రజలకు తెలుపుతాం. పోలవరంపై ఖర్చు పెట్టిన ప్రతి పైసా కేంద్రం ఇచ్చిందే. గాలేరు-నగరి, హంద్రినీవా పూర్తి చేస్తే చంద్రబాబును అభినందిస్తామని’ ఈ సందర్భంగా కన్నా పేర్కొన్నారు.