అధికారంలోకి వస్తే బీసీ సబ్‌ప్లాన్‌ అమలు

BC Subplan executed when it comes to power says Ponnam - Sakshi

     టీపీసీసీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ వెల్లడి

     అసెంబ్లీలో బీసీల ప్రాతినిధ్యం పెంచేందుకు కృషి

హైదరాబాద్‌: బీసీల రాజకీయ చైతన్యాన్ని ఈ ఎన్ని కల్లో నిరూపించాల్సిన అవసరం ఉందనీ, తాము అధికారంలోకి వస్తే బీసీ సబ్‌ప్లాన్‌ అమలు చేస్తామని టీపీసీసీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ అన్నారు. లక్డీకాపూల్‌లోని ఓ హోటల్‌లో ఆదివారం ‘బీసీల సమగ్ర ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధి బీసీ డిక్లరేషన్‌’ పుస్తక ఆవిష్కరణ సభ జరిగింది. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ అధ్యక్షతన జరిగిన సభలో పొన్నం ప్రభాకర్‌ ప్రసంగించారు. జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ చేపట్టిన బీసీ బస్సు యాత్రతో అన్ని రాజకీయ పార్టీలు బీసీల వైపు చూస్తున్నాయన్నారు. ఇదే ఒరవడి కొనసాగించి అసెంబ్లీలో బీసీల ప్రాతినిధ్యం పెంచే దిశగా కృషి చేయాలని కోరారు. చట్టసభల్లో బీసీలు అడుగు పెట్టాలంటే అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో రెండేసి ఎమ్మెల్యే సీట్లను కేటాయించాలని సూచించారు.

ఆ స్థానాల్లో అన్ని పార్టీలు బీసీ అభ్యర్థులను నిలబెడితే ధన ప్రవాహం పనిచేయకుండా బరిలో దిగిన అభ్యర్థి గెలిచినా, ఓడినా బీసీలే ఉంటారన్నారు. అప్పుడు కనీసం 34 మంది బీసీ ఎమ్మెల్యేలను అసెంబ్లీలో చూడవచ్చని అన్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ పార్టీ దొంగచాటున అసెంబ్లీ టికెట్లను ప్రకటించినందున బీసీలు ఆశించిన స్థానాలు దక్కకపోయినా కాంగ్రెస్‌ లో మాత్రం వారికి ఎక్కువ స్థానాలు లభించేలా కృషి చేస్తానని అన్నారు. బీసీల పక్షాన అండగా నిలబడేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తనకు ఈ పదవిని కట్టబెట్టారని, ఈ బాధ్యతను శిరసావహిస్తానని చెప్పారు. బీసీ సంఘం కూర్చిన మేనిఫెస్టో మహాకూటమి తరహాలో ఉండేలా చూస్తామన్నారు. అధికారంలోకి వస్తే బీసీ జనాభాకు దామాషా ప్రకారం నిధులు ఒక హక్కుగా దక్కడానికి బీసీ సబ్‌ప్లాన్‌ చట్టాన్ని తీసుకువస్తానని హామీ ఇచ్చారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ మాట్లాడుతూ... బీసీలకు అవకాశం వస్తే ఎవరికీ తీసిపోరని, అందుకు తానే ఒక ఉదాహరణ అని చెప్పారు.

నాడు ఎన్టీఆర్‌ అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా మచ్చలేకుండా 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ అవినీతి, అక్రమాలకు పాల్పడకుండా ఈ స్థాయికి చేరుకున్నట్లు వివరించారు.మహా కూటమిలో బీసీలకు రాజకీయంగా సముచిత స్థానం దక్కేలా తన వంతు పాత్ర పోషిస్తానని చెప్పారు.బీసీ మేనిఫెస్టోలో పొందుపరిచిన డిమాండ్లను తాము అంగీకరిస్తున్నామని ఈ ఎజెండా అమలుకు పాటుపడతామని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. బీసీల కోసం ప్రత్యేక మేనిఫెస్టోను రూపొందించాలని డిమాండ్‌ చేశారు. దీన్ని అమలు చేసిన పార్టీలే అధికారంలోకి వస్తాయని, మోసపూరిత మాటలతో కాలం వెళ్లదీస్తే బీసీలు నమ్మడానికి సిద్ధంగా లేరని అన్నారు.

ఇప్పటికైనా టీఆర్‌ఎస్‌ మిగతా 14 సీట్లు బీసీలకు ఇవ్వాలని, మహా కూటమి, బీజేపీ పార్టీలు సగం సీట్లు బీసీలకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జస్టిస్‌ ఈశ్వరయ్య మాట్లాడుతూ ఏ సామాజిక వర్గానికీ లేని క్రీమీలేయర్‌ బీసీలపైన విధించడం దారుణం అని అన్నారు. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు తాము అధికారంలోకి వస్తే దీన్ని ఎత్తివేస్తామని హామీ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నల్లా సూర్య ప్రకాశ్‌ (బీఎల్‌ఎఫ్‌), చెరుకు సుధాకర్‌(తెలంగాణ ఇంటిపార్టీ), కాసం వెంకటేశ్వర్లు (బీజేపీ), బోమ్మవోని ప్రభాకర్‌(సీపీఐ)లతో పాటుగా మేధావులు, విద్యావేత్తలు, కుల సంఘాల నేతలు హాజరై ప్రసంగించారు.

కేసీఆర్‌కు బీసీల సమస్యలు పట్టవు: మధుయాష్కీ
మాజీ ఎంపీ, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ గౌడ్‌ మాట్లాడుతూ... ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసిన బడుగులకు అసలు సిసలైన తెలంగాణ రాలేదని, నేడు సగం తెలంగాణ మాత్రమే వచ్చిందని అన్నారు. సంపూర్ణ తెలంగాణ రావాలంటే సామాజిక తెలంగాణ రావాలని ఉద్ఘాటించారు. ఫాం హౌస్‌కు పరిమితమైన కేసీఆర్‌కు బీసీల సమస్యలు పట్టవని అన్నారు. గొర్రెలు, బర్రెలతో మోసగించి బీసీలకు కేవలం 20 టికెట్లు ఇచ్చి ఫాం హౌస్‌కు పారిపోయారని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ అయినా, కాంగ్రెసైనా బీసీలకు అన్యాయం చేసినప్పుడు ఒక బీసీ బిడ్డగా ఎదిరిస్తానని అన్నారు.బీసీలకు ఈ ఎన్నికల్లో సీట్ల కేటాయింపుల్లో ప్రాధాన్యమివ్వాలని స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ భక్తచరణ్‌ దాస్‌కు ఆదేశాలు ఇచ్చారని, బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చే విధంగా రాహుల్‌గాంధీని ఒప్పిస్తానని హామీ ఇచ్చారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top