మీవి విద్వేష రాజకీయాలు 

Balka Suman Comments On Laxman - Sakshi

బీజేపీపై ఎమ్మెల్యే బాల్క సుమన్‌ 

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీతోనే బంగారు తెలంగాణ సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ చేసిన వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ పేర్కొన్నారు. విద్వేష రాజకీయాలు రెచ్చగొట్టి, రక్తపుటేరులు పారించే లక్ష్యం బీజేపీది అని ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం ఆయన బీజేపీకి బహిరంగ లేఖ రాశారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలకు రూ.24 వేల కోట్ల నిధులివ్వాలని నీతి ఆయోగ్‌ సిఫార్సు చేసినా చిల్లిగవ్వ ఇవ్వని మీ పార్టీతో బంగారు తెలంగాణ సాధ్యమా అని నిలదీశారు. ‘కాళేశ్వరానికి నిధులివ్వాలని, జాతీయ హోదా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నెత్తీనోరూ కొట్టుకున్నా రూపాయి కూడా విదల్చని మీరు బంగారు తెలంగాణ చేస్తారంటే ప్రజలు నమ్ముతారనుకుంటున్నారా? యూపీఏ–2 ప్రభు త్వం ఇచ్చిన ఐటీఐఆర్‌ ప్రాజెక్టును మూలన పడేసింది మీ ప్రభుత్వం కాదా? రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులను కేంద్ర సర్కారు బుట్టదాఖలు చేసిందనే విషయం రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి తెలియదా? విభజన హామీలను గత ఐదేళ్లలో ఏనాడూ కేంద్రం పరిశీలించలేదు. వీటిపై రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఎప్పుడైనా కేంద్రాన్ని అడిగిందా? అలాంటి మీరు బంగారు తెలంగాణ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది’ అని సుమన్‌ పేర్కొన్నారు. 

విభజన చట్టంలోని హామీలేవి? 
తెలంగాణ అభివృద్ధి విషయంలో కేంద్రం అడుగడుగునా వివక్ష చూపించిందని బాల్క సుమన్‌ అన్నారు. విభజన చట్టంలోని ట్రైబల్, హార్టీకల్చర్‌ యూనివర్సిటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ‘ఖమ్మం జిల్లా బయ్యారంలో నిర్మించతలపెట్టిన ఉక్కు పరిశ్రమ ఏమైంది? ఖాజీపేటలో పెడతామ న్న కోచ్‌ ఫ్యాక్టరీ ఏమైంది? వెనకబడిన జిల్లాల అభివృద్ధికి ఇస్తామన్న గ్రాంట్లు ఏమయ్యాయి? తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పడి మూడేళ్లు గడుస్తున్నా ప్రతి జిల్లాకు ఇవ్వాల్సిన కేంద్రీయ విద్యాలయం, నవోదయ విద్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రాలు ఎక్కడ’ అని నిలదీశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణ అభివృద్ధికి సహకరించకపోగా అడుగడుగునా తెలంగాణపై విషం చిమ్ముతూ అబద్దాలు చెబుతూ వచ్చారని మండిపడ్డారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top