కూల్చివేత... చీల్చింది కూడా!  | Ayodhya Verdict: BJP got profitable Politically | Sakshi
Sakshi News home page

కూల్చివేత... చీల్చింది కూడా! 

Nov 10 2019 2:34 AM | Updated on Nov 10 2019 11:08 AM

Ayodhya Verdict: BJP got profitable Politically  - Sakshi

6 డిసెంబర్‌ 1992... భారత సామాజిక, రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసిందనే చెప్పాలి. ఎందుకంటే నాటి నుంచి బాబ్రీ కూల్చివేతకు ప్రతీకారమంటూ పలు ఉగ్రవాద దాడులు జరిగాయి. ఏటా డిసెంబర్‌ 6 వస్తోందంటేనే... ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేయాల్సిన పరిస్థితి. సామాజికంగా చీలిక తెచ్చిన ఈ ఘటన... రాజకీయంగానూ కొత్త శక్తులు ఊపందుకోవటానికి తావిచ్చిందని చెప్పాలి. కాకపోతే అప్పట్లో పీవీ నరసింహారావు ప్రధానిగా ఆరంభించిన ఆర్థిక సంస్కరణలు ఆ తరువాత ఊపందుకోవటంతో అభివృద్ధి కారణంగా పరిస్థితులు చాలావరకూ మారాయని చెప్పొచ్చు.  

రాజకీయంగా లాభపడ్డ బీజేపీ... 
డిసెంబర్‌ 6 ఘటన వెనుక పలు అంశాలున్నాయన్నది విశ్లేషకుల వాదన. అందులో మొదటిది... మండల్‌ కమిషన్‌ ప్రభావానికి దీటైన రాజకీయ నినాదం వెతకడం. రెండవది... పలు దండయాత్రలు, వలస పాలనల నేపథ్యంలో ఓటమి భారంతో, కులాల కుంపట్లతో చీలికలు పేలికలు అయిన హిందూ సమాజాన్ని తిరిగి ఒక తాటిపైకి తేవటం. దళిత బహుజనుల్లో హిందూ వాద పునరుత్తేజం చేసి, తద్వారా సామాజిక, కుల ఉద్రిక్తతలను తగ్గించడంతో పాటు మత ప్రాతిపదికన హిందూ ఓట్లను ఏకీకృతం చేసుకుని... అంతిమంగా అధికారాన్ని చేజిక్కించుకోవడం. ఇప్పటివరకూ జరిగిన పరిణామాలు చూస్తే... మిగిలిన అంశాలు ఎలాఉన్నా... నిర్దేశిత రాజకీయ లక్ష్యాల సాధనలో విజయం లభించిందనే చెప్పవచ్చు. 1984లో కేవలం 2 సీట్లున్న బీజేపీ 2014 నాటికి 282 సీట్లతో లోక్‌సభలో సంపూర్ణ మెజారిటీని సాధించింది. 2019 నాటికి మరింత బలపడి ఏకంగా 303 సీట్లు సాధించింది.

మారుతున్న ‘తరం’ ప్రభావం... 
మత పరంగా చూసినా... 1992 బాబ్రీ ఘటన తర్వాత... దేశంలో మతం పేరుతో ఒకవైపు హింస కొనసాగుతూనే వస్తోంది. పేలుళ్లు... మత ఘర్షణలు ఇలా అనేక ప్రతికూల ఘటనలు సంభవిస్తూనే వచ్చాయి. సామాజిక భద్రత అనేది రెండు మతాల నుంచి రెండు దేశాల స్థాయికి చేరటంతో కుల, మత ప్రాంతాలతో సంబంధం లేకుండా జాతీయ ఐక్యత, అభివృద్ధిపైనే అన్ని వర్గాలూ దృష్టి సారించాయి. శాంతి సామరస్యాలకే పెద్దపీట వేస్తూ వచ్చాయి. అదే సమయంలో మారిన ‘తరం’ అంశాన్ని కూడా ఇక్క డ ప్రస్తావించుకోవాలి. ‘కొత్త తరానికి’ మత కుంపటి కాకుండా అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా కనబడింది.

లిబర్‌హాన్‌ కమిషన్‌..
స్వతంత్ర భారత చరిత్రలో సుదీర్ఘకాలం కొనసాగిన కమిషన్‌ అది. బాగా కాస్ట్‌లీ కమిషన్‌ కూడా. ఎందుకంటే విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వటానికి రూ.8 కోట్లు ఖర్చయింది. ఇందులో అత్యధికం కమిషన్‌ సిబ్బంది జీతభత్యాలకే సరిపోయింది. అంతేకాదు!! విచారణ పూర్తి చేయడానికి కమిషన్‌కు ఏకంగా 399 సిట్టింగ్‌లు అవసరమయ్యాయి. ఈ పాటికే అందరికీ అర్థమయ్యే ఉంటుంది అది జస్టిస్‌ లిబర్‌హాన్‌ కమిషన్‌ అని. 1992 డిసెంబర్‌ 6న జరిగిన బాబ్రీమసీదు కూల్చివేత ఘటనపై విచారణకు అప్పటి కేంద్ర ప్రభుత్వం లిబర్‌హాన్‌ కమిషన్‌ను అదేనెల 16న ఏర్పాటు చేసింది. హర్యానా హైకోర్టులో సిట్టింగ్‌ జడ్జిగా పనిచేస్తున్న జస్టిస్‌ ఎంఎస్‌ లిబర్‌హాన్‌ సారథ్యంలో ఏర్పాటయిన ఈ కమిషన్‌ను... మసీదు కూల్చివేతకు దారితీసిన ఘటనలపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించింది. మూడు నెలల్లో లేదా వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని నిర్దేశించింది. కానీ ఆ తర్వాత 48 సార్లు గడువును పొడిగిస్తూ పోయారు. కమిషన్‌కు తుది నివేదిక ఇవ్వటానికి ఏకంగా 16 ఏళ్ల ఆరు నెలలు పట్టింది. చివరకు 2009 జూన్‌ 30న కమిషన్‌ తన 998 పేజీల నివేదికను కేంద్రానికి సమర్పించింది. విచారణలో భాగంగా కమిషన్‌ పలువురు అగ్రశ్రేణి రాజకీయ ప్రముఖులను విచారించింది.

కమిషన్‌ ఏం చెప్పిందంటే...
ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీతోపాటు బీజేపీకి, హిందూసంస్థలకు చెందిన దాదాపు 68 మందిని ఈ నివేదిక అభిశంసించింది. అప్పటి యూపీ ముఖ్యమంత్రి కళ్యాణ్‌ సింగ్‌ నేతృత్వంలోని ప్రభుత్వమే ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహించాలని దుయ్యబట్టింది. ఇలా మత ఆధారిత రాజకీయాలు జరిపే ప్రభుత్వాలను బర్తరఫ్‌ చేయాలని కూడా కమిషన్‌ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వాజ్‌పేయి, అద్వానీ లాంటి వాళ్లను మిధ్యా ఉదారవాదులుగా అభివర్ణించింది. వీరంతా మూకుమ్ముడిగా బాబ్రీ కూల్చివేతకు ప్రత్యక్ష, పరోక్ష బాధ్యులని స్పష్టంచేసింది. వీరిపై తగిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. బాబ్రీ ఘటనలో అప్పటి కేంద్ర ప్రభుత్వానిది ఏమాత్రం దోషం లేదని కూడా కమిషన్‌ తెలిపింది.

కరకు వ్యాఖ్యలు.. కరువైన చర్యలు
ప్రభుత్వం ఏం చేసింది?
కమిషన్‌ నివేదికపై 2009 నవంబర్‌ 8– 11 మధ్య కాలంలో ఉభయసభల్లో చర్చ ఆరంభమైంది. కానీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తరువాత నివేదికను అప్పటి ప్రభుత్వం సీబీఐకి అందించింది. అప్పటికే దీనిపై విచారణ జరుపుతున్న సీబీఐకి కొత్తగా ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో... పరిశీలించమంది. కానీ కమిషన్‌ నివేదికపై సీబీఐ పెద్దగా స్పందించలేదు. నివేదిక ఆధారంగా కొత్త కేసులేవీ నమోదు చేయడం లేదని సీబీఐ తేల్చిచెప్పింది. తర్వాత కోర్టులు కూడా ఈ నివేదికను పెద్దగా పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపించలేదు. 

విమర్శల వెల్లువ
నివేదిక పార్లమెంట్‌ ముందు ఉంచకముందే మీడియాకు లీకయిందని 2009 నవంబర్లో వార్తలొచ్చాయి. దీనికి తోడు బాబ్రీ ఘటనకు కేవలం హిందూ సంస్థలు, బీజేపీ నాయకులదే తప్పని, కాంగ్రెస్‌ ప్రభుత్వం తప్పు ఏమీ లేదని కమిషన్‌ పేర్కొనడంతో  తీవ్ర విమర్శలొచ్చాయి. నివేదిక పూర్తి పక్షపాతంతో రూపొందించారని, కమిషన్‌కు సహకరించిన హర్‌ప్రీత్‌ సింగ్‌ జియాని ఈ నివేదిక రూపకల్పనకు ముఖ్య బాధ్యుడని బీజేపీ విమర్శించింది. కమిషన్‌ అభిప్రాయాలన్నీ ఊహాగానాలని దుయ్యబట్టింది. నివేదికలో మహాత్మా గాంధీ పుట్టినతేదీని తప్పుగా పేర్కొనటం, సాక్ష్యులుగా కొందరు చరిత్రకారుల పేర్లను పేర్కొనడం.., కమిషన్‌ నిర్లక్ష్య, అసంబద్ధ ధోరణికి నిదర్శనమని విమర్శించింది. కావాలని అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా నివేదికలో కొన్ని అంశాలను లీక్‌ చేసిందని బీజేపీ ఆరోపించింది. చివరకు చూస్తే... కమిషన్‌ నివేదిక రాజకీయ విమర్శలకు తప్ప ఎలాంటి ప్రయోజనాన్ని సాధించలేకపోయిందనేది వాస్తవంగా కనిపిస్తుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement