సీఎంపై రేప్‌ ఆరోపణలు.. | Arunachal Pradesh CM Prema Khandu faces Rape Allegations | Sakshi
Sakshi News home page

Feb 24 2018 8:39 AM | Updated on Jul 28 2018 8:51 PM

Arunachal Pradesh CM Prema Khandu faces Rape Allegations - Sakshi

ప్రతీకాత్మక చిత్రం.. పక్కన సీఎం పెమా ఖండూ

ఇటానగర్‌ : అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ తనపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ చేస్తున్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. 10 ఏళ్ల క్రితం పెమా, మరికొందరు తనపై గ్యాంగ్‌ రేప్‌ చేశారంటూ ఆరోపిస్తోంది. పోలీసులు, జాతీయ మహిళా కమిషన్‌ నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో తగిన ఆధారాలతో మీడియా ముందుకు వచ్చేందుకు ఆమె సిద్ధపడింది. 

కాగా, తనపై ఆ మహిళ చేస్తున్న ఆరోపణలను ఖండూ తీవ్రంగా ఖండించారు. దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని.. అనవసరమైన ఆరోపణలతో తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై పరువు నష్టం దావా వేసినట్లు ఆయన తెలిపారు. 

ఇదంతా ప్రతిపక్షాల కుట్రేనని, దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నాయంటూ బీజేపీ మండిపడింది. మరోవైపు ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఈ ఘటనపై స్పందించింది. ఆ ఫిర్యాదు వెనుక దురుద్దేశం, ఉండి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేస్తూ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. 

విషయంలోకి వెళ్తే... 2008 జులైలో పేమా, మరో ముగ్గురు వ్యక్తులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె చెబుతోంది. అయితే, ఆ సమయంలో తాను స్పృహలో లేనని, ఘటనపై ఎంత మందికి విన్నవించినా ప్రయోజనం లేకపోయిందని ఆమె తెలిపింది. ఘటన జరిగిన 7 ఏళ్ల తర్వాత అంటే 2015లో (సరిగ్గా ఖండూ ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి కొద్ది నెలల ముందు) ఆమె ఇటానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో అదంతా ఉత్తదేనని తేల్చారు. 

తాజాగా ఓ న్యాయవాది సాయంతో ఆమె జాతీయ మహిళా సంఘాన్ని ఆశ్రయించారు. కానీ, ఎన్‌డబ్ల్యూసీ ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఆమె ఫిర్యాదు చేసిన రోజే (ఫిబ్రవరి 20) ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించారు. దీంతో ఈ అంశం దేశవ్యాప్త చర్చకు దారితీసింది. ‘ముఖ్యమంత్రి నాపై అత్యాచారం చేశాడంటే ప్రజలు కానీ, పోలీసులు కానీ నమ్మడం లేదు. నాపై అత్యాచారం జరిగినప్పుడు ఆయన(పెమా ఖండూ) సీఎం పదవిలో లేడు, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యేసరికి నా మాటలు ఎవ్వరూ నమ్మడం లేదు’ అని ఆమె వాపోతోంది. ఏడాది కాలంగా తనను చంపుతామంటూ బెదిరింపులు కూడా వస్తున్నాయని ఆమె వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement