రాజధాని విషయంలో రెండుగా చీలిన ఏపీ బీజేపీ నేతలు 

AP Capital Issue : AP BJP Divided Into Two Groups - Sakshi

సాక్షి, గుంటూరు :  రాజధాని విషయంలో ఏపీ బీజేపీ నాయకులు రెండుగా చీలిపోయారు. చంద్రబాబు అనుకూల, వ్యతిరేక వర్గాలుగా రాజధానిపై అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కోర్ కమిటీ మీటింగ్‌లో రాజధానిపై భిన్నాభిప్రాయాలు తెలిపారు. రాజధానిలో రాష్ట్ర నాయకత్వం జోక్యం అవసరం లేదని చంద్రబాబు వ్యతిరేక వర్గం నేతలు స్పష్టం చేశారు. రాజధాని అనేది కేంద్ర పరిధిలోని అంశమని, అభివృద్ధి వికేంద్రీకరణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే ఉత్తరాంధ్ర, రాయలసీమలో పార్టీ నష్టపోతుందని వారు తెలిపారు. అయితే చంద్రబాబు అనుకూల వర్గం ఇందుకు భిన్నంగా స్పందించింది. గతంలో రాజధానికి కేంద్రం నిధులు ఇచ్చిందని, రాజధాని తరలింపుపై కేంద్ర అభిప్రాయం కోరుదామని, రాజధాని తరలించకుండా పోరాటం చేయాలనే అభిప్రాయాన్ని చంద్రబాబు అనుకూల వర్గం నేతలు వ్యక్తం చేశారు.

చంద్రబాబు తీరుపై బీజేపీ కోర్ కమిటీ మండిపాటు
ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు తీరుపై బీజేపీ కోర్‌ కమిటీ తీవ్రస్థాయిలో మండిపడింది. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను చంద్రబాబు బుట్ట దాఖలు చేసి ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిటీ నివేదికను చర్చించకుండా చంద్రబాబు స్వలాభపేక్షతో రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేశారని తెలిపింది. కుట్రపూరితంగా రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేయాలని చంద్రబాబు నిర్ణయించడం మోసపూరిత ఆలోచనలకు నిదర్శనమని, లక్ష కోట్లతో సింగపూర్ స్థాయి రాజధాని నిర్మాణం పూర్తి కాదని శివరామకృష్ణన్ కమిటీ తేల్చి చెప్పిందని పేర్కొంది. అమరావతిలో రాజధాని నిర్మాణం కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై భారం పడుతుందని చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదంటూ మండిపడింది.

సుజనాపై బీజేపీ కేంద్ర నేతల సీరియస్‌ 
బీజేపీ నేత సుజనా చౌదరిపై బీజేపీ కేంద్ర నేతలు సీరియస్‌ అయ్యారు. రాజధాని విషయంలో సుజనా తీరును వారు తప్పుబట్టారు. బీజేపీలో చేరినా సుజనాకు ఇంకా టీడీపీ వాసన పోలేదని పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ టీడీపీ ఎజెండాతోనే సుజనా పనిచేస్తున్నారని బీజేపీ కేంద్ర నేతలు మండిపడ్డారు. రాజధానిపై సుజనా చేస్తున్న వ్యాఖ్యలు ఇంకా టీడీపీ వ్యాఖ్యల్లానే ఉన్నాయని అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top