నదీజలాల వినియోగంపై జూలై 15లోగా నివేదిక

AP And Telangana Ministers Press Meet - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గోదావరి, కృష్ణా నదీజలాలను ఇరు రాష్ట్రాలు వినియోగించుకునేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారులను ఆదేశించినట్టుగా ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. నదీజలాల వినియోగంపై జూలై 15లోగా ప్రాథమిక నివేదిక అందుతుందని ఆయన పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారంపై చర్చించడానికి ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌ శుక్రవారం ప్రగతి భవన్‌లో భేటీ అయిన సంగతి తెలిసిందే. విభజన అంశాలు, నదీ జలాల పంపకం తదితర అంశాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. నది జలాల వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఈ భేటీలో తెలుగు రాష్ట్రాల సీఎంలు నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఈ భేటీకి సంబంధించిన అంశాలను ఇరు రాష్ట్రాల మంత్రులు మీడియాకు వివరించారు. 

ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ.. ‘రెండు రాష్ట్రాలకు సంబంధించిన నదీజలాల వినియోగపై ఈ సమావేశంలో ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించారు. రెండు రాష్ట్రాలు దేశానికే మార్గదర్శకంగా ఉండాలని సీఎంలు ఆకాంక్షించారు. ప్రగతి, అభివృద్ధి కోసం రెండు రాష్ట్రాలు కలిసి పనిచేస్తాయి. షెడ్యూల్‌ 9, 10లోని అంశాలను పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రుల మధ్య చర్చలు సాగాయి. కరకట్ట పక్కన నిర్మాణాలు నిబంధనలకి విరుద్ధం.. చంద్రబాబు అక్రమ కట్టడంలో నివాసం ఉంటున్నార’ని తెలిపారు.

తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ‘వ్యవసాయం గురించి ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించాం. రెండు రాష్ట్రాల్లో సాగునీటి, తాగునీటి ఇబ్బందులు పరిష్కరించేందుకు వేగవంతగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రులు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ రంగంలో గొప్పగా ఎదగడానికి ఇది ఒక ముందడుగు. ఘర్షణలకు తావులేకుండా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకు సాగాలని ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకున్నార’ని తెలిపారు.

చదవండి : రెండు రాష్ట్రాల ప్రజలకు నీళ్లందించడమే లక్ష్యం

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top