తొలి ఏడాది వందకు వంద మార్కులు: సజ్జల

Andhra Pradesh witnessed One Year For YSRCP Mass victory, says Sajjala - Sakshi

తొలి ఏడాది పాలన సంక్షేమ దిశగా 

సీఎం జగన్‌ పాలనలో ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు

ఎన్నికల కోసం ఇచ్చిన హామీలు కావు

అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని అమలు చేసి చూపించాం

సాక్షి, తాడేపల్లి: ప్రజలకు సేవ చేయగల సత్తా, మొండి ధైర్యం ఉన్న నేత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇంకా నాలుగేళ్లలో ప్రజలకు ఎలా మంచి చేయాలనే దానిపై అలోచన చేస్తున్నారని, వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో ఉంచాలని ముఖ్యమంత్రి చూస్తున్నారన్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందించే గుణం సీఎం జగన్‌దని కొనియాడారు.  వైఎస్సార్‌సీపీకి ప్రజలు అఖండమైన విజయాన్ని అందించి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో  సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు. (ప్రజా విజయ పతాక ఎగిరిన రోజు)

అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘సరిగ్గా ఏడాది క్రితం రాష్ట్రం చారిత్రక ఘట్టం చూసింది. కనివిని ఎరుగని రీతిలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు పట్టం కట్టారు. 175 స్థానాల్లో 151 స్థానాల్లో పార్టీ విజయం సాధించింది. 50 శాతానికిపైగా ఓట్లు, 86 శాతం సీట్లుతో వైస్సార్సీపీ ఘన విజయం సాధించింది. తన తండ్రి కలలు కన్న సాకరాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ అమలు చేస్తున్నారు. తొలి ఏడాది సంక్షేమ పాలనకు వందకు వంద మార్కులు వేయొచ్చు. సీఎం జగన్‌ ఏడాది పాలన.. సంక్షేమ సంవత్సరంగా సాగింది. సీఎం జగన్‌ పాలనలో ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందాయి. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముఖ్యమంత్రి ముందుకు సాగుతున్నారు. అన్ని వర్గాలు పూర్తి సంతృప్తితో ఉన్నాయి. ఎన్నికల కోసం ఇచ్చిన హామీలు కావు. 

అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని అమలు చేసి చూపించాం. ప్రజలకు ఎక్కువ సాయం చేయాలన్నదే మా లక్ష్యం. పాలన ఎలా సాగాలో వైఎస్‌ జగన్‌ చేసి చూపించారు. కార్పొరేట్‌ వైద్యానికి ధీటుగా ప్రభుత్వ వైద్యాన్ని అభివృద్ధి చేశాం. మానవీయ కోణంలో పథకాలను సీఎం జగన్ ప్రవేశ పెట్టారు. ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని హామీలను కూడా సీఎం జగన్ అమలు చేశారు. విద్య వైద్య రంగానికి పెద్ద పీట వేశారు. కార్పొరేట్ వ్యవస్థకు దీటుగా విద్య వైద్య రంగాన్ని సీఎం జగన్ రూపొందిస్తున్నారు. పేదల పిల్లల కోసం ఇంగ్లీషు మీడియం విద్యను తీసుకొచ్చారు. పేదలకు ఇళ్ళు స్థలాలు ఇస్తున్నారు. టీడీపీ హయాంలో టీడీపీ వాళ్ళకే పథకాలు అందేవి. సీఎం జగన్‌ పాలనలో అర్హులైన వారందరికీ పథకాలు అందుతున్నాయి. పాలన ఎలా ఉండాలో జగన్‌మోహన్‌రెడ్డి చూపించారు. ఎల్జీ పాలిమర్స్ విషయంలో బాధితులను ముఖ్యమంత్రి పెద్ద మనసుతో ఆదుకున్నారు.’ అని పేర్కొన్నారు. (మేనిఫెస్టో అమలు దిశగా)

ఏడాది పూర్తయిన రోజు పార్టీ జెండా ఆవిష్కరణలతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని తొలుత భావించామని, అయితే కరోనా నేపథ్యంలో రాజకీయ పరమైన కార్యక్రమాలు నిర్వహించడం మంచిది కాదని, జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్ట వద్దని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ మేరకు పార్లమెంటరీ జిల్లా పార్టీ అధ్యక్షులకు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు ఈ విషయాన్ని కచ్చితంగా దృష్టిలో ఉంచుకోవాలని ఆయన శుక్రవారం సర్క్యులర్‌ జారీ చేశారు. పండ్లు పంపిణీతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేయదలిచిన వారు లాక్‌డౌన్‌ నిబంధనల మేరకు.. ప్రత్యక్షంగా పాల్గొనకుండా బాధితులకు సంబంధించిన స్వచ్ఛంద, సేవా సంస్థల నిర్వాహకుల ద్వారా కానీ, వార్డు వలంటీర్ల ద్వారా కానీ వాటిని నిర్వహించాలని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top