మీ మూడు తరాలు ఏం చేశాయి?

Amit Shah on Rahul - Sakshi

కాంగ్రెస్‌ కంచుకోట అమేథీలో రాహుల్‌పై అమిత్‌ షా

ఇకపై బీజేపీని నమ్మండి...అభివృద్ధి చేసి చూపుతాం

మోదీ కాపలాదారుడా.. నేరంలో భాగస్వామా: రాహుల్‌

అమేథీ/కర్జన్‌: ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ కంచుకోట అమేథీ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ నిర్వహించిన ఓ బహిరంగ సభలో ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా కాంగ్రెస్‌పై విమర్శల దాడి చేశారు. నెహ్రూ, గాంధీ కుటుంబం మూడు తరాలుగా ఇదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోందనీ, అప్పటినుంచి వారు ఈ ప్రాంతాన్ని ఏం అభివృద్ధి చేశారని షా ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ తనను లోక్‌సభకు పంపిన అమేథీని పట్టించుకోకుండా గుజరాత్‌లో అభివృద్ధిని ప్రశ్నిస్తున్నారనీ, ఇటలీ నుంచి తెచ్చుకున్న కళ్లద్దాలను తీసేసి చూస్తే ఆయనకు గుజరాత్‌లో పురోగతి కనిపిస్తుందని షా ఎద్దేవా చేశారు.

అమేథీ ప్రజలను ఉద్దేశించి అమిత్‌ షా మాట్లాడుతూ ‘మీరు 60 ఏళ్లపాటు ఒక కుటుంబాన్ని నమ్మారు. ఇప్పుడు ఇక్కడ కలెక్టరేట్‌ లేదు. క్షయ ఆసుపత్రి లేదు. ఆకాశవాణి కేంద్రం లేదు. గోమతి నది వల్ల మట్టి కోతకు గురవుతోంది. ఇన్నాళ్లూ వాళ్లు (నెహ్రూ, గాంధీ కుటుంబం) ఏం చేశారు? ఇక బీజేపీని, ప్రధాని మోదీని నమ్మండి. నమ్మకద్రోహానికి గురయ్యామన్న భావన మీలో కలగకుండా చూసుకుంటాం’ అని అన్నారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లాగానే అమేథీని కూడా తాము అభివృద్ధి చేస్తామని అమిత్‌ షా పేర్కొన్నారు.

ర్యాలీలో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ, ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కూడా పాల్గొన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అమేథీ నియోజకవర్గం నుంచి రాహుల్‌ గాంధీపై స్మృతీ ఇరానీ పోటీచేసి ఓడిపోవడం తెలిసిందే. ఆమె మాట్లాడుతూ రైతుల సంక్షేమం గురించి మాట్లాడే కాంగ్రెస్‌...రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌ను అడ్డంపెట్టుకుని రైతుల భూములను లాక్కుందని ఆరోపించారు.

మోదీ పెదవి విప్పాలి: రాహుల్‌
అమిత్‌ షా కొడుకు జయ్‌ షాపై వచ్చిన అవినీతి ఆరోపణలపై మోదీ పెదవి విప్పాలని రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. గుజరాత్‌లో ‘నవ్‌సర్జన్‌ యాత్ర’ పేరుతో సాగుతున్న పర్యటనలో రాహుల్‌ మాట్లాడారు. దేశానికి ప్రధానిగా కాక కాపలాదారుడిగా ఉంటానని 2014 ప్రచారంలో మోదీ చెప్పిన వ్యాఖ్యలను రాహుల్‌.. జయ్‌ షా అంశానికి ముడిపెడుతూ ‘కాపలాదారుడి కళ్లెదురుగానే ఓ దొంగతనం జరిగింది.

ఆయన చూస్తూ నిశ్శబ్దంగా ఉన్నారు. అంటే ఆయన నిజంగా కాపలాదారుడా లేక ఆ నేరంలో భాగస్వామా’? అని వ్యంగ్యంగా అన్నారు. ఆరెస్సెస్‌లో మహిళలకు ఏమాత్రం ప్రాధాన్యం ఉండదని రాహుల్‌ విమర్శించారు. ‘ఆరెస్సెస్‌ శాఖల్లో షార్ట్స్‌ వేసుకున్న మహిళలను మీరెప్పుడైనా చూశారా?’ అని రాహుల్‌ విద్యార్థులనుద్దేశించి ప్రశ్నించారు. ఏళ్ల తరబడి యూనిఫాంగా ఉన్న నిక్కర్లను రద్దుచేసి గతేడాదే ఆరెస్సెస్‌ ప్యాంట్లు ప్రవేశపెట్టింది. షార్ట్స్‌ వేసుకున్న మహిళలు అన్న రాహుల్‌ వ్యాఖ్యలకు బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top