మరో రెండు రాష్ట్రాల్లో ఎస్పీ– బీఎస్పీ పొత్తు

Akhilesh, Mayawati announce SP-BSP alliance in Madhya Pradesh, Uttarakhand - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అధికార బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటైన సమాజ్‌వాదీ పార్టీ–బహుజన్‌ సమాజ్‌ పార్టీ (ఎస్‌పీ–బీఎస్‌పీ)కూటమి మరో రెండు రాష్ట్రాల్లో పోటీ చేయనుంది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో యూపీతోపాటు మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోనూ కలిసి బరిలోకి దిగాలని ఈ రెండు పార్టీలు నిర్ణయించాయి. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్, బీఎస్‌పీ అధినేత్రి మాయావతి ఈ మేరకు సోమవారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ‘2019 లోక్‌సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించాం. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్, టికమ్‌గర్హ్, ఖజరహోతో పాటు ఉత్తరాఖండ్‌లోని గధ్వాల్‌ స్థానాల నుంచి సమాజ్‌వాదీ పార్టీ పోటీ చేయనుండగా మిగతా చోట్ల బీఎస్‌పీ తమ అభ్యర్థులను బరిలోకి దించుతుంది’ అని అందులో పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో 29, ఉత్తరాఖండ్‌లో 5 ఎంపీ స్థానాలున్నాయి.

బిహార్‌లో పొత్తుల్లేకుండానే బీఎస్పీ..
పట్నా: బిహార్‌లోని మొత్తం 40 లోక్‌సభ స్థానాల్లోనూ ఒంటరిగానే పోటీకి దిగాలని బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) నిర్ణయించిందని ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నేత, బిహార్‌ బిఎస్పీ ఇన్‌చార్జ్‌ లాల్జీ మేధ్కర్‌ సోమవారం వెల్లడించారు. బిహార్‌లో బీఎస్పీ టికెట్‌ ఆశావహులు, పార్టీ పథాధికారులతో గురువారం ఢిల్లీలో అధినేత్రి మాయవతితో సమావేశం ఉందని ఆయన తెలిపారు. ఎన్నికలకు సిద్ధం కావాల్సిందిగా ఆమె తమను ఇప్పటికే ఆదేశించారనీ, పూర్తి సూచనలు ఆమె గురువారం నాటి భేటీలో ఇచ్చే అవకాశం ఉందని మేధ్కర్‌ తెలిపారు. బిహార్‌లో ఇప్పటికే ఎన్డీయేతర పార్టీల మధ్య సఖ్యత లేదు. అటు కాంగ్రెస్‌ను, ఇటు ఆర్జేడీని కూడా వదిలేసి బీఎస్పీ ఒంటరిగా పోరుకు దిగాలనుకోవడం ఆ రెండు పార్టీలకూ దెబ్బేనని భావిస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top