పట్టు కోసం...పాకులాట!

Achaen Naidu Vs Kala Venkata Rao in Srikakulam  - Sakshi

కళా, కింజరాపు వర్గాల మధ్య తారస్థాయికి వర్గపోరు

ఒకరి కార్యక్రమాలకు మరో వర్గం డుమ్మా

కళా సన్మాన కార్యక్రమానికి అచ్చెన్న వర్గం గైర్హాజరు

ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, కూన రవికుమార్‌ హాజరు

కళా సభకు ముఖం చాటేసిన కలమట వెంకటరమణ

09.04.2017
మూడేళ్ల ఎదురుచూపులు ఫలించి ఇంధన మంత్రిత్వ శాఖ దక్కించుకున్న కిమిడి కళావెంకటరావుకు స్వాగత కార్యక్రమం... తర్వాత రణస్థలంలో బహిరంగ సభ! కానీ జిల్లాకు చెందిన మరో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గైర్హాజరు!  

10.04.2017
కార్మిక, క్రీడల శాఖల నుంచి రవాణా, బీసీ సంక్షేమం, చేనేత శాఖల మంత్రిగా ప్రమోషన్‌ పొందిన కింజరాపు అచ్చెన్నాయుడికి శ్రీకాకుళంలో ఆత్మీయసభ! కానీ ఆ కార్యక్రమానికి కళావెంకటరావు డుమ్మా!

సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం:
ఒక్కరోజు వ్యవధిలోనే ఆరున్నర నెలల క్రితం జరిగిన ఈ కార్యక్రమాలు కళా, కింజరాపు వర్గాల మధ్య వర్గపోరుకు అద్దం పట్టాయి! కానీ ఆ తర్వాత పార్టీ అధినేత చంద్రబాబు మూడుసార్లు, ఇటీవల లోకేష్‌ జిల్లాలో పర్యటించినా ఆ రెండు వర్గాల మధ్య సయోధ్య కుదర్లేదు! ఈ విషయాన్ని మంగళవారం నాటి ‘కళా’ సన్మాన కార్యక్రమం మరోసారి చాటిచెప్పింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని రెండోసారి చేపట్టిన సందర్భంలో చేసిన ఈ కార్యక్రమానికి యథావిధిగా మంత్రి అచ్చెన్న సహా సొంత పార్టీ ఎమ్మెల్యేలే డుమ్మా కొట్టారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, విప్‌ కూన రవికుమార్‌ మాత్రమే హాజరుకావడంపై పార్టీలో చర్చకు దారితీసింది. జిల్లాలో కింజరాపు, కిమిడి కుటుంబాల మధ్య దీర్ఘకాల వైరం ఉంది. దివంగత నాయకుడు ఎర్రన్నాయుడి కాలం నుంచి కళాకు పొసగట్లేదు. కళా ప్రజారాజ్యం పార్టీలోకి మారిపోవడానికి ఇదే కారణమనే వాదనలు ఉన్నాయి. చంద్రబాబు రెండో విడత అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి రెండేళ్లు అచ్చెన్నాయుడు ఒక్కరే జిల్లాలో చక్రం తిప్పారు. ఎన్నికలకు ముందే ప్రజారాజ్యం పార్టీ నుంచి సొంత గూటికి చేరుకున్న కళాకు టీడీపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతో కింజరాపు వర్గం షాక్‌కు గురైంది.

అయితే మంత్రి పదవి కోసం కళా చేస్తున్న ప్రయత్నాలను అచ్చెన్న వర్గం ఎక్కడికక్కడ అడ్డుకుంటూ వచ్చింది. జిల్లాలో మరో సీనియరు ఎమ్మెల్యే గౌతు శివాజీకి మంత్రి పదవి ఇప్పించాలని ప్రయత్నించినా పునర్‌వ్యవస్థీకరణలోనూ ఫలితం దక్కలేదు. లోకేశ్‌ అండదండలు పుష్కలంగా ఉన్న కళా ఇంధన మంత్రి పదవి దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీంతో కింజరాపు వర్గమే కాదు మంత్రి పదవి ఆశించిన శివాజీ కూడా కంగు తిన్నారు.  మీడియా ముందు ఆయన కంటతడి పెట్టినా అధిష్టానం నుంచి సరైన హామీ ఏదీ రాలేదు. పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా ఉన్న ఆయన కుమార్తె గౌతు శిరీషను అదే పదవిలో కొనసాగిస్తున్నారు. అంతేకాదు తొలి మూడేళ్లు జిల్లాలో ఏకైక మంత్రిగా కింజరాపు అచ్చెన్నాయుడు చక్రం తిప్పారు. ఆ హోదాలో ఆయన వేదికపై కూర్చుంటే తాను జడ్పీ సభ్యులతో కలిసి కూర్చోవడం ఇష్టం లేకే కళావెంకటరావు ఆ మూడేళ్లు జిల్లా పరిషత్తు సమావేశాలకు సైతం డుమ్మా కొట్టారు. ఈ నేపథ్యంలో కళా వెంకటరావుకు జిల్లా నుంచి రెండో మంత్రిగా చంద్రబాబు కేబినెట్‌లో స్థానం దక్కింది.

రెండోసారి అధ్యక్ష పదవిలోకి...
టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో కళాకు కొనసాగింపు ఉండకపోవచ్చని ఇటీవల బాగా ప్రచారం జరిగింది. కానీ చంద్రబాబు కళా వైపే మొగ్గు చూపించారు. ఈసారి కూడా లోకేశ్‌తో సాన్నిహిత్యం కళాకు బాగా కలిసొచ్చిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో అచ్చెన్నాయుడు వెనుకబడ్డారు. ఇటు పార్టీ బాధ్యతలు, అటు మంత్రి బాధ్యతలతో దూసుకుపోతున్న కళా... జిల్లాపై పట్టు కోసం పావులు కదపడం ప్రారంభించారు. అందులో భాగంగానే ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన లోకేష్‌ను కూడా శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఇంటికి అల్పాహార విందుకు తీసుకెళ్లడంలో సఫలమయ్యారు. అంతేకాదు అంతకుముందు పాలకొండ నియోజకవర్గంలోని తెట్టంగిలో ‘ఇంటింటికీ టీడీపీ’ ప్రారంభ కార్యక్రమంలోనూ కళా పైచేయి కనిపించింది. ఇవన్నీ కింజరాపు వర్గానికి ఇబ్బంది కలిగించేవే. జిల్లాపై పట్టు జారిపోకుండా కాపాడుకునేందుకు ప్రతివ్యూహంలో పడింది. అందులో భాగంగాన మంగళవారం కళా సన్మాన సభకు మంత్రి అచ్చెన్న, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు సహా ఎమ్మెల్యేలు గౌతు శివాజీ, బెందాళం అశోక్, బగ్గు రమణమూర్తి, కలమట వెంకటరమణ డుమ్మా కొట్టారు. ప్రోటోకాల్‌ ప్రకారం పార్టీ జిల్లా అధ్యక్షురాలైన శివాజీ కుమార్తె శిరీష హాజరయ్యారు. ఇక ఎప్పటినుంచో కళా వర్గంలోనున్న ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవితో పాటు ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

పాత తగవుల నేపథ్యంలోనే...
కళా సన్మాన కార్యక్రమానికి గుండ లక్ష్మీదేవి హాజరు వెనుక ప్రధాన కారణం ఆమె భర్త, మాజీ మంత్రి అప్పలసూర్యనారాయణకు కళాతో ఉన్న సంబంధాలు ఒకటైతే, కింజరాపు కుటుంబంతో ఉన్న విభేదాలు మరో కారణమని బహిరంగ రహస్యమే. అయితే కూన రవికుమార్‌కు మాత్రం కింజరాపు వర్గంతో తొలి నుంచి అంత సఖ్యత లేదు. ఇసుక అక్రమ రవాణా మాఫియాకు అండదండలు అందిస్తున్నారనే ఆరోపణలు కూనపై రావడానికి, మద్యం సిండికేట్‌కు అచ్చెన్న వత్తాసు పలుకుతున్నారనే విమర్శలు వెల్లువెత్తడానికి ఒకరంటే ఒకరు కారణమని ఇరువర్గాలు ఇటీవల కత్తులు దూసుకున్నాయి. ఇది అధిష్టానం వద్ద పంచాయతీకి కూడా దారితీసిందనే గుసగుసలు వినిపించాయి. ఇక ఆమదాలవలస సుగర్‌ ఫ్యాక్టరీ సమస్య విషయంలోనూ ఇదే ధోరణి కొనసాగుతోంది. దీంతో సహజంగానే కూన అటు కళా వర్గంతో చేతులు కలిపారనే వాదన ఉంది.

పార్లమెంటరీ నియోజకవర్గమే కారణమా...
కళా ప్రాతినిధ్యం వహిస్తున్న ఎచ్చెర్లతో పాటు ఆయనకు కాస్త పట్టున్న రాజాం, పాలకొండ నియోజకవర్గాలు శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గంలో లేవు. మిగతా ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడుతో సంబంధాలు అవసరం. దీంతో కళా పార్టీ రాష్ట్ర అధ్యక్ష హోదాలో జిల్లాకు వచ్చినప్పటికీ ఆయా ఎమ్మెల్యేలలో గుండ లక్ష్మీదేవి, కూన రవికుమార్‌ మినహా మిగతా వారెవ్వరూ కళా వెనుక కనిపించట్లేదనే వాదనలు ఉన్నాయి. ఇటీవల కాలంలో పాతపట్నం ఫిరాయింపు ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కొన్ని సమీకరణాల దృష్ట్యా కళాకు దగ్గరైనా కేవలం ఎంపీ అవసరం దృష్ట్యానే కళా సన్మాన కార్యక్రమానికి హాజరుకాలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా జిల్లాపై పట్టు కోసం ఒకవైపు కళా, మరోవైపు తమ పట్టు జారిపోకుండా చూసుకోవడానికి కింజరాపు కుటుంబం తాపత్రయం పడుతుండటంతో జిల్లా టీడీపీలో గ్రూపుల గోల కొనసాగుతోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top