89వ రోజు పాదయాత్ర డైరీ

89th day padayatra dairy - Sakshi

16–02–2018, శుక్రవారం
బంగారక్కపాళెం క్రాస్‌ రోడ్డు, 
ప్రకాశం జిల్లా

యువతను మరోసారి వంచించే ప్రయత్నం చేస్తున్నారా?
ఈ రోజు నెల్లూరు దాటి ప్రకాశం జిల్లాలోకి అడుగు పెట్టాను. ఏచోటికెళ్లినా ఎండమావులే. ఏ ఎదను కదిపినా వేడి నిట్టూర్పులే. ఏ ప్రాంతం అయితే ఏంటి.. పేదోడి ఇంట కష్టాలూ, కన్నీళ్లే. పెదపవని గ్రామానికి చెందిన ఆదెమ్మ ఆవేదన చూశాక గుండె బరువెక్కింది. కూలి చేసే ఆమె భర్త మంచానపడ్డాడు. ఒక్కగానొక్క కొడుకు పెళ్లయిన ఏడాదికే కిడ్నీలు చెడిపోయి చావుతో పోరాడుతున్నాడు. కడుపుతీపి చంపుకోలేక తన కిడ్నీ ఇవ్వాలనుకుందా తల్లి. కానీ ఆమెకూ గర్భసంచి క్యాన్సరట. పోనీ, అవయవదానం ద్వారా కిడ్నీ మార్పిద్దామనుకుంటే.. ఆరోగ్యశ్రీ వర్తించదట. రూ.6 లక్షలు ఖర్చవుతుందట. ఏం చేయాలా తల్లి? ఎవరికి చెప్పుకోవాలి ఆమె ఘోష? సింగరపాలేనికి చెందిన 83 ఏళ్ల అవ్వ లచ్చమ్మ తన కష్టాలు చెప్పింది. పింఛన్‌ కోసం కాళ్లరిగేలా తిరిగినా కనికరించలేదట. రేషన్‌ కూడా ఇవ్వడం లేదట. ఎందుకని అడిగితే.. ఫ్యాను గుర్తుకు ఓటేశావుగా.. అంటున్నారట. మానసిక వికలాంగుడైన మనవడితో బతుకు పోరు చేస్తున్న ఆ అవ్వను ఇలా మాటలతో చంపడం న్యాయమేనా? కొడుకు చనిపోయినా చంద్రన్న బీమా ఒక్క పైసా రాలేదయ్యా.. అంటూ ఆదిలక్ష్మి అనే అమ్మ ఆక్రోశించింది. చేపలు పట్టుకుని జీవించే చేటూరి భవానీది మరో కన్నీటి గాథ. నాన్నగారి హయాంలో పైసా ఖర్చులేకుండా గుండె ఆపరేషన్‌ చేయించుకుందట. ఇప్పుడు మళ్లీ జబ్బుచేసిందామెకు. ఇప్పుడేమో ఆరోగ్యశ్రీ చెల్లదన్నారట. భర్తలేని ఆ తల్లి.. ఇద్దరు కూతుళ్లను సాకుతోంది. దారి చూపాలంటూ కన్నీళ్లు పెట్టుకుంది. వీళ్లను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిది కాదా? వీరి పట్ల కూడా పార్టీల వివక్ష చూపుతున్న ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా? 

కొత్తపేట నుంచి రాళ్లపాడు ప్రాజెక్టు మీదుగా వెళుతుంటే.. ఆ ప్రాజెక్టు కమిటీ మాజీ ప్రెసిడెంటు నరసింహరావన్న ‘సార్‌.. నాలుగేళ్లుగా ఇక్కడ వ్యవసాయం తెల్లారిపోతోంది. వర్షాల్లేవు, ప్రాజెక్టుల్లోకి నీళ్లూ రావు. రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పనుల్లేక, బతుకుదెరువు కనిపించక వలసలు పోతున్నారు. ఇలాంటి పరిస్థితులొస్తాయని మీ నాన్నగారు సోమశిల నుంచి ఉత్తర కాలువ ద్వారా ఈ ప్రాజెక్టుకు నీటిని తరలించాలన్న బృహత్కార్యానికి శ్రీకారం చుట్టారు. మా దురదృష్టం.. ఆయన తదనంతరం మా కష్టాలు తీర్చాలన్న తపన ఉన్న నాయకుడే రాలేదు. అందుకే ఈ పథకం అసంపూర్తిగానే ఉండిపోయింది’అని చెబుతుంటే.. ఆ ప్రాజెక్టును అలా చూస్తుండిపోయాను. ఈ పథకం పూర్తయితే వలసలు ఆగడంతో పాటు తాగునీరు అంది.. ఫ్లోరైడ్‌ బాధ తప్పేది కదా. 

ఈ రోజు పత్రికల్లో ముఖ్యమంత్రిగారి ప్రకటన చూసి ఆశ్చర్యపోయాను. పరిశ్రమల్లో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తాడట. నాలుగేళ్లుగా మన పిల్లలు ఉద్యోగాల్లేక అవస్థలు పడుతుంటే.. నిద్రపోతున్నారా? మన రాష్ట్రంలోని పరిశ్రమల్లో ఉద్యోగాలను ఇతర రాష్ట్రాల వారు ఎగరేసుకుపోయిన విషయం కనిపించలేదా? వాచ్‌మేన్లు, స్వీపర్లు వంటి చిన్న చిన్న ఉద్యోగాలను మాత్రం మనవారికి ఇస్తూ ఉంటే.. ఇంతకాలం మీరేం చేస్తున్నారు? ఈరోజు ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని దోషిగా నిలబెడుతున్న తరుణంలో ప్రజలను మళ్లీ మభ్యపెట్టాలని చూస్తున్నారా? మీ మీద ఆగ్రహంతో రగిలిపోతున్న యువతను మరోసారి వంచించే ప్రయత్నం చేస్తున్నారా?  

ప్రత్యేక హోదాతోనే పరిశ్రమలు, ఉద్యోగాలొస్తాయని, పరిశ్రమలు కట్టడానికే మూడు నాలుగేళ్లు పడుతుంది కాబట్టి.. ప్రత్యేక హోదా పదేళ్లని.. పదిహేనేళ్లని వెంకయ్యనాయుడుగారు రాజ్యసభలోనూ, మీరు మోదీగారి సమక్షంలోనూ అనలేదా? ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు మాత్రమే వచ్చే పారిశ్రామిక రాయితీలు మన రాష్ట్రానికి ఒక్కటైనా వచ్చిందా? అవి రానప్పుడు హోదాను పక్కన పెట్టి.. ప్రత్యేక ప్యాకేజీ అంటూ ఎందుకు రాజీపడ్డారు? ఇది రాష్ట్ర ప్రజలను మోసం చేయడం కాదా? పరిశ్రమల్లో ఉద్యోగాల విషయంలో స్థానిక యువతకు జరుగుతున్న అన్యాయాన్ని నేను పదే పదే ప్రస్తావించిన తర్వాత.. నాలుగేళ్లపాటు పట్టించుకోని మీరు ఈ రోజు ఎన్నికలు దగ్గరపడుతున్న తరు ణంలో స్థానికులకు అత్యధిక శాతం ఉద్యోగాలను ప్రకటించడం మరోసారి వంచించడం కాదా?
-వైఎస్‌ జగన్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top