2019 ఎన్నికలు: యోగి బ్రహ్మాస్త్రం ఇదే!

2019 Elections, This is Yogi brahmastra - Sakshi

వారణాసి: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ-బీఎస్పీ కూటమికి చెక్‌ పెట్టేందుకు యోగి ఆదిత్యనాథ్‌ సర్కారు తన ‘బ్రహ్మాస్త్రాన్ని’ ప్రయోగించబోతోంది. యూపీ ఎన్నికల్లో కులాల సమీకరణాలు అత్యంత కీలకమైన నేపథ్యంలో రాష్ట్రంలోని 82 ఓబీసీ కులాలను మూడు విభాగాలుగా విభజించి.. మండల్‌ కమిషన్‌ ప్రతిపాదించిన 27శాతం రిజర్వేషన్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని కేబినెట్‌ సీనియర్‌ మంత్రి ఓపీ రాజ్‌భర్‌ తెలిపారు. బీజేపీ మిత్రపక్షం సుహెల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ (ఎస్బీఎస్పీ) అధ్యక్షుడైన ఆయన మీడియాతో మాట్లాడారు. 82 ఒబీసీ కులాలను మూడు విభాగాలుగా వర్గీకరించి.. 27శాతం రిజర్వేషన్‌ను వర్తింపజేయాలని నిర్ణయించడం రాజకీయ బ్రహ్మాస్త్రామని, ఈ బ్రహ్మాస్త్రం దెబ్బకు ఎస్పీ-బీఎస్పీ కూటమికి ఎన్నికల్లో ఎదురుదెబ్బ తప్పదని ఆయన చెప్పారు. లోక్‌సభ ఎన్నికలకు ఆరు నెలల ముందు ఈ నిర్ణయాన్ని అమలుచేయాలని యోగి ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు.

ఎస్పీ-బీఎస్పీ కూటమి ఇటీవలి యూపీ లోక్‌సభ ఉప ఎన్నికల్లో సంచలన విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. సీఎం యోగి, డిప్యూటీ సీఎం మౌర్య రాజీనామాతో ఉప ఎన్నికలు జరిగిన గోరఖ్‌పూర్‌, ఫూల్‌పుర లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎస్పీ, బీఎస్పీ కూటమి విజయం సాధించడం బీజేపీలో గుబులు రేపింది. ఈ విజయాలతో ఊపుమీదున్న ఎస్పీ-బీఎస్పీ రానున్న లోక్‌సభ ఎన్నికల్లోనూ పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నాయి. వెనుకబడిన తరగతులు, దళితులు, ముస్లింల సామాజిక సమీకరణంతో బీజేపీని చిత్తు చేసేందుకు ఆ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్పీ-బీఎస్పీ రాజకీయ సమీకరణకు చెక్‌ పెట్టేందుకు యోగి ప్రభుత్వం.. ఓబీసీల వర్గీకరణ సూత్రాన్ని తెరపైకి తెచ్చింది. ఈ సూత్రం ప్రకారం వెనుకబడిన తరగతుల్లో నాలుగు కులాలు, బాగా వెనుకబడిన తరగతుల్లో 19 కులాలు, అత్యంత వెనుకబడిన కులాల్లో (ఎంబీసీలు) 59 కులాలు ఉండనున్నాయి.

ఈ మేరకు ఓబీసీ రిజర్వేషన్‌ను వర్గీకరిస్తే.. ఎస్పీకి ప్రధాన మద్దతు వర్గమైన యాదవుల ఆధిపత్యానికి తీవ్ర సవాల్‌ ఎదురయ్యే అవకాశముందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఓబీసీ రిజర్వేషన్లలో గణనీయమైన ప్రయోజనాలు పొందుతున్నది యాదవులే. రిజర్వేషన్‌ ఫలాలను యాదవులే అధికంగా పొందుతున్నారనే అసంతృప్తి ఇతర బీసీ వర్గాల్లో ఉంది. ఈ అసంతృప్తి 2014 లోక్‌సభ ఎన్నికల్లోనూ, 2017 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీకి కలిసి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ వర్గాలను మరింతగా చేరవయ్యి.. ఎస్పీ-బీఎస్పీ కూటమి సామాజిక సమీకరణాన్ని దెబ్బతీయని కమల దళం వ్యూహాలు రచిస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top