
భువనేశ్వర్ (కటక్): రజత నగరం కటక్‌లో గురువారం రెండు వీధుల ప్రజల మధ్య జరిగిన ఘర్షణ బీభత్సం సృష్టించింది. ఈ ఘర్షణలో పోలీసులు గాయపడ్డారు. దుర్గా దేవి నిమజ్జనాన్ని పురస్కరించుకుని రగిలిన స్పర్థలు చినికిచినికి గాలివానగా మారి ఘర్షణకు దారితీశాయి. బదాంబాడి, పూరీ ఘాట్ పోలీసు స్టేషన్ల ఇన్‌స్పెక్టర్ ఇన్‌చార్జిలు ఇరు వర్గాల ఘర్షణలో గాయపడ్డారు.
బదాంబాడి, పూరీ ఘాట్ పోలీస్ స్టేషన్ల పరిధి సర్వోదయపూర్, స్వీపర్ కాలనీ వాసుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇరువర్గాలు ఒకరిపై వేరొకరు తేలికపాటి మాటల్ని ప్రయోగించడంతో ఘర్షణ ప్రారంభమైనట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. వాస్తవానికి దుర్గా పూజా నిమజ్జనం నాటికి ఇటువంటి పరిస్థితి లేనట్లు నగర డీసీపీ అఖిలేశ్వర్ సింగ్ తెలిపారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్తమైనట్లు అందిన సమాచారం ఆధారంగా పోలీసు దళాలు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరాయి. ఇరు వర్గాలు పగిలిన గాజు సీసాలు, రాళ్లు రువ్వుకోవడంతో అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన పోలీసు వర్గాలు గాయపడ్డాయి. తొలి దశలో 12 మందికి అదుపులోకి తీసుకున్నామని మిగిలిన నిందితుల్ని గుర్తించి చర్యలు చేపడతామని సహాయ పోలీస్ కమిషనర్ అనిల్ మిశ్రా తెలిపారు.

