
నరకం చూపిన పాలన...!
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య హక్కులు కాదు కదా.. కనీస విలువలకు కూడా తావు లేకుండా చేశాడు చంద్రబాబు.
మనసులో మాట
కొమ్మినేని శ్రీనివాసరావుతో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య హక్కులు కాదు కదా.. కనీస విలువలకు కూడా తావు లేకుండా చేశాడు చంద్రబాబు. కేసీఆర్‌ని ఆయన కుటుంబాన్ని తిరుపతి సందర్శనలో గౌరవించారు సరే. కానీ తెలంగాణ ఎంఎల్‌ఏలు, మంత్రులు తిరుపతి వెళితే అక్కడి ప్రభుత్వంకానీ, అధికారులు కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. గంటలకొద్దీ భంగపడితే ఏ అధికారైనా కరుణిస్తే కాస్త సౌకర్యం లభిస్తోంది తప్పితే దేవుడి ముందు కూడా తెలంగాణ నాయకుల పట్ల విపక్ష చూపిస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో తన పాలనా కాలంలో చంద్రబాబునాయుడు తెలంగాణకు నరకం చూపించాడని టీఆర్‌ఎస్ సీనియర్ నేత, దుబ్బాక ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక భూమిక నిర్వహించిన సోలిపేట రామలింగారెడ్డి అంటున్నారు. నక్సలైట్లతో కనీస సంబంధం లేని వ్యక్తులను పట్టుకుపోయి చంపారని, షెల్టరిచ్చినందుకు, ఒక పూట వాళ్లకు అన్నం పెట్టినందుకు కాల్చిపడేశారని, నెలకు ఇంతమందిని చంపాలి అని టార్గెట్ పెట్టుకుని మరీ పోటీలు పడి ఎన్‌కౌంటర్లు చేశారని ఆరోపించారు. స్వయంగా తన సోదరుడు సోలిపేట కొండలరెడ్డిని కూడా ఎన్‌కౌంటర్ చేశారని, పగలు జర్నలిస్టు నేతగా, ఆర్‌ఎస్‌యూ కార్యకర్తగా ఉంటున్న తాను సైతం రాత్రిపూట ఇంట్లో లేకుండా బయట షెల్టర్ తీసుకునేవాడినని చెప్పారు. కక్షసాధింపునకు మారుపేరు బాబు కాగా, తనను నిందించిన వారిని కూడా మరుక్షణంలో క్షమించి వదిలేసే జననేత కేసీఆర్ అంటున్న సోలిపేట అభిప్రాయాలు ఆయన మాటల్లోనే...
ఆర్‌ఎస్‌యూలో పనిచేసిన మిమ్మల్ని కూడా ఎన్‌కౌంటర్ చేయాలనుకున్నారట కదా?
నన్ను టాడా కేసు కింద అరెస్టు చేశారు. ఎన్‌కౌంటర్ చేయాలని కూడా తీవ్రంగా ప్రయత్నించారు. చంద్రబాబు హయాంలో నాకు తెలిసిన అనేకమంది ఎన్‌కౌంటర్లలో చనిపోయారు. నక్సలైట్లతో కనీస సంబంధం లేని వ్యక్తులను పట్టుకుపోయి చంపారు. వైద్యం కోసం ఇంటికి వస్తే వాళ్లకు వైద్య సేవలందించారన్న సాకుతో ఆర్‌ఎంపీ డాక్టర్‌ని ఎన్‌కౌంటర్ చేశారు. షెల్టరిచ్చినందుకు, ఒక పూట వాళ్లకు అన్నం పెట్టినందుకు చంపేశారు. ఈ నెల ఇంతమందిని చంపాలి, వచ్చే నెలకు ఇంతమందిని చంపాలి అని టార్గెట్ పెట్టుకుని మరీ పోటీలు పడి ఎన్‌కౌంటర్లు చేశారు. టీఆర్‌ఎస్‌లో పనిచేస్తున్న ఈశ్వర్ అనే అతడిని టార్గెట్ చేసి తప్పుడు సమాచారం కారణంగా అతడి తమ్ముడిని ఎన్‌కౌంటర్ చేశారు. నా పరిస్థితి ఏమిటంటే పగటిపూట పెద్ద లీడర్ని. రాత్రి సమయంలో రహస్యంగా షెల్టర్‌లో ఉండేవాడిని. ఇంట్లో ఉంటే పోలీసులు పట్టుకుపోయి చంపేసేటోళ్లు. నిజంగానే బాబు పాలన ఘోరమైన పాలన. గ్రామాల్లో యువకులు రాత్రి ఇంట్లో ఉండాలంటే ప్రాణాలకు తెగించాల్సి వచ్చేది.
మీ బ్రదర్ కూడా ఎన్‌కౌంటర్ అయినట్లున్నారు కదా?
మా చిన్నమామ కుమారుడు సోలిపేట కొండల్ రెడ్డిని కాల్చి చంపారు.
తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర, మీకు గుర్తున్న కొన్ని ఘట్టాలు చెప్పండి?
తెలంగాణ ఉద్యమంపై ఘోరమైన నిర్బంధం విధించారు. నన్నయితే ప్రమాదకర శక్తిగా గుర్తించారు. బాబు హయాంలో మా దుబ్బాక నియోజకవర్గంలోనే 250 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే వాటిని ఆకలి చావులు కాదన్నారు. అవమానించారు. చితికిన చేనేత బతుకులు.. భవనాలు పెట్టిన మెతుకులు వంటి పేరుతో అప్పట్లో ఒక వ్యాసం కూడా రాశాను. అధికారంలో ఉన్నప్పుడు బాబు చేనేత కార్మికుల ఆత్మహత్యలను ఘోరంగా అవమానించాడు. అధికారం పోయాక ఆయన వాళ్లను పరామర్శ చేస్తానన్నాడు. ఈ కపటత్వం ఎందుకని మేం అడ్డుపడ్డాం.
తెలంగాణ వచ్చాక ఎలా ఫీలవుతున్నారు?
మా దుబ్బాక నియోజకవర్గం చాలా పేదది. ఒక్కటంటే ఒక్క పరిశ్రమ లేదు. కెనాల్ లేదు. ప్రాజెక్టు లేదు. పదిహేనేళ్లుగా వరుస బెట్టి కరువు. సెంటిమెంటో ఏమో కాదు కానీ... చంద్రబాబు దుబ్బాకలో అడుగుపెట్టాడు. అప్పటినుంచి సర్వనాశనమైపోయింది. భూగర్భజలం 500 అడుగులు లోతుకు పడిపోయింది. కాని ఇప్పుడు వర్షాలు కురవడం, మిషన్ కాకతీయతో పరిస్థితి మెరుగుపడింది. అప్పట్లో గ్లాసుడు నీళ్లు తాగుదామన్నా కష్టంగా ఉండేది. నీళ్లు తాగుతామంటే టీ తాగితే నీళ్లు ఇస్తామనేవారు. ఇప్పుడు మిషన్ భగీరథ 99 శాతం వరకు గ్రామాల్లోకి వస్తోంది.
కేసీఆర్ ప్రతిపక్షనేతలకు అప్పాయింట్‌మెంట్ ఇవ్వరు. ప్రజలను కలవరు అంటున్నారు?
ప్రతిపక్షనేతలు ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు మాకు సీఎం అప్పాయింట్‌మెంట్ ఇవ్వలేదు అంటూ ప్రకటనలు చేస్తుంటారు. కాని మంత్రుల చాంబర్లలో, సీఎం చాంబర్లో ఎప్పుడు చూసినా కాంగ్రెస్ నేతలే ఉంటారు. సాక్షి తరపున అక్కడ నాలుగు కెమెరాలు పెడితే మీకే అర్థమవుతుంది విషయం. వారే సీఎంని కలిసి పనులు చేయించుకుం టుంటారు. చిన్న ఉదాహరణ. కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి అడిగిన మాటమీద కేసీఆర్ ఆయనకు వందకోట్ల విలువైన ప్రాజెక్టుకు అనుమతిచ్చారు.
పదవిలో ఉన్న వారిని తీసుకుని విలీనం అంటే కుదుర్తుందా?
తెలుగుదేశం పార్టీ ఇప్పటికే వ్యవస్థాపితమై బలంగా ఉన్న రాజకీయ పార్టీ. మాది ఉద్యమపార్టీ. తెలంగాణ ప్రజల బతుకులను బాగు చేయాలని పుట్టుకొచ్చిన పార్టీ మాది. టీడీపీ ఎమ్మెల్యేల ద్వారానే తెరాస ప్రభుత్వంపై దాడి చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తే, వాళ్లకు వాళ్లుగా ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు.
ఆ నలుగురి కోసమే ప్రభుత్వం నడుస్తోందని అంటున్నారే?
తెరాసది కుటుంబ పాలన అంటున్న వారు తాము అందమైన అబద్దం ఆడుతున్నామని వారికే స్పష్టంగా తెలుసు. మాపై విమర్శ చేస్తున్నారు కదా. చంద్రబాబు కుటుంబం పరిస్థితి ఏమిటి? బాబు, బాలకృష్ణ, లోకేశ్.. ఇదంతా కుటుంబ పాలన కాదా.. కాంగ్రెస్ పార్టీది కుటుంబ పాలన కాదా? కేటీఆర్ ఉద్యమంలో రాటుదేలి నాయకుడయ్యారు. మంత్రి అయ్యారు. లోకేశ్ ఏపీకి ఏం చేశారని మంత్రి అయ్యాడు?
ఓటుకు కోట్లు కేసు సరే.. నయీం కేసునూ నీరు కార్పించేశారు?
వంద నాగార్జునసాగర్‌లు కట్టించిందానికంటే నయీంను తుద ముట్టించిన ఘటనే గొప్పదని నా ఉద్దేశం. నయీంను దశాబ్దాలుగా సమర్థించి కాపాడినవాళ్లు ఎవరో అందరికీ తెలుసు. నయీం ఎంత క్రూరాత్ముడో అనుభవించిన వాళ్లకే తెలుసు. కేసీఆర్ మాత్రమే నయీం పని పట్టగలిగారు. నూటికి నూరుపాళ్లు నయీం కేసు విచారణ నడుస్తోంది. ఈ విషయంలో టీఆర్‌ఎస్ వ్యక్తులకు సంబంధం ఉంటే వారిని కూడా పక్కన పెడుతున్నారు. నయీం కేసు వదిలే ప్రశ్నేలేదు.
బాబు, కేసీఆర్.. పాలనపై మీ అభిప్రాయం?
బాబు, కేసీఆర్ పాలనను పోలిస్తే నక్కకూ, నాగలోకానికీ ఉన్నంత తేడా ఉంది. బాబు పాలనలో మా ఊళ్లో అయిదంటే అయిదు ఫించన్లు మాత్రం ఇచ్చారు. అయిదేళ్లలో ఫించన్ల సంఖ్య పెరగలేదు. అదే కేసీఆర్ పాలనలో వృద్ధులకు, వికలాంగులకు, మాత్రమే కాదు, వితంతువులకు.. ఒంటరి మహిళలకు కూడా ఫించన్లు ఇస్తున్నారు. కొన్ని వేలమందికి ఇలా ఇస్తున్నారు. మా నియోజకవర్గంలో ఉద్యోగులను తప్పిస్తే ఇంటింటికీ ఫించన్ ఇస్తామని చెప్పాము. ఇస్తున్నాం కూడా.
వ్యక్తులుగా చంద్రబాబు, కేసీఆర్‌పై మీ అభిప్రాయం?
కేసీఆర్ ఒక వ్యక్తిని పడగొట్టాలని, జీవి తాన్ని దెబ్బతీయాలని చూడరు. ఆయన నైజం కాదు. అదే బాబు అయితే నవ్వుతూ మాట్లాడుతూనే అవతలివాడిని ఎక్కడ తొక్కేయాలో అక్కడ తొక్కెయ్యాలని చూస్తాడు. పథకం ప్రకారం దెబ్బతీయాలని చూస్తాడు. కేసీఆర్ ఆవేశానికి గురై ఎవరినైనా తిట్టినా, ఆ మరుక్షణమే మర్చిపోతారు. కక్షసాధింపు మాత్రం లేదు. చంద్రబాబు అయితే నవ్వుతూ నవ్వుతూనే గొంతు కోసేస్తాడు. చాడీలను ఏమాత్రం పట్టించుకోని మంచి లక్షణం కేసీఆర్‌కి ఉంది. చంద్రబాబుకు చెప్పుడు మాటలు వినడమే కాదు. తాను కూర్చునే కుర్చీని కూడా అనుమానించే తత్వం చంద్రబాబుది.
ఎన్టీరామారావును గద్దె నుంచి దింపిన చంద్రబాబు ఇప్పుడు మాత్రం ఆయన ఫొటోకు మొక్కుతున్నారు కదా?
మా ప్రాంతంలో దీన్ని సంపి సావు ఖర్చు పెడుతున్నట్లు లెక్కిస్తారు. అంటే మనిషిని చంపేసి తర్వాత చావు ఖర్చులకు డబ్బులిస్తారు కదా. ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబు వ్యవహారం ఇలాగే ఉంది.
(సోలిపేటతో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి)
https://goo.gl/t2rMEM
https://goo.gl/KQim3S