సమున్నత పదవికి స్థాయి ముఖ్యం

సమున్నత పదవికి స్థాయి ముఖ్యం


జాతిహితం

మన రాష్ట్రపతి పదవి చరిత్రను పరిశీలిస్తే విద్యార్హతలకీ, రాజకీయ నేపథ్యానికీ, కులమతాలకీ, సామాజిక నేపథ్యానికి సంబంధం లేదని తెలుస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, రాష్ట్రపతి పదవిని చేపట్టబోయే వారి పనితీరు, ముద్రలను కరిక్యులమ్‌ వీటా చెప్పలేదు. ఇంకొకటి కూడా ఉంది, అది ఊహకి అతీతమైన లక్షణం : అదే స్థాయి. కలామ్, వెంకట్రామన్, నారాయణన్‌లకు అలాంటి స్థాయి ఉంది. వీవీ గిరి, ఫక్రుద్దీన్, ప్రతిభా పాటిల్‌కు అలాంటి స్థాయి లేదు.




భారత 14వ రాష్ట్రపతి పదవిని చేపట్టడానికి కావలసిన అర్హతలన్నీ ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఉన్నాయా లేవా అన్న ప్రశ్న ఇప్పుడు పూర్తిగా విద్యా విషయకమైనది. సర్వ సాధారణమైన కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కూడా ప్రజాజీవితంలో కోవింద్‌ సాధించిన విజయాలను గురించి ఆయనకు మద్దతు ఇస్తున్నవారు ఏకరువు పెట్టవచ్చు. అయితే ఈ వివరణలలో 2007 సంవత్సరంలో రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిభా పాటిల్‌ను కాంగ్రెస్‌ నియమించినప్పుడు చెప్పిన మాటలే ధ్వనిస్తున్నాయి. అభ్యర్థిత్వం ఖరారైన తరువాత పాటిల్‌ గతానికి సంబం«ధించిన రహస్యాలు బయటపడడంతో కాంగ్రెస్‌ నాయకులు ఇరకాటంలో పడ్డారు.


అప్పుడు నా సంపాదకత్వంలోని పత్రిక ప్రతిభా పాటిల్‌ గతాన్ని వలేసి వెతికి పట్టుకుని చక్కెర వ్యాపారంలో, సహకార బ్యాంకింగ్‌ వ్యవస్థలో, ప్రైవేటు విద్యా సంస్థలలో ఆమె చీకటి కార్యకలాపాలను గురించి ధారావాహికంగా ప్రచురించింది. అయినా అలాంటి శత్రుత్వానికి స్వస్తి పలికే ఉద్దేశంతో ఒక సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు ఒక సాయంత్రం, బాగా పొద్దుపోయిన తరువాత నా దగ్గరకు వచ్చాడు. వెంట ఒక మామిడిపళ్ల బుట్ట కూడా తెచ్చాడు. ‘‘మీ విలేకరులు రాసిన వార్తలన్నీ నిజమే’’అన్నాడాయన. అయితే వాటిని మేమెందుకు ఆపాలి అని అడిగాను. ఎందుకా సోదరా! మంచికో చెడుకో జూలై 25కి ఆమె ఈ గణతంత్ర దేశపు వైభవానికి ప్రతినిధిగా నిలవబోతున్నారు. ఈ మురికంతా ఇప్పుడు తవ్విపోసి కాబోయే మీ రాష్ట్రపతికి అపకీర్తి ఎలా తెచ్చి పెట్టగలవు?’’అని కూడా అన్నాడాయన.


ఇప్పుడు కోవింద్‌ అభ్యర్థిత్వం గురించి చెబుతున్న అంశాలు నాడు ప్రతిభా పాటిల్‌ అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తూ కాంగ్రెస్‌ పార్టీ చెప్పిన అంశాలతో పోల్చదగినవిగా కనిపిస్తున్నాయి. ఆమెకు పార్లమెంటు సభ్యురాలిగా సుదీర్ఘ అనుభవం ఉందన్నారు. గవర్నర్‌గా అనుభవం ఉందని చెప్పారు. మొదటి మహిళా రాష్ట్రపతి అని చెప్పారు. ఇంతకు ముందు పనిచేసిన వారికంటే ఎక్కువా కాదు తక్కువా కాదని వాదించారు. ఎలక్టొరల్‌ కాలేజ్‌లో సంఖ్య ప్రధానం కాబట్టి ఆనాడు యూపీఏ పక్షాలన్నీ కాంగ్రెస్‌ వెంటే విన్నాయి. అయితే ఈ కాలమిస్ట్‌ సహా చాలామంది విమర్శకులు నామమాత్రపుదే అయినా ఆ అత్యున్నత పదవికి సంబంధించిన అంశాన్ని తేలికగా తీసుకోవద్దని, అలాంటి నిర్ణయంతో పర్యవసానాలను ఎదుర్కొనవలసి ఉంటుందని హెచ్చరించడం జరిగింది. అయినా ఒక అవాంఛనీయ సంప్రదాయాన్ని నెలకొల్పారు. ఇప్పుడు అదే పునరావృతం కావడం చూస్తున్నాం.


రాజకీయానుభవం అనే కోణం నుంచి చూస్తే కోవింద్‌ ప్రతిభా పాటిల్‌ కంటే కొంచెం వెనుకపడి ఉండవచ్చు. అయితే విద్యా విషయంలో ఆయన ఆమె కంటే ఉత్తమ అర్హతలే కలిగి ఉన్నారు. న్యాయ పరిజ్ఞానంలో మంచి పేరే ఉంది. వ్యక్తిగత, కుటుంబ జీవితాలు కూడా మచ్చలేనివిగానే ఉన్నాయి. ఆయన కరిక్యులమ్‌ వీటా (సీవీ, వ్యక్తిగత వివరాలు)ను బట్టి చూస్తే అ«ధ్యక్ష పదవికి ఆయనను అనర్హుడని ఎవరూ వాదించలేరు. కానీ ఒక ప్రశ్న అడగవలసిన అవసరం ఉంది: ఏ వ్యక్తికైనా దేశంలో అత్యున్నత పదవికి అర్హుడని చెప్పడానికి గొప్ప కరిక్యులమ్‌ వీటా ఒక్కటే సరిపోతుందా? అది గొప్పగా లేకుంటే వారు అనర్హులవుతారా?


గతం మీద విహంగ వీక్షణం

భారత రాష్ట్రపతుల పరంపరను చూస్తే వారి ఎంపికలో విద్యార్హతలు, సామాజిక, రాజకీయ నేపథ్యాలను పట్టించుకున్నట్టు కానరాదు. మేధాసంపన్నుడు డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను రాష్ట్రపతి పదవికి ఎంపిక చేసుకున్నాం. అలాగే దాదాపు నిరక్షరాస్యుడైన జ్ఞానీ జైల్‌సింగ్‌ను కూడా ఆ పదవికి పంపించాం. డాక్టర్‌ రాజేంద్రప్రసాద్, ప్రణబ్‌ ముఖర్జీ, ఆర్‌. వెంకటరామన్‌ వంటి రాజ కీయ దిగ్గజాలనీ, అలాంటి వారే నీలం సంజీవరెడ్డి, శంకర్‌దయాళ్‌ శర్మలను, అంతంతమాత్రం అనిపించిన వీవీ గిరిని కూడా రాష్ట్రపతి పదవిలో చూశాం. విశేష గౌరవ ప్రతిష్టలు కలిగి, ముస్లిం వర్గం నుంచి వచ్చిన డాక్టర్‌ జకీర్‌హుస్సేన్‌తో పాటు, ఏమాత్రం గుర్తుంచుకోవలసిన అవసరం లేని ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌లను కూడా ఆ అత్యున్నత పదవిలో ప్రతిష్టించుకున్నాం.


విదేశీ వ్యవహారాల శాఖలో పనిచేసిన కేఆర్‌ నారాయణన్, శాస్త్ర, సాంకేతిక రంగం నుంచి వచ్చిన మరో ఉన్నతోద్యోగి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌కలాంలను కూడా రాష్ట్రపతి పదవికి పంపించాం. ఆ పదవిని అలకరించిన వారికి సంబంధించి గుర్తు చేసుకోదగిన చక్కని ఉదాహరణలు ఉన్నాయి. అలాగే ఆ అత్యున్నత పదవి గౌరవ ప్రతిష్టలను నిలబెట్టేందుకు అవసరమైన రీతిలో వివాదరహితంగా వ్యవహరించడంలో ఎవరూ విఫలం కాలేదని సగర్వంగా కూడా చెప్పవచ్చు.


కొన్ని మినహాయింపులు

అయితే ఇందుకు కొన్ని చెప్పుకోదగిన మినహాయింపులు మాత్రం ఉన్నాయి: అత్యవసర పరిస్థితి వి«ధించినప్పుడు ఇందిరాగాంధీ జారీ చేసిన ఆర్డినెన్స్‌ను ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌ చదవకుండానే సంతకం చేశారు. ఇంకొక ఉదాహరణ– జ్ఞానీ జైల్‌సింగ్‌ పదవీకాలం చివరి అంకంలో నాటి ప్రధాని రాజీవ్‌గాంధీకి వ్యతిరేకంగా కుట్రలు చేయడానికి రాష్ట్రపతి భవన్‌ను కేంద్రంగా అనుమతిం చడం. అదే సమయంలో ఒక అత్యంత సాధారణ పౌరుడు కూడా ఆ అత్యున్నత పదవికి ఎదగవచ్చునని ఆయనతోనే వెల్లడైంది.


కలకాలం గుర్తు పెట్టుకోవలసిన రాష్ట్రపతులు, ఎంతమాత్రం గుర్తుంచుకోనవసరంలేని కొందరు రాష్ట్రపతుల హయాముల మధ్య తేడాను ప్రత్యేకంగా పరీక్షిస్తే వాటి నడుమ చాలా వైవిధ్యాన్ని గమనించవచ్చు. ఇందుకోసం మనం మరీ యాభయ్యో దశకం, లేదా అరవయ్యో దశకం వరకూ కూడా వెళ్లనవసరం లేదు. కాంగ్రెస్‌ పార్టీలో అనుభవజ్ఞులను పాతరేయడానికీ, పార్టీని చీల్చడానికీ ఇందిరాగాంధీ ఆడిన చదరంగంలో పావుగా ఉపయోగపడ్డ వీవీ గిరిని ఇప్పుడు యాభయ్యో పడిలో ఉన్నవారు ఎవరూ గుర్తు చేసుకోవడానికి ఇష్టపడరు. ఆయన పూర్తికాలం ఆ పదవిలో కొనసాగారు కూడా. కానీ కొన్ని చేదువాస్తవాల కారణంగా ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌ను మాత్రం మనం గుర్తు చేసుకుంటాం. అద్భుత వ్యంగ్య చిత్రకారుడు అబూ అబ్రహాం వేసిన కార్టూన్‌ ఫక్రుద్దీన్‌ అంటే ఏమిటో మా తరానికి బాగా అవగాహనకు తెచ్చింది. ఆ వ్యంగ్య చిత్రంలో గుండెల నిండా రోమాలతో స్నానాల తొట్టెలో ఉన్న ఫక్రుద్దీన్‌ సంతకం చేసిన ఒక పత్రాన్నీ, కలాన్నీ తన వద్ద పనిచేసే సిబ్బందిలో ఒకరికి తిరిగి ఇస్తూ ఉంటారు. అప్పుడే ఒక మాట కూడా ఆయన అంటున్నట్టు అబూ చిత్రిం చారు, ఆ మాట: ‘ఇంకా ఆర్డినెన్స్‌లు ఉంటే కొద్దిసేపు వేచి ఉండమని చెప్పు!’.


ఎగరేసిన కీర్తిపతాకాలు

మరోపక్క గుర్తుండిపోయే విధంగా వ్యవహరించిన వారిలో అబ్దుల్‌కలామ్‌ ఉంటారు. బిహార్‌ విషయంలో ఆయన జోక్యం, కొలీజియం ఉన్నప్పటికీ న్యాయమూర్తుల నియామకాలలో జరిగిన మతలబుల విషయంలో కలగచేసుకోవడం గుర్తుండే విషయాలు. అలాగే గుజరాత్‌ అల్లర్ల అనంతర వాతావరణం మీద, ఆపరేషన్‌ పరాక్రమ్‌ తరువాత పరిస్థితుల మీద కలామ్‌ ప్రభావం పరోక్షంగా ఎంతో ఉంది. రోజువారీ వేతనాలతో నడిచినట్టు, అస్థిర ప్రభుత్వాలు ఏర్పడుతున్న కాలంలో కూడా రాష్ట్రపతి వ్యవస్థ ఎంత సమర్థంగా వ్యవహరించవచ్చునో చూపి నమ్మకం కలిగించిన వారు ఆర్‌. వెంకట్రామన్, శంకర్‌దయాళ్‌ శర్మ. రాష్ట్రపతి పదవికి ఉండే మే«ధోపరమైన, నైతికమైన స్థాయిని తిరిగి నిలబెట్టిన వారు కేఆర్‌ నారాయణన్‌. ఆ విషయంలో కేఆర్‌  రాధాకృష్ణన్‌ హయాంను గుర్తుకు తెచ్చారు.




కృతజ్ఞతాభావంతో, ప్రేమతో మనం గుర్తు చేసుకున్న రాష్ట్రపతుల హయాంలకు, మనం మరచిపోయిన రాష్ట్రపతులకు, మరచిపోవడమే మంచి దనిపించేవారి మధ్య ఉన్న తేడా ఏమిటి? మన రాష్ట్రపతి పదవి చరిత్రను పరిశీలిస్తే విద్యార్హతలకీ, రాజకీయ నేపథ్యానికీ, కులమతాలకీ, సామాజిక నేపథ్యానికి సంబంధం లేదని తెలుస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, రాష్ట్రపతి పదవిని చేపట్టబోయే వారి పనితీరు, ముద్రలను కరిక్యులమ్‌ వీటా చెప్పలేదు. ఇంకొకటి కూడా ఉంది, అది ఊహకి అతీతమైన లక్షణం: అదే స్థాయి. కలామ్, వెంకట్రామన్, నారాయణన్‌లకు అలాంటి స్థాయి ఉంది. వీవీ గిరి, ఫక్రుద్దీన్, ప్రతిభా పాటిల్‌కు అలాంటి స్థాయి లేదు.


కోవింద్‌ గురించి ఇదే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలం ఉంటే కనక ఎంతటి ఉన్నతి పదవిలోకైనా వెళ్లవచ్చు. అయితే కరిక్యులమ్‌ వీటా ఉన్నతమైనదా, కాదా అన్న విషయంతో నిమిత్తం లేకుండా ఆ అత్యున్నత పదవికి తగిన స్థాయిని పెంపొందించుకోవడమే ఎవరికైనా పెద్ద సవాలు. మన రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవి రాష్ట్రాల గవర్నర్‌ పదవి కంటే కూడా అప్రాధాన్యమైనది, నామమాత్రమైనది. రాష్ట్రపతి పాలన విధించిన సమయంలో అయినా గవర్నర్‌ వాస్తవంగా కొన్ని అధికారాలను చలాయించగలుగుతారు. రాజ్యాంగ నిర్మాతలు రాష్ట్రపతి హోదాను గణతంత్ర రాజ్యానికి ప్రతీకగా, వైభవానికి చిహ్నంగా భావించారు.అయితే కోవింద్‌ గురించి ముందే మనం ఒక అభిప్రాయానికి రాకూడదు. ఏమో, ఆయన సంశయవాదులందరినీ విస్మయపరుస్తారేమో!


తాజాకలం: జ్ఞానీ జైల్‌సింగ్‌ గురించి అంతగా నచ్చని విషయాలు కొన్ని ముచ్చటించుకున్న తరువాత, ఆయన తెలివితేటలు ఎలాంటివో సరసత, రాజకీయ చతురత ఎంతటివో చెప్పే ఒక ఘట్టాన్ని గుర్తు చేసుకోవడం కూడా న్యాయంగా ఉంటుంది. 1987 ఫిబ్రవరిలో నాటి పాకిస్తాన్‌ అధ్యక్షుడు జియా ఉల్‌హక్‌ క్రికెట్‌ మ్యాచ్‌ వీక్షించే మిషతో భారత్‌కు వచ్చారు. ఆ సందర్భంలోనే జైల్‌సింగ్‌ను ఆయన కలుసుకున్నారు. అప్పుడే, ‘తనకూ ఒక ప్రధానమంత్రి ఉండేవారని (జునేజో), ఆయన రాష్ట్రపతి జైల్‌సింగ్‌ వలెనే ఉత్సవ విగ్రహం వంటివార’ంటూ పంజాబీలో జియా ఒక జోక్‌ పేల్చారు. ‘అయితే చిన్న తేడా ఉంది జియా గారూ!’ అంటూ జైల్‌సింగ్, ‘నా పదవీకాలం ఎప్పుడు ముగుస్తుందో నాకు కచ్చితంగా తెలుసు. కానీ మీరు ఎంతకాలం ఉండదలుచుకుంటే అంతకాలం పదవిలోనే కొనసాగవచ్చు’ అన్నారు. జైల్‌సింగ్‌ ఐదేళ్లు ముగియగానే పదవీవిరమణ చేశారు. తరువాత జియా ఒక సంవత్సరం వరకు పదవిలో ఉన్నారు–సి–130తో ఆయన ఖర్మ కాలేదాకా.


శేఖర్‌ గుప్తా

twitter@shekargupta

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top