
రాజకీయ ఎల్నినొ!
మహా గురువులకు, బాబాలకు ఈ అవార్డులు తుచ్ఛములు కావా అని కొందరి వాదన.
అక్షర తూణీరం
మహా గురువులకు, బాబాలకు ఈ అవార్డులు తుచ్ఛములు కావా అని కొందరి వాదన. ఎవరికివ్వాలో, ఎవరికివ్వడం సముచితమో ఏలిన వారికి తెలియక కాదు. పోనీ, ఇంతా చేసి ఇవన్నీ కిరీటాల్లా తగిలించుకోవడానికి కూడా లేదు. అందుకే ఒక గ్రహీత నిరాశగా అన్నాడు- ‘‘ఎందుకండీ ఇది! చచ్చే చావు చచ్చి తెచ్చుకున్నా గానీ ఏం లాభం? ఇప్పుడొకసారి, నా పేరుతో వస్తుంది. ఇహ మళ్లీ అప్పుడే కదా. చూసుకోవడానికి ఉండనే ఉండదు’’ అని. ఇదొక రకం ఎల్నినొ.
ఈమధ్య ‘ఎలినొవ’ అనే మాట తెగ వినిపిస్తోంది. ఆ మాట ‘ఎల్నినొ’ అనే ఫ్రెంచ్ పదం. చివరి అక్షరం ఏ భాషలో ఉన్నా అది సెలైంట్. అనగా ఏమిటో తెలుసుకుని తర్వాత ముం దుకు వెళదాం. సౌత్ ఆఫ్రికా దగ్గర పసిఫిక్ మహా సము ద్రంలో ఒక్కోసారి నీరు వేడెక్కుతుంది. సముద్రం మీద దాని వల్ల వేడిగాలులు పుడతాయి. ఆ గాలులు మన దేశం వైపు వస్తాయి. రుతుపవనాలు వర్షించ డానికి ఈ వేడిగాలులు అనుకూలం కాదు. దాంతో మబ్బులు కురవవు. అనావృష్టి ఏర్పడుతుంది. ఈ ప్రకృతి ప్రవృత్తిని ‘క్రైస్ట్ ఫీవర్’ అని కూడా శాస్త్ర వేత్తలు పిలుచుకుంటారు. ఒక్కోసారి సముద్రం ఒక్కసారి చల్లబడిపోతుంది. అప్పుడు అతి శీతల గాలులు భారతదేశాన్ని ఆవరిస్తాయి. దాని వల్ల అతి వృష్టి సంభవిస్తుంది.
అయితే- వర్షాభావం మీద, ఎల్నినొ మీద ఇంతటి ‘సుదీర్ఘ సుత్తి’ ఇప్పుడు అవసరమా అంటే, అవసరమే! మన రాజకీయాలు కూడా ఎల్నినొ లాగే దేశం మీద ప్రభావాలు చూపుతున్నాయి. ఎక్కడో ఏదో జరుగుతుంది. మరెక్కడో దాని తాలూకు ప్రతి స్పందనలు తీవ్రం నుంచి అతి తీవ్రంగా, భారీ నుంచి అతి భారీగా ఉంటాయి. పసిఫిక్ వేడెక్కితే పశ్చిమ గోదావరిలో వర్షాలు పడకపోవడమేమిటి? ఇదే ప్రకృతి వైపరీత్యం. రాజకీయ వైపరీత్యం కూడా ఇలాగే ఉంటుంది. ఎక్కడా ఏ కదలికా లేకుండా స్తబ్దుగా కాలం కదిలి పోతున్నప్పుడు కొందరికి ఆ స్తబ్దత మీద ఒక రాయి వేయాలనిపిస్తుంది. తర్వాత నలుగురికీ అదే కోరిక పుడుతుంది. ఇహ ఆపైన రాయి దొరికిన వాడల్లా ఉద్యమ భాగస్వామి అయిపోతాడు.
మొదటివాడు తీగ లాగితే డొంకంతా కదిలి, డొంకలోని మామిడిపళ్లన్నీ రాలి పడతాయని ఆశిస్తాడు. అసలు చివరివాడికి రాయి వేయడానికి కారణమేమిటో కూడా తెలియదు. మరీ పోను పోను మన రాజకీయ పక్షాల ఆలోచనలు నీటి కంటే పల్చనైపోతున్నాయి. ‘పవర్‌లో ఉన్న వారు మాత్రమే సమాజ బాగోగులు గురించి ఆలోచించాలి. రికామీ వర్గం కేవలం రాళ్లు వేయడానికే అంకితం కావాలి’ అనే భావన లో రోజులు నడుస్తున్నాయి. ‘కొండకి వెంట్రుక కడదాం. వస్తే కొండ వచ్చును. పోయిన కేశము పోవును’ అనే రిస్క్ లేని ఆలోచనలతో రాజకీయం నడుస్తోంది.
పవర్ పాలిటిక్స్‌కీ క్రైస్ట్ ఫీవర్ అనే ఎల్నినొ వర్తిస్తుంది. ప్రభుత్వం దగ్గర మూడు సమ్మోహ నాస్త్రాలుంటాయి. అవి పద్మ అవార్డులు. వాటిని వారికి నచ్చిన వారికి పంచి, శాశ్వతంగా ఆకట్టుకుంటారని - ఆశించి రాని కొందరు అంటూ ఉంటారు. కొంత నిజం ఉన్నా ఉండవచ్చని తటస్తులు వాపోతూంటారు. విశ్వవిఖ్యాతులు, దైవాంశ సంభూతులు అయిన మహా గురువులకు, బాబాలకు ఈ అవార్డులు తుచ్ఛములు కావా అని కొందరి వాదన. ఎవరికివ్వాలో, ఎవరికివ్వడం సముచితమో ఏలిన వారికి తెలియక కాదు. పోనీ, ఇంతా చేసి ఇవన్నీ కిరీటాల్లా తగిలించుకోవడానికి కూడా లేదు. అందుకే ఒక గ్రహీత నిరాశగా అన్నాడు- ‘‘ఎందుకండీ ఇది! చచ్చే చావు చచ్చి తెచ్చుకున్నా గానీ ఏం లాభం? ఇప్పుడొకసారి, నా పేరుతో వస్తుంది. ఇహ మళ్లీ అప్పుడే కదా. చూసుకోవడానికి ఉండనే ఉండదు’’ అని. ఇదొక రకం ఎల్నినొ.
శ్రీరమణ, (వ్యాసకర్త ప్రముఖ కథకుడు)