తాజా పుస్తకాలు

తాజా పుస్తకాలు - Sakshi


ఉద్యమాలలో భారత మహిళలు

 సింహం తన చరిత్ర తాను రాసుకునే వరకూ వేటగాడి చరిత్రే చెలామణి అవుతుందని సామెత. మనం ఏ పని చేసినా మగదృష్టితోనే చేస్తాం. ఉద్యమాల గాథలైనా విజేతల కథలైనా మగవారి వల్ల మగవారి చేత మగవారి కొరకు. స్త్రీలు ఏం చేసినా లెక్కలోకి రాదు. స్త్రీల చేతుల తోడు లేకుండా చప్పట్లు మోగగలవా? ఆదివాసీ ఉద్యమాల్లో, స్వాతంత్య్రోద్యమాల్లో పని చేసిన స్త్రీల గురించి రాయరు చాలాసార్లు. ఆ మొత్తం వెలితిని పూడ్చే ప్రయత్నం ఈ పుస్తకం. వి.గార్గి ఇంగ్లిష్‌లో రాసిన ‘హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఉమెన్ ఇన్ మూవ్‌మెంట్’ పుస్తకాన్ని తెలుగులో మహిళామార్గం పత్రికలో సీరియలైజ్ చేసి (అనువాదం: మధుమాలతి, సూరి) ఇప్పుడు పుస్తకంగా తీసుకువచ్చారు. సంస్కరణోద్యమాల నుంచి మొదలుపెట్టి పర్యావరణ ఉద్యమాల వరకు పిడికిలి బిగించిన స్త్రీలెందరో ఇందులో కనపడతారు. విలువైన పుస్తకం.

 మహిళ లేని చరిత్ర లేదు- వి.గార్గి; వెల: రూ.120; ప్రతులకు: అన్ని ముఖ్య పుస్తక కేంద్రాలు

 

 ఉడ్‌హౌస్ పుస్తకాలు రెండు

 తెలుగులో ఉడ్‌హౌస్‌ని అనుదించి అందించడంలో గబ్బిట కృష్ణమోహన్ సఫలీకృతులయ్యారు. ఆయన అనువాదం చేసిన ఉడ్‌హౌస్ కథలు ‘సరదాగా కాసేపు’ పేరుతో వెలువడి పాఠకాదరణ పొందాయి. ఆ ఉత్సాహంతో ఆయన మరి రెండు పుస్తకాలు తీసుకొచ్చారు. ఉడ్‌హౌస్ రాసిన ‘ది స్టోరీ ఆఫ్ విలియమ్’, ‘ది మేన్ హూ గేవ్ అప్ స్మోకింగ్’, ‘బిగ్ బిజినెస్’ తదితర పది కథలను ‘సరదాగా మరి కాసేపు’ పేరుతోనూ, ఉడ్‌హౌస్ నవల ‘ఫ్రోజెన్ ఎసెట్స్’ను ‘లంకె బిందెలు’ పేరుతోనూ అనువాదం చేసి అందించారు. రెంటిలోనూ ఉడ్‌హౌస్ పాత్రలను స్థానికీకరణం చేసి రాయడం ఒక విధంగా మంచిది ఒక విధంగా కాదు. మంచి ఏమిటంటే మూలం మరీ దగ్గరైపోవడం. చెడ్డ- మూలం మరీ దూరానికి పోవడం. హాస్యాభిమానుల పుస్తకాలు ఇవి.

 సరదాగా మరి కాసేపు; వెల: రూ.140; లంకెబిందెలు; వెల: రూ.150;

 విశాలాంధ్ర ప్రచురణ; ప్రతులకు- విశాలాంధ్ర


 

 ఎన్నికల చట్టాలపై సమగ్ర సమాచారం

 ఓటు వేయడం ఇవాళ ప్రతి ఒక్కరి బాధ్యతగా మారింది. ఎవరికి ఓటు వేయాలనే అంశంపై చైతన్యం తెచ్చుకోవడం కనిపిస్తూ ఉంది. అయితే ఒకరికి ఓటు వేసే స్థితి నుంచి మనమే అభ్యర్థిగా మారే స్థితికి ఎదగాలంటే (పార్టీల్లో ఉండాల్సిన నియమం లేదు. ఇండిపెండెంట్‌గా అయినా సరే) ఏం చేయాలో చాలామందికి తెలియదు. ఔత్సాహిక రాజకీయ నేతలకు కూడా తెలియదు. న్యాయవాదులు వడ్లమాని వెంకటరమణ, వడ్లమాని నాగేష్‌శర్మలు ఈ అవసరం కోసమే ప్రజా ప్రాతినిధ్యచట్టం అంతటిని తెలుగులోకి అనువాదం చేశారు.  ఎలక్షన్ ప్రక్రియలోని అన్ని స్థాయులను విశదపరిచారు. అభ్యర్థి అర్హతలు, నామినేషన్ ఎలా వేయాలి, కట్టవలసిన డిపాజిట్లు, ఏజెంట్లు, బూత్‌లు-వాటి నిర్వహణ, రిటర్నింగ్ ఆఫీసర్లు, వారి డ్యూటీలు విపులంగా చర్చించారు. దీంతో పాటు సమాచార హక్కు చట్టం, సొసైటీల చట్టం తదితర అంశాలు కూడా ఉన్నాయి.

 ఎన్నికల్లో గెలవండి- వెల: రూ.200; ప్రతులకు: 9912240509

 

పల్లెను మింగిన పెట్టుబడి

 పల్లెలు అభివృద్ధి చెందాలంటే నిధులు రావాలి. నిధులు రావాలంటే పెట్టుబడి రావాలి. పెట్టుబడి వస్తే? వస్తే ఏమవుతుందో పల్లెలు ఏమవుతున్నాయో వృత్తులేమవుతున్నాయో వ్యవసాయం ఏమవుతున్నదో గిరిజనులు ఏమవుతున్నారో మత్స్యకారులు ఏమవుతున్నారో ఐదేళ్ల పాటు పల్లెలు తిరిగి పరిశోధించి రాసిన పుస్తకం ఇది. చాలామంది వ్యవసాయాన్ని వదిలేయడం మనకు అభివృద్ధి. వలస వచ్చి పట్టణాల్లో మురికివాడలను పెంచడమూ అభివృద్ధే. స్థానిక వ్యవస్థలు బలపడాల్సింది పోయి అంతరాలు పెరిగి నడుం విరుచుకుంటూ ఉండటం పల్లెల్లో వర్తమాన దృశ్యం. దీనిని చూపి మేల్కొలిపే ప్రయత్నం చేశారు పుస్తక రచయిత ఎస్.ఎ.విద్యాసాగర్. పాత వ్యవస్థ మంచిదికాదు మారాలి అనుకున్నాం గతంలో. కొత్త వ్యవస్థ బాగున్నదా? భవిష్యత్తు క్షేమంగా అనిపిస్తున్నదా? ఆ అవగాహన కలిగించే పుస్తకమే ఇది.

 పల్లెను మింగిన పెట్టుబడి - ఎస్.ఎ. విద్యాసాగర్; వెల: రూ. 250;

 ప్రతులకు- 9010204633, 9492340651

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top