బెడిసికొట్టిన బీజేపీ వ్యూహం

బెడిసికొట్టిన బీజేపీ వ్యూహం - Sakshi


జాతిహితం

 

 బీజేపీ ప్రచారం భయంగొలిపేటంత అధికసంఖ్యాక వాదంతో సాగింది. ముస్లింలు తమను పాకిస్తాన్‌తో ముడిపెట్టడాన్ని అసహ్యించుకుంటారు. ఆ అవమానాన్నే వారు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో ఈ ఎన్నికలను వారు తమ భవితను మెరుగుపరుచుకునే అవకాశంగా చూడలేకపోయారు. భయం నేలమాళిగలోకి వెళ్లిపోయారు. ఎవరు బీజేపీని ఓడిస్తారనిపిస్తే వారికి ఓటు చేశారు. ఒవైసీ తుడిచిపెట్టుకుపోవడం దాని పర్యవసానమే. ముస్లింలు తిరిగి తమ ‘‘లౌకికవాద’’, హిందూ పరిరక్షకులను కౌగిలించుకోడానికి పరుగులు తీస్తున్నారు.

 

 మైనారిటీ లేదా ముస్లిం ఓటు బ్యాంకుపై బిహార్ ఎన్నికలు మరోమారు రాజకీయ చర్చకు తెరదీశాయి. ఆ చర్చలోకి వెళ్లడానికి ముందు ఒక ముఖ్య విషయాన్ని గమనించాలి. మొహ్మద్ ఆలీ జిన్నా పాకిస్తాన్‌కు వెళ్లిపోయాక భారత ముస్లింలు మరే ముస్లిం నేతపైనా నమ్మక ముంచలేదు. వారెప్పుడూ ఎవరో ఒక హిందూ నేతనే నమ్మారు. వారు ఏదో ఒక్క పార్టీకి చెందినవారే కావాల్సిన అవసరమూ లేకపోయింది.

 నాలుగు దశాబ్దాలు వారు ఇందిరా గాంధీ కుటుంబాన్ని నమ్మారు. ఆ తర్వాత, షా బానో కేసు నుంచి శిలాన్యాస్ వరకు రాజీవ్ గాంధీ వేసిన తప్పుడటుగుల పరంపర తో.. దేశ ప్రధాన భూభాగంలోని ముస్లింలు వీపీ సింగ్, ములాయంసింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్‌లవైపు మొగ్గారు. మాయావతి వారి ఎంపిక అవకాశాలను మరింత విస్తరింప జేశారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, రాజస్థాన్, అస్సాం తదితర రాష్ట్రాల్లోనైతే ముస్లింలు హిందువుల నేతృత్వంలోని కాంగ్రెస్‌కే అంటిపెట్టుకున్నారు.


 


అయితే, పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాలూ, ఆ తదుపరి మమతా బెనర్జీల వలే మరిన్ని ప్రత్యామ్నాయాలు ఆవిర్భవించినప్పుడు వారు తమ విధేయతను వారికి బదలాయించారు. అయితే అప్పుడూ వారు హిందూ నాయకులపైనే విశ్వాసముంచారు. దాదాపు ఈ పార్టీల నేతలంతా - బహుశా వామపక్షాలను మినహాయిస్తే - హిందూ మతాన్ని అనుసరించేవారు, నమ్మేవారు. బీజేపీ/ ఆర్‌ఎస్‌ఎస్ ‘‘మౌలానా ములాయం’’గా ఎగతాళి చేసే ములాయంసింగ్ హనుమాన్ భక్తుడినని సగర్వంగా చెప్పుకుంటారు. ఆయన రక్షణమంత్రిగా (1996-98 యునెటైడ్ ఫ్రంట్ ప్రభుత్వం) ఉన్నప్పటి ఢిల్లీ కృష్ణమీనన్ రోడ్డులోని ఆయన అధికారిక నివాసంలో ఆకర్షణీయమైన చిన్న హనుమాన్ గుడిని కూడా నిర్మించారు. జైల్లో ఉండగా తాను తన ఇష్ట దైవ మైన శివుడ్ని ఎలా ప్రార్థించిందీ, స్వేచ్ఛ లభించినందుకుగానూ మాంసాహారాన్ని ఎలా విసర్జించినదీ లాలూ చెబుతారు.


ముస్లిం నేతల పట్ల విముఖత

 కాంగ్రెస్, ముస్లిం నేతలను తయారుచేయలేదని తరచుగా విమర్శలకు గురౌతుంటుంది. కానీ  మౌలానా అబుల్ కలాం ఆజాద్ నుంచి అహ్మద్ పటేల్, సల్మాన్ ఖుర్షీద్‌ల వరకు వాస్తవానికి అది ఆ ప్రయత్నాలు చేసింది. తమ కనుసన్నల్లోని డాక్టర్ జాకీర్ హుస్సేన్, ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్‌లను  రాష్ట్రపతి భవన్‌కు కూడా పంపింది. అయితే ఆజాద్‌సహా వారిలో ఎవరినీ భారత ముస్లింలు తమ నాయకునిగా చూడలేదు. ఈ వాదనను మనం మరింతగా పొడిగించవచ్చు.


 


బీజేపీ సైతం ఏపీజే అబ్దుల్ కలాంను తన ప్రధాన స్రవంతి ముస్లిం హీరోగా పరిగణించింది. ఆయన అత్యంత జనాదరణ కలిగిన రాష్ట్రపతి అయ్యారు. కానీ ముస్లింలకు ఉత్తేజాన్నిచ్చే నాయకునిగా కంటే హిందువులకు ఆదర్శప్రాయుడైన నేతగానే మిగిలిపోయారు. ఆయన మరణించినప్పుడు దాదాపు ఏ ఒక్క మసీదూ ప్రత్యేక ప్రార్థనలు చేయలేదనే విషయాన్ని మితవాద వ్యాఖ్యాతలు, ఇంటర్నెట్ వాగుడుకాయలు కూడా అపనమ్మకంతో (లేదా ఆనందంతో?) గమనించారు. అత్యధిక మెజారిటీ ప్రజలకు ఆయన వీణ వాయించగలిగిన, సంస్కృత శ్లోకాలను వల్లించగలిగిన గొప్ప భారత నేత, జాతీయవాది (‘‘ముస్లిం అయినప్పటికీ’’). పిల్లలకు అన్ని మంచి మాటలూ చెప్పడమే కాదు, వారిచేత తిరిగి పలికించారు కూడా. కానీ ముస్లింలకు మాత్రం ఆయన నేత కాదు.

 


భారత ముస్లింలు ఆజాద్, కలాం లేదా భావజాలపరంగా వారికి పూర్తి భిన్న ధ్రువంలోని జకీర్ నాయక్ వరకు అందరినీ తిరస్కరించడం మన రాజకీయాల ప్రత్యేక లక్షణం. (ముంబైకు చెందిన డాక్టర్ జకీర్ నాయక్ వామపక్షవాది నుంచి సువార్తా బోధకునిగా మారి ప్రపంచ ఖ్యాతినార్జించారు.) బీజేపీ అందుకు ‘‘సంతృప్తిపరచే’’ విధానాలను తప్పు పడుతుంది. కానీ అది వాస్తవాల పరీక్షకు నిలవ లేదు. ముస్లింలు  దళితులతో సమాన స్థాయిలో ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్నారనడానికి ఆధారం అవసరమని కాదుగానీ... సచార్ కమిటీ నివేదిక వెల్లడి చేసిందదే. రాజకీయంగా, ప్రభుత్వాధికార  యంత్రాంగం పరంగా వారు దళితులకన్నా కూడా తక్కువ సాధికారతను కలిగి ఉన్నారు. వారి సంరక్షకులుగా నటించిన అర్జున్‌సింగ్ లాంటి నేతలు వారిని వాడుకుని, మరింత అంధకారంలోకి నెట్టేశారు. ఈ పరిస్థితిని మార్చడానికి కాంగ్రెస్, ములాయం, లాలూ, సీపీఎం, మమతా చేసిందేమీ లేదు. 1960ల మధ్యలో ఉత్తరప్రదేశ్‌లో ముస్లిం మజ్లిస్ పార్టీ ఏర్పడింది. నెహ్రూ/శాస్త్రి తదుపరి కాలంలోని కాంగ్రెస్ క్షీణదశలో ఉండగా అది కొన్ని ఓట్లు సంపాదించింది. కానీ త్వరలోనే అది ముస్లింల తిరస్కారానికి గురై, సోషలిస్టు శక్తుల్లో కలిసిపోయింది.


‘‘లౌకికవాద’’ పరిరక్షకులకు సవాలు

 హైదరాబాద్‌కు చెందిన ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ, అస్సాంలోని ఏఐయూడీఎఫ్ నేత బద్రుద్దీన్ అజ్మల్  ముస్లింలకు హిందూ నేతలు నేతృత్వం వహించే ఈ ధోరణిని సవాలు చేయడం కొత్త పరిణామం. వారు తమ భౌగోళిక లేదా జాతిపరమైన ప్రాంతీయ పరిధులకు పరిమితమైనంత కాలం వారిని ప్రత్యేకించి పెద్దగా పట్టించుకున్నది లేదు. కానీ ఒవైసీ మహారాష్ట్ర శాసనసభలో రెండు స్థానాలను సాధించడం ఈ ధోరణిలోని మార్పును సూచించింది.  2014 లోక్‌సభ ఎన్నికల్లో అస్సాంలోని ముస్లింలలో చాలా పెద్ద భాగం అజ్మల్‌కు ఓటు చేయడంతో ఆయన ఆ ఎన్నికల్లో అద్భుత ఫలితాలను సాధించారు. తద్వారా ఆశ్చర్యకరంగా బీజేపీ అక్కడి 14 స్థానాల్లో 7 సాధించగా, కాంగ్రెస్ 3 స్థానాలకు పరిమితమై పూర్తిగా దెబ్బతినిపోయింది.


 


భారత ముస్లింలు ఆరు దశాబ్దాల ఈ దోరణిని మార్చుకుని ఇప్పుడు తమ ‘‘సొంత’’ నాయకుల కోసం అన్వేషిస్తున్నారా? మీరు మాకు ఓటు చేయండి బీజేపీ/ఆర్‌ఎస్‌ఎస్‌ల నుంచి మిమ్మల్ని కాపాడటానికి ప్రయత్నిస్తామంటూ తమ భయాన్ని వాడుకోవడం తప్ప, ‘‘లౌకికవాద’’ పార్టీలు  తమకు చేసిందేమీ లేదనే వాస్తవాన్ని వారు  ఇప్పుడు గ్రహించారా? ఇది భౌతికమైన మనుగడ అనే కనీస విధానాల నుంచి ముస్లింలు బయటపడటం అవుతుందా? ఒక విధంగా అది, మీరు పోరాడేది హిందువులతోనా లేక పేదరికం, అవకాశాల లేమితోనా? అంటూ నరేంద్ర మోదీ వారికి 2014లో ఇచ్చిన సందేశమే అవుతుంది. వారు అప్పుడే బీజేపీకి ఓటు చేయడానికి సిద్ధంగా లేరు. కానీ తమను తక్కువగా చూసి, ఎప్పటికీ నమ్మకంగా పడి ఉంటారనుకున్న వారిని కొంత మేరకు విడిచిపెట్టేస్తున్నారు.


ఒవైసీ, అజ్మల్ ఇద్దరూ కేవలం ముస్లింల మనుగడ గురించే గాక, ఉద్యోగాలు,సాధికారత అంటూ మరింత ఆధునికమైన భాషలో మాట్లాడారు. ముస్లిం ఓటర్లు భయం నుంచి సాధికారత వైపు మొగ్గుతున్నారు. ఈ మార్పువల్ల ముందుగా నష్టపోయేది కాంగ్రెసే.


ముస్లింలను భయపెట్టిన ప్రచారం

 ఈ ముందస్తు అంచనాతోనే బీజేపీ అస్సాంను పక్వానికొచ్చిన ఫలంగా భావించింది. అస్సాం ప్రజలను రెండు శిబిరాలుగా చీల్చి, అజ్మల్ ముస్లింలోని అత్యధికుల ఓట్లను రాబట్టుకునేలా చే యడం ద్వారా కాంగ్రెస్‌ను కూలదోయడమనేది దాని ఫార్ములా. బీజేపీ తన నిరాశాజనకమైన సహజాతాన్ని అనుసరించి సాగించిన ప్రచార కార్యక్రమం ఆ గాలి ఎదురు తిరగడానికి దోహదపడి ఉండవచ్చు.

  ‘‘మీ అతి పెద్ద శత్రువు ఎవరు’’ అనే వాదనను తిరిగి మోదీ చేసిన మాట నిజమే.


 


కానీ ఆ ప్రచారం పూర్తిగా భయంగొలిపేటంతటి ఆధిక సంఖ్యాక వాదంతో సాగింది. భారత ముస్లింలు తమను పాకిస్తాన్‌తో ముడిపెట్టడాన్ని అసహ్యించుకుంటారు. అయితే, అదే అవమానాన్ని వారు తరచుగా ఎదుర్కోవాల్సి వచ్చింది.  బీఫ్ తినేవారంతా పాకిస్తాన్‌కు పోవాలని ఒకరంటే, షారూఖ్ ఖాన్ హృదయం పాకిస్తాన్‌లోనే ఉందని మరొకరు. వీటన్నిటినీ తలదన్నేది... బిహార్‌లో బీజేపీ ఓడిపోతే పాకిస్తాన్‌లో టపాకా యలు పేల్చి సంబరాలు చేసుకుంటారంటూ అమిత్ షా చేసిన హెచ్చరికే.

 


ఇది వెర్రిగా మనుగడ కోసం అనే పాత వైఖరికి తీసుకుపోయేది. వారిని పాకిస్తాన్‌కు ‘‘తిప్పి’’ పంపేస్తామనే బెదిరింపును ఇప్పుడు పదే పదే వల్లెవేయడం వారి విధేయతపట్ల బీజేపీ అనుమానాలను నిజమైనవిగా చేసింది. దీంతో వారిక ఈ ఎన్నికలను తమ భవిష్యత్తును ఆర్థికంగా మెరుగుపరుచుకునే అవకాశంగా చూడలేకపోయారు. తిరిగి భయం అనే నేల మాళిగలోకి వారి తిరిగి వెళ్లిపోయారు. తమ బలమంతా కూడగట్టుకుని పైకి వచ్చి... ఎవరు బీజేపీని ఓడించి, తమను రక్షిస్తారనిపిస్తే వారికి ఓటు చేశారు. ఒవైసీ తుడిచి పెట్టుకుపోవడం, డిపాజిట్లు గల్లంతవడం వంటివన్నీ దాని పర్యవసానాలే.


ప్రమాదకరమైన ఈ కాలంలో ఒవైసీ, అజ్మల్‌లు ఆధునికతకు చెందిన శక్తులు కావచ్చని ‘‘సూచించడం’’ అంటే నన్ను తిట్టిపోస్తారనే. అందుకు సిద్ధపడుతున్నాను. కానీ వారిద్దరూ ముస్లింల మనస్తత్వంలో వస్తున్న మార్పునకు కచ్చితమైన సంకేతాలు. తమ పాత ధోరణి నుంచి బయటపడి, తమ సొంత రాజకీయ ఉన్నత వర్గాలను తయారు చేసుకోవాలని ఈ కొత్త ధోరణి ముస్లింలను ఒప్పిస్తోంది. బిహార్‌లో బీజేపీ వేసిన తప్పుటడుగులు ఈ పరిణామ ధృతిని దెబ్బతీశాయి. 2014లో బీజేపీతో ముస్లింల సంబంధాలను మోదీ కొత్తగా నిర్వచించడం కోసం చేసిన ప్రయత్నం ఇప్పుడు విచ్ఛిన్నమైపోయింది. ముస్లింలు తిరిగి తమ ‘‘లౌకిక వాద’’, హిందూ పరిరక్షకులను కౌగిలించుకోడానికి పరుగులు తీస్తున్నారు.

 

 - శేఖర్ గుప్తా


twitter@shekargupta

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top