భారత్‌ టెకీలపై మరో పిడుగు..! | Bad News For Indian Techies Regarding H-4 Visa | Sakshi
Sakshi News home page

భారత్‌ టెకీలపై మరో పిడుగు..!

Apr 24 2018 9:27 PM | Updated on Apr 4 2019 3:25 PM

Bad News For Indian Techies Regarding H-4 Visa - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

అమెరికాలో పనిచేస్తున్న భారత టెకీలపై మరో పెద్ద పిడుగు పడనుంది.  హెచ్‌-1బి  వీసాదారుల జీవిత భాగస్వామి (భార్య లేదా భర్త) వర్క్‌ పర్మిట్ల తొలగింపుతో పాటు హెచ్‌-1బి వీసాల జారీ ప్రక్రియ క్రమబద్ధీకరణకు  డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ దిశలో చర్యలు తీసుకోనున్నట్టు కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నా, తాజా పరిణామాలు మాత్రం వాటిని నిజం చేసే విధంగానే ఉన్నాయి. వీటి ప్రభావం వేలాది మంది భారతీయులపై తీవ్రంగా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.  2015లో బరాక్‌ ఒబామా హయాంలో హెచ్‌-1బి వీసాహోల్డర్ల  జీవితభాగస్వాముల (భార్య లేదా భర్త)కు అక్కడ పనిచేసేందుకు చట్టం ద్వారా కల్పించిన ఈ అవకాశాన్ని ట్రంప్‌ ప్రభుత్వం ప్రస్తుతం  రద్దు చిట్టాలో చేర్చుతోంది. 

హెచ్‌-1బి వీసాదారుల  జీవిత  భాగస్వాములు చట్టపరంగా  పనిచేసేందుకు, వ్యాపారాలు చేసుకునేందుకు ఇప్పటివరకు వర్క్‌ పర్మిట్లు ఉపయోగపడుతూ వచ్చాయి. అయితే తాజాగా వీటి రద్దు ప్రణాళికలకు  అక్కడి ప్రభుత్వ యంత్రాంగం  తుదిరూపునిస్తోంది.   ఈ విషయాన్ని శాసనకర్తలకు (సెనెటర్లు)  అమెరికా పౌరసత్వం, వలస సేవల (యూఎస్‌సీఐఎస్‌) డైరెక్టర్‌ ప్రాన్సిస్‌ సిస్నా వెల్లడించారు.  వచ్చే ఆగస్టుకల్లా  దీనిని అమల్లోకి తెచ్చే విషయంపై  కార్యనిర్వాహక ఉత్తర్వు (ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌) జారీ కావచ్చని  తెలుస్తోంది.

‘ అమెరికాలో హెచ్-4 డిపెండెంట్‌ భాగస్వాములు ఉద్యోగం చేసేందుకు కల్పించే అధికారం రద్దుకు అవసరమైన మార్పులు తీసుకొచ్చే ఫ్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఈ పాత ఉత్తర్వుల స్థానంలో ప్రస్తుత ఇమిగ్రేషన్‌ సిస్టమ్‌లో అమెరికా ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు  కొత్త నిబంధనలు, మార్గదర్శకాలు ప్రతిపాదిస్తాం. దీనికి సంబంధించి ఇచ్చే నోటీస్, దానిపై స్పందించేందుకు ఇచ్చే నిర్ణీత కాలంలో తమ అభిప్రాయాలు తెలిపేందుకు ప్రజలకు అవకాశం ఉంటుంది ’  అని  సిస్నా స్పష్టంచేశారు.

గతంలో ఒబామా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల లక్షకు పైగా హెచ్-4 వీసాహోల్డర్లు లబ్దిపొందారు. హెచ్‌ 1బి భాగస్వాములు అమెరికాలో చట్టబద్ధంగా పనిచేసేందుకు అనుమతినిస్తూ హెచ్‌-4  వీసాలు ఇచ్చారు.  వీరిలో భారత అమెరికన్ల సంఖ్యే  ఎక్కువ. అక్కడ శాశ్వత నివాస హోదా(గ్రీన్‌కార్డ్‌) కోసం దరఖాస్తు చేసుకున్నాక ఆ ప్రక్రియ పూర్తయ్యేందుకు పదేళ్లు, అంతకుపైగానే సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో హెచ్‌-1బి వీసా హోల్డర్ల భార్య లేదా భర్త ఉద్యోగం చేసేందుకు వీలుగా  వర్క్‌ పర్మిట్ల జారీకి  ఒబామా ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రస్తుతం ఈ నిబంధననే రద్దు చేయాలని ట్రంప్‌ ప్రభుత్వం భావిస్తోంది.

హెచ్‌-4 ఏమిటీ ?
అమెరికాలో హెచ్‌-1బీ వీసాపై ఉంటూ ఉద్యోగాలు చేస్తున్నవారి జీవిత భాగస్వాములకు ఇచ్చే హెచ్-4 వీసా ద్వారా వర్క్‌ పర్మిట్‌ లభిస్తుంది. వీటి ద్వారా మనదేశానికి చెందిన  వేలాది మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రస్తుతం హెచ్‌-4 వీసాపై దాదాపు లక్ష మంది వరకు భారతీయులు ఆ దేశంలోనే ఉంటున్నారు.  2017లో మొత్తం 1,36,393 మందికి హెచ్-4 వీసాలివ్వగా  వాటిలో  భారతీయులు 1,17,522 మంది (86శాతం), చైనీయులు 4,770 మంది (3 శాతం), మెక్సికన్లు 2,066 మంది (2 శాతం) కి  వర్క్‌పర్మిట్లకు అనుమతినిస్తూ పత్రాలు జారీ చేసినట్టు ఓ అధ్యయనం వెల్లడించింది. గతేడాది మొదట్లో  హెచ్‌-4 వీసాతో పనిచేసేందుకు అనుమతి పొందిన వారిలో 94 శాతం మంది మహిళలున్నారు. వారిలోనూ  భారతీయులు  93 శాతం, చైనా నుంచి కేవలం నాలుగు శాతమే ఉన్నారు.

హెచ్‌-1బి క్రమబద్ధీకరణ
విదేశాలకు చెందిన ఉత్తమ మేథాశక్తి, నైపుణ్యాలను  ఆకర్షించే లక్ష్యంతో హెచ్‌-1బి వీసా జారీ ప్రక్రియలో అమెరికా ప్రభుత్వం మార్పులు తీసుకురానుంది. ఈ వీసాల కోసం మనదేశ టెకీలు అత్యధికంగా పోటీపడుతున్న నేపథ్యంలో వీటి జారీలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ట్రంప్‌ సర్కార్‌ భావిస్తోంది. హెచ్‌-1బి వీసా ప్రోగ్రామ్‌ను మరింత కట్టుదిట్టంగా అమలు చేసేందుకు వీలుగా  వీసాల జారీ సంఖ్యపై నియంత్రణ, లాటరీ విధానంలో మార్పులకు తెరతీయనుంది.

దీనితో పాటు అత్యున్నత నైపుణ్యం ఉన్న వారికే ప్రవేశం కల్పించేందుకు ప్రత్యేక వృత్తి అంటే ఏమిటన్న దానిపై గతంలో ఇచ్చిన నిర్వచనాలకు భిన్నంగా స్పష్టమైన వివరణనిస్తారు. అంటే సాంకేతికంగానూ, ఉన్నత డిగ్రీల పరంగానూ అత్యున్నతస్థాయిలో ఉన్న విదేశీయులకు అవకాశం కల్పిస్తారు. అమెరికన్‌ ఉద్యోగులు, వారికిచ్చే వేతనాలు పరిరక్షించడంలో భాగంగా ఉద్యోగం, యజమాని, ఉద్యోగి సంబంధాలపై స్పష్టతనిస్తారు.
–సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement